చిదంబరం పోటీకి దూరం
ఆయన స్థానం కుమారుడికికేటాయింపు
50 మందితో కాంగ్రెస్ నాలుగో జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నారు. చిదంబరం ప్రస్తుత లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళనాడులోని శివగంగ స్థానం నుంచి ఆయన కుమారుడు కార్తీ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ జమ్మూకాశ్మీర్‌లోని ఉధంపూర్ నుంచి పోటీచేయనున్నారు. అక్కడి సిట్టింగ్ ఎంపీ లాల్ సింగ్‌కు ఎమ్మెల్సీ సీటును కేటాయించే అవకాశాన్ని పార్టీ పరిశీలించనుంది. కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల కోసం గురువారం కార్తీ, ఆజాద్ సహా 50 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను గురువారమిక్కడ ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీ దీన్ని విడుదల చేశారు. ఇది విడుదల కాగానే కార్తీ మీడియాతో మాట్లాడుతూ.. తొమ్మిదిసార్లు పోటీ చేసిన తన తండ్రి, తనకు అవకాశమివ్వడానికి ఇదే సరైన సమయమని భావించారన్నారు.
అయితే చిదంబరం రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని స్పష్టం చేశారు. తాజా జాబితా ప్రకారం.. ఏఐసీసీ కార్యదర్శి తిరునావుక్కరసు రామనాథపురం(తమిళనాడు) నుంచి, పశ్చిమ, దక్షిణ ఢిల్లీల నుంచి సిట్టింగ్ ఎంపీలు మహాబల్ మిశ్రా, రమేశ్ కుమార్‌లు బరిలోకి దిగనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ మధ్యప్రదేశ్‌లోని విదిశలో బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్‌ఎంపీ సుష్మా స్వరాజ్‌పై పోటీ చేయనున్నారు. గుజరాత్ మాజీ మంత్రి కిరిట్ పటేల్ ఆ రాష్ట్రంలోని గాంధీనగర్‌లో బీజేపీ నేత అద్వానీపై పోటీకి దిగారు. రెండో జాబితాలో గుజరాత్‌లోని పంచమహల్ సీటుకు ఖరారైన దిగ్విజయ్ అల్లుడు పరాంజయాదిత్య సింగ్ పర్మార్ పేరును తాజా జాబితా నుంచి తీసేసి, ఆ స్థానంలో రామ్‌సింగ్ పర్మార్‌కు టికెట్ ఇచ్చారు. కేంద్ర మాజీ మంత్రులు మణిశంకర్ అయ్యర్ మయిలదుత్తురైలో, ఆర్.ప్రభు కోయంబత్తూర్(తమిళనాడు)లో పోటీ చేయనున్నారు. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో ఇదివరకు ప్రకటించిన అభ్యర్థిని మార్చి, బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జేడీయూ బహిష్కృత ఎంపీ పూర్ణమశి రామ్‌కు అవకాశమిచ్చారు. ఇదే రాష్ట్రంలోని హాజీపూర్, పాట్నా సాహెబ్‌లలో అభ్యర్థులను మార్చారు. తాజా జాబితాతో హస్తం పార్టీ అభ్యర్థుల సంఖ్య 364కు చేరింది.