సీపీఐ రాజీ రాగం
కాంగ్రెస్‌తో పొత్తులో దక్కిందే చాలనుకుంటున్న వైనం
తెలంగాణలో ఏడు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికే పరిమితం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే స్థానాలతోనే సర్దుకుపోవాలని సీపీఐ నిర్ణయానికొచ్చింది. పొత్తులో దక్కిందే చాలనుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. తెలంగాణలో కాం గ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. సీపీఐకి తొమ్మిది అసెంబ్లీ, ఓ లోక్‌సభ సీటును కేటాయించేందుకు కాంగ్రెస్ మొదట హామీ ఇచ్చింది. ఇందులో కూడా సీపీఐ పట్టుబట్టిన స్థానాలు కాకుండా కాంగ్రెస్‌కు నచ్చిన స్థానాలిస్తామన్నా.. కమ్యూనిస్టులకు మరో గత్యంతరం లేకపోయింది. తీవ్ర తర్జనభర్జన అనంతరం సీట్ల సర్దుబాటుకు సరేనన్నారు. ఈమేరకు సీపీఐ తన వాటా సీట్లకు అభ్యర్థులనూ ప్రకటించింది. అయితే వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ సీటును సీపీఐకి కేటాయించి.. ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించడంతో కామ్రేడ్ల కళ్లు బైర్లుకమ్మాయి. అలాగే నల్లగొండ జిల్లా కోదాడలోనూ కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీమణికి అవకాశమిచ్చి సీపీఐని ఏడు సీట్లకే కాంగ్రెస్ పరిమితం చేసింది. దీంతో ఆ పార్టీ పెద్దలను నిలదీయాలని సీపీఐ అగ్రనాయకత్వం మొదట భావించింది. టీ-పీసీసీ అధ్యక్షుడు పొన్నాలను ఫోన్‌లో సంప్రదించినా ఫలితం లేకపోయింది. ‘నా చేతిలో ఏం లేదు. మీ ఇష్టం’ అని పొన్నాల చేతులెత్తేసినట్టు సమాచారం. దీంతో కుదేలయిన కామ్రేడ్లు.. దక్కిన వాటితోనే సంతృప్తి పడదామన్న భావనకు వచ్చారు.
బలమున్న స్థానాలకు తిలోదకాలు!
కాంగ్రెస్‌తో పొత్తు కోసం సీపీఐ తనకు బలమున్న స్థానాలను వదులుకుంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, మెదక్ జిల్లా నర్సాపూర్‌లను కేటాయించాలని కామ్రేడ్లు పట్టుబట్టారు. కాంగ్రెస్ మాత్రం ససేమిరా అని తోసిపుచ్చింది. చివరికి బెల్లంపల్లి, మునుగోడు, దేవరకొండ, కొత్తగూడెం, వైరా, పినపాక, మహేశ్వరం అసెంబ్లీ సీట్లతోనే సీపీఐ సరిపెట్టుకుంటోంది. ఇక, కోదాడ సీటుకు సంబంధించి నల్లగొండ జిల్లా సీపీఐ నేతలతో కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంతనాలు జరిపినట్టు సమాచారం. కోదాడలో పోటీ చేయనున్న తన సతీమణికి మద్దతివ్వాలని ఆయన కోరారు. దీనికి సీపీఐ నేతలు అయిష్టంగానే తలూపినట్టు సమాచారం.