- ఆర్డినెన్సు స్థానంలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో సంస్కరణలకు ఉద్దేశించిన రెండు బిల్లులను ప్రభుత్వం ఈ వారం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. 214 బొగ్గు క్షేత్రాల కేటాయింపును సుప్రీం కోర్టు రద్దు చేసిన నేపథ్యంలో తీసుకువచ్చిన ఆర్డినెన్సుల స్థానంలో వీటిని ప్రవేశపెడ్తున్నారు. బొగ్గు వెలికితీత, అమ్మకాల్లో ప్రైవేటు సంస్థలను అనుమతించే ఆ ఆర్డినెన్సును కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి.
టెక్స్‌టైల్స్ అండర్‌టేకింగ్స్ ఆర్డినెన్స్‌కు ప్రత్యామ్నాయ బిల్లును సోమవారమే సభలో ప్రవేశపెట్టనున్నారు. వాణిజ్య నౌకల నిర్వహణకు సంబంధించిన రెండు మర్చంట్ షిప్పింగ్ సవరణ బిల్లులను, తమిళనాడు, అస్సాంలలో శాసనమండలులకు సంబంధించిన రెండు బిల్లులను, కాలం చెల్లిన చట్టాల రద్దుకు ఉద్దేశించిన రెండు బిల్లులను, స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్ బిల్లులనూ సభ ముందుంచనున్నారు.
లోక్‌సభ ఆమోదించిన హైజాకింగ్ వ్యతిరేక బిల్లు , ట్రిపుల్‌ఐటీ, కాన్సిట్యూషన్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ సవరణ బిల్లులను రాజ్యసభ ఆమోదానికి పంపనున్నారు. తాజా సమావేశాల తొలివారంలోనే లోక్‌సభలో ఐదు, రాజ్యసభలో రెండు బిల్లులను ఆమోదించారు.
లోక్‌సభలో ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్(సవరణబిల్లు)ను, సెంట్రల్ వర్సిటీల సవరణ బిల్లు, ఐఐఐటీ బిల్లు, షెడ్యూల్ కులాల ఆర్డర్ల సవరణ బిల్లులు ఆమోదం పొందాయి. రాజ్యసభ కార్మిక చట్టాల సవరణ, అప్రెటిసెస్ యాక్ట్, ఢిల్లీ స్పెషల్ పోలీస్ సవరణబిల్లులను ఆమోదం తెలిపింది.