వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలి
ఎస్సీఈయూ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి
గోదావరిఖని : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి సీఎండీకి రాసిన బహిరంగ లేఖను జీడీకే-1,3 గ్రూప్ గనిపై శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015-16 ఆర్థిక సంవత్సరంలో కార్మికులు కష్టించి కంపెనీకి రూ.వెయ్యి కోట్లకుపైగా లాభాలు సాధించి పెట్టారని తెలిపారు.
ఈ సందర్భంగా వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలి, సకలజనుల సమ్మె వేతనాలు, కోల్ ఇండియా ఒప్పందాలను అమలు చేయాలని, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, హైపవర్ కమిటీ వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. లాభాల్లో కాంట్రాక్టు కార్మికులకు కూడా వాటా ఇవ్వాలని కోరారు. కాంట్రాక్టు కార్మికుల ద్వారానే లాభాలు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో టి.నరహరిరావు, మెండె శ్రీనివాస్, కొమురయ్య, మచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.