సమ్మె వేతనాల్లో అన్యాయాన్ని సవరించాలి
హెచ్ఎమ్మెస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు పేరం రమేశ్
నల్లబ్యాడ్జీలతో నిరసన
శ్రీరాంపూర్ : సకల జనుల సమ్మె వేతనాల్లో కొందరు కార్మికులకు అన్యాయం జరుగుతోందని, దీన్ని సవరించాలని హెచ్ఎమ్మెస్ శ్రీరాంపూర్ బ్రాంచి ఉపాధ్యక్షుడు పేరం రమేశ్ తెలిపారు. అత్యవసర సిబ్బందికి సమ్మె వేతనాలు చెల్లించాలని డిమాండ్ చే స్తూ శుక్రవారం ఆ యూనియన్ కార్యాలయంలో ఎస్అండ్పీసీ కార్యాలయం, ఇతర డిపార్టుమెంట్లలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం ఆర్కే 5 కాలనీలోని ఆ యూనియన్ కార్యాలయంలో ఆఫీసు బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాజమాన్యం ఇచ్చే వేతనాల్లో కార్మికుల మధ్య చిచ్చుపెడుతోందని తెలిపారు.
లీవులు పెట్టుకున్న కార్మికులకు లీవులు ఇస్తామంటున్నారని తెలిపారు. అత్యవసర సిబ్బంది గనులు నడపడానికి ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో విధులు చేయించారని ఇప్పుడు వారికి సమ్మె వేతనం ఇవ్వకపోవడం అన్యాయం అన్నారు. ప్రతీ కార్మికుడికి సమ్మె వేతనం చెల్లించాలని, ఇచ్చే లీవులు కూడా ఎన్‌క్యాష్ చేసుకునే విధంగా ఇవ్వాలని పేర్కొన్నారు. యాజమాన్యం తన నిర్ణయాన్ని పునసమీక్షించుకుని లీవులు వాడుకోని వారికి ఎన్‌క్యాష్‌మెంట్ చేయాలని, అత్యవసర సిబ్బందికి కూడా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ బ్రాంచి సెక్రెటరీ తిరుపతిగౌడ్, అధికారి ప్రతినిధి ఎం.రాజేంద్రప్రసాద్, నాయకులు ముస్కె సమ్మయ్య, కొమురయ్య, అర్జున్ పాల్గొన్నారు.