తీరంలో కలవరం
నగరం, న్యూస్‌లైన్: గుర్తు తెలియని మృతదేహాలు తీరప్రాంత ప్రజల్ని కలవరపెడుతున్నాయి. 20 రోజుల వ్యవధిలోనే మూడు మృతదేహాలను గుర్తించడం కలకలం సృష్టించింది. అసలు ఈ మృతదేహాలు ఎవరివి..? ఈ ప్రాంతంలోనే హత్యకు గురయ్యారా... ఎక్కడో హత్యచేసి మృతదేహాలను ఈ ప్రాంతంలో పడవేస్తున్నారా..? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. మిస్టరీగా మారిన ఈ కేసుల ఛేదన పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.
నగరం మండలం మీసాలవారిపాలెం సమీపంలో రేపల్లె-నిజాంపట్నం రహదారి కల్వర్టుపై ఈ నెల 10వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత పది రోజుల వ్యవధిలోనే మరో ఘటన వెలుగు చూసింది. ఇదే ప్రాంతంలోని పంట పొలాల్లో 21వ తేదీన గుర్తుతెలియని మరో మృతదేహం కంటపడింది. మృతదేహాన్ని ఆలస్యంగా గుర్తించడంతో సంఘటన స్థలంలో కేవలం ఎముకల గూడు మాత్రమే లభించింది.
ఈ రెండు ఘటనలు ఎలా జరిగాయోనని పోలీసుల విచారణ చేస్తున్న తరుణంలోనే తాజాగా 28వ తేదీ ఆదివారం పెదమట్లపూడిలోని కొమరోలు పంట కాల్వ కట్టపై మరో మృతదేహం వెలుగుచూడడం గమనార్హం! మృతదేహాలను జన సంచారం లేని ప్రాంతాల్లో పడవేస్తున్నారంటే ఈ ఘటనలతో స్థానికులకు ఎవరికో సంబంధం ఉండి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ వరుస ఘటనలు తీర ప్రాంత ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
మృతదేహం వెలికితీత.. పెదమట్లపూడి శివారు కొమరోలు పంటకాల్వ కట్టపై పూడ్చిపెట్టిన మృతదేహాన్ని ఆదివారం పోలీసులు వెలికితీశారు. తహశీల్దార్ సైకం జగన్మోహన్రావు పర్యవేక్షణలో పోలీసులు మృతదేహానికి శవసంచనామా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ వైద్యులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. మృతుని తలపై బలమైన గాయం, గొంతుపై కత్తి గాట్లు ఉన్నట్లు గుర్తించారు. తలపై బండరాయితో మోది చాకుతో పీక కోసి చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలోనే కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన హత్యకు గురైన వ్యక్తి మృతదేహంపై కూడా ఇలాంటి గుర్తులే ఉండటంతో ఈ రెండు హత్యలకు పాల్పడింది ఒక్కరే అయి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆదివారం వెలికి తీసిన మృతదేహం చేతులు కట్టేసి ఉన్నాయని, ఎరుపు రంగు టీ షర్టు ధరించి ఉన్నట్లు స్థానిక ఎస్ఐ రామిశెట్టి ఉమేష్ తెలిపారు. మృతుడి వయస్సు 35 ఏళ్లు ఉంటుందని చెప్పారు. వీఆర్వో రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని ట్రైనీ డీఎస్పీ మహేష్, సీఐ సూర్యనారయణరెడ్డిలు పరిశీలించారు. కార్యక్రమంలో నిజాంపట్నం ఎస్ఐ బాబూరావు, ట్రైనీ ఎస్ఐలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.