‘కోస్టల్ గోల్డ్’ నుంచి విషవాయువులు
ఎస్.రాయవరం, న్యూస్‌లైన్: మండలంలోని ధర్మవరం వద్ద ఉన్న కోస్టల్ గోల్డ్‌రొయ్యల పరిశ్రమ నుంచి గురువారం విడుదలయిన విషవాయువుల కారణం గా 11మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడం తో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ఈ పరిశ్రమలో ఒడిశాతోపాటు విశాఖ, విజయనగరం, కాకినాడ, ఒంగోలు ప్రాంతాల నుంచి రొయ్యలను తీసుకువచ్చి ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఇందులో సుమారు 100 మంది మహి ళా కార్మికులు పని చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం కార్మికులు విధుల్లో ఉండగా ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి ఘాటైన వాయువులు విడుదలయ్యాయి.
విధుల్లో ఉన్న కార్మికులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. నక్కపల్లి మండలం డి.ఎల్.పురం, బుచ్చిరాజుపేట, రాజయ్యపేట గ్రామాలకు చెందిన గంపల గంగ, జి.రమాదేవి, జి.సువర్ణ, బొంది మణి, గరికిన రత్నం, గరికిన భవానీ, యజ్జల అపర్ణ, సారిపల్లి రాము, కోడ నూకరత్నం, పైడికొండ జ్యోతి, ఎస్.రాయవరం మండలం ఉప్పరాపల్లికి చెందిన కోన వరలక్ష్మి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. వారి శరీరంపై దద్దుర్లు వచ్చాయి. బాధితులను నక్కపల్లి 30పడకల ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న నక్కపల్లి మండలం రాజయ్యపేటకు చెందిన సారిపల్లి రామును ఎకాయెకిన విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. పరిశ్రమలో విషవాయువులు పీల్చడమే ఇందుకు కారణమని అక్కడి వైద్యులు తెలిపారు
పరిశ్రమను ఎస్.రాయవరం తహశీల్దార్ బాబుసుందరం పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న వ్యర్థజలాల వల్ల ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికే దీనిపై యాజమాన్యాన్ని హెచ్చరించామని తహశీల్దార్ విలేకరులకు తెలిపారు. సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి ఆర్డీఓ, జిల్లా కలెక్టర్లకు నివేదిక పంపుతామన్నారు. దీనిపై ఎస్.రాయవరం పోలీసులు కూడా విచారణ ప్రారంభించారు.