మరో 'ముంబై ముట్టడి' ఉండచ్చేమో!!
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం మీద 2008లో జరిగిన ఉగ్రదాడి తర్వాత తీరప్రాంత రక్షణను గణనీయంగా బలోపేతం చేసినట్లు కోస్ట్‌గార్డ్ చీఫ్ ఏజీ తప్లియాల్ తెలిపారు. అయితే.. సముద్రమార్గంలో అలాంటి దాడి మరోటి జరిగే అవకాశాలు మాత్రం లేకపోలేవన్నారు. తాము ఒకలా ఆలోచిస్తే ఉగ్రవాదులు మరోలా ఆలోచించి దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు.
ముంబై తీరానికి చేరుకోడానికి ఉగ్రవాదులు డింగీ అనే చిన్న బోటును ఉపయోగించిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించినప్పుడు.. 20 మీటర్ల కన్నా చిన్న పరిమాణంలో ఉండే బోట్లను కూడా గుర్తించే పరిజ్ఞానాన్ని తాము పెంపొందించుకుంటున్నామన్నారు. మత్స్యకారులను కూడా అప్రమత్తం చేసి, చిన్న బోట్లను గుర్తించేలా తయారుచేస్తున్నామన్నారు.