Oscars 2022: ఆస్కార్ గెలిచిన ‘కోడా’ మూవీ కథేంటంటే..
కోడా కథ... స్టార్ ఇమేజ్, భారీ బడ్జెట్, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్.. వీటికన్నా ఈసారి ఆస్కార్ కమిటీ కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చిందనడానికి నిదర్శనం ‘కోడా’ని ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయడం. ఫ్రెంచ్ చిత్రం ‘లా ఫామిల్లె బెలియర్’ ఆధారంగా దర్శకురాలు సియాన్ హెడెర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంగీతంలో రాణించాలన్న రూబీ అనే యువతి, ఆమె కుటుంబం చుట్టూ ఈ సినిమా ఉంటుంది.
రూబీకి తప్ప మిగతా కుటుంబ సభ్యులకు వినికిడి లోపం ఉంటుంది. కుటుంబ పోషణకు తల్లిదండ్రులకు చేపల వేటలో సాయం చేస్తూనే గాయకురాలిగా తన కలను నిజం చేసుకోవడానికి రూబీ పడే మానసిక వేదనే ఈ సినిమా. బలమైన భావోద్వేగాలతో పాటు సునిశితమైన కామెడీ కూడా ఈ సినిమాకు బలంగా నిలిచింది. ఈ మూవీలో రూబీ పాత్రధారి మినహా ఇందులో నటించిన నటీనటుల్లో ఎక్కువ శాతం మంది నిజంగానే వినికిడి లోపం ఉన్నవారే. ‘ఉత్తమ చిత్రం’గానే కాదు ఉత్తమ అడాపె్టడ్ స్క్రీన్‌ప్లే విభాగంలో సియాన్ హెడెర్, ఉత్తమ సహాయ నటుడి విభాగంలో ఈ చిత్రానికిగాను ట్రాయ్ కోట్సర్ ఆస్కార్ అందుకున్నారు.
సైన్ లాంగ్వేజ్‌తో ప్రసంగం
నటి మార్లీ మాట్లిన్ తర్వాత డిఫరెంట్లీ ఎబుల్డ్ పీపుల్‌లో ఆస్కార్ అందుకున్న రెండో వ్యక్తి ట్రాయ్ కోట్సర్. అంతకుముందు ‘చిల్డ్రన్ ఆఫ్ ఎ లెస్సర్ గాడ్’ (1987)కి గాను మార్లీ మాట్లిన్ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. తాజా చిత్రం ‘కోడా’లో ఆమె ట్రాయ్ భార్యగా నటించారు. కాగా, అవార్డు అందుకున్న తర్వాత సైన్ లాంగ్వేజ్‌తో తమ భావాలను వ్యక్తపరిచారు. ట్రాన్స్‌లేటర్ ఆ లాంగ్వేజ్‌ని ట్రాన్స్‌లేట్ చేసి, వినిపించారు.