విద్యార్థికి విద్యుదాఘాతం.. పరిస్థితి విషమం
పుంగనూరు(చిత్తూరు): బస్సు పైన కూర్చొని కళాశాలకు వెళ్లేందుకు ప్రయాణిస్తున్న సమయంలో విద్యుత్ తీగలు తగిలి, కిందపడి తీవంగ్రా గాయపడ్డాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ వద్ద గురువారం ఉదయం జరిగింది. వివరాలు.. చౌడేపల్లి మండలం పొన్నిపెంట గ్రామానికి చెందిన జి. భాస్కర్(17) పుంగనూరులోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బస్సులో ప్రయాణికులు నిండుగా ఉండటంతో పైన కూర్చుని ప్రయాణిస్తుండగా దురదృష్టవశాత్తూ ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రతిరోజూ లాగానే ఈరోజు కూడా కళాశాలకు వెళ్లడానికి ప్రైవేటు బస్సును ఆశ్రయించాడు. బస్సులో రద్దీ ఎక్కువగా ఉండటంతో బస్సు పైన ఎక్కి కూర్చున్నాడు. బస్సు చౌడెపల్లి మండలం బోయకొండ సమీపంలోకి చేరుకోగానే.. పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి భాస్కర్ బస్సు పై నుంచి కిందపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 సాయంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా.. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు నిర్ధరించారు.