1000 డాలర్ల మార్కును చేధించిన ఆ కరెన్సీ
లండన్ : ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి అధికార నియంత్రణ సంస్థలేని కరెన్సీగా ప్రాముఖ్యంలోకి వచ్చిన బిట్ కాయిన్ ధర సోమవారం భారీగా ఎగిసింది. మూడేళ్లకు పైగా గరిష్టస్థాయిలో వెయ్యి డాలర్ల మార్కును చేధించింది. 2013 నవంబర్ నుంచి ఇదే అత్యధిక గరిష్ట స్థాయని కాయిన్ డెస్క్ డేటా రిపోర్టు చేసింది. దీన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కసారిగా 16 బిలియన్ డాలర్లకు పైగా ఎగిసినట్టు పేర్కొంది.
యువాన్ విలువను డీవాల్యుయేషన్ చేయడం, భౌగోళిక అంశాలు, అసెట్ క్లాస్‌పై పెట్టుబడిదారులు ఎక్కువగా శ్రద్ధ చూపించడం వంటివి బిట్ కాయిన్ విలువను గత కొద్దీ నెలలుగా పైకి పెరగడానికి దోహదం చేస్తున్నాయని విశ్లేషకులు చెప్పారు. చైనాలో ఎక్కువగా బిట్‌కాయిన్‌లోనే ట్రేడింగ్ జరుపుతున్నారని తెలిసింది.
యువాన్‌ను డీవాల్యుయేషన్ చేయడం మూలధనం నియంత్రణపై ఆందోళనలు రేకెత్తించిందని, దీంతో డిజిటల్ కరెన్సీపై పెట్టుబడిదారులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ప్రభుత్వ జోక్యం లేకపోవడంతో ఎంతో సురక్షిత సాధనంగా దీనికి బాగా గుర్తింపు లభిస్తోంది. కేవలం కంప్యూటర్‌తోనే లావాదేవీలను చకాచకీగా ముగించేయొచ్చు. ఇటీవల కేంద్రప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రకటించడం కూడా దేశీయంగా పెట్టుబడిదారులను ఈ కరెన్సీపై ఎక్కువగా దృష్టిసారించేలా చేసింది.