colectorate
-
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
కర్నూలు(అగ్రికల్చర్): ‘జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగి ప్రయాణికుల ప్రాణాలు పోతు న్నా పట్టించుకోరు.. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోరు.. ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా?’ అంటూ నేషనల్ హైవే అధికారులపై కలెక్టర్ వీరపాండియన్ నిప్పులు చెరిగారు. హైవేలపై తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో కలెక్టర్.. రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుకు తీసుకున్న చర్యలపై వివరాలు కోరగా సంబంధిత హైవే అథారిటీ అధికారులు రాలేదని వెల్లడి కావడంతో కలెక్టర్ మండిపడ్డారు. ఎన్‌హెచ్ –44, 40 పీడీలు రవీంద్ర రావు, చంద్రశేఖర్‌రెడ్డి గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి భద్రత కమిటీ సమావేశం ఉన్నపుడే మీకు ఇతర సమావేశాలుంటాయా? ఉంటే ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత లేదా అంటూ విరుచుకుపడ్డారు. ప్రతి మీటింగ్‌కూ ఇలాగే చేస్తున్నారని పేర్కొన్న కలెక్టర్.. గతంలో వీరు ఏఏ సమావేశాలకు హాజరు కాలేదో వివరాలివ్వాలని రవాణా అధికారులను ఆదేశించారు. ‘ప్రమాదాలు జరుగుతు న్నా సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నివారణ చర్యలు తీసుకోవాలని రహదారి భద్రత కమిటీ ఆదేశించినప్పటికీ పెడచెవిన పెడుతున్నారు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది’ అంటూ ధ్వజమెత్తారు. ఇకపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోకపోతే వారిపైనే క్రిమినల్ కేసులు పెడతామని స్పష్టం చేశా రు. ఎన్‌హెచ్– 40, 44 అభివృద్ధి, మరమ్మతు పనులకు ఇసుక, విద్యుత్ సరఫరా నిలిపేయాలని అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారుల స్థానంలో వచ్చిన కిందిస్థాయి అధికారులను బయటకు వెళ్లాలని ఆదేశించారు. ‘ఇటీవలే వెల్దుర్తి వద్ద ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఇలాంటి ప్రమాదాలు నిత్యకృత్యమయ్యా యి. చర్చించి చర్యలు తీసుకుందామంటే నిర్లక్ష్యం పేరుకుపోయింది’ అంటూ మండిపడ్డారు. వారు వచ్చిన తర్వాతే సమావేశం నిర్వహిస్తామంటూ అర్ధాంతరంగా ముగించారు. ఎస్పీ పక్కీరప్ప, ఇన్చార్జ్ డీటీసీ కృష్ణారావు, ఆర్డీఓ పాల్గొన్నారు. -
‘మిషన్ భగీరథ’ పనులను పూర్తి చేయాలి
జనగామ అర్బన్ : జిల్లాలో మిషన్ భగీరథ పనులను సకాలంలో పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం సాయంత్రం అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 90శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పది శాతం పనులను మే పదో తేదీ వరకు పూర్తి చేయాలన్నారు. ఇందుకు అవసరమైన చర్యలను కలెక్టర్‌తో పాటు మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ విజయ్‌పాల్‌రెడ్డి, ఎస్ఈ ఏసురత్నాల నుంచి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులను ఉపేక్షించేది లేదన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్నీ గ్రామాల్లో అర్హులైన వారి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓ వైపు పనులు చేస్తూనే మరోవైపు మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీరు సురక్షితమైందనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ జఫర్‌గఢ్ మండలంలో కూడా మిషన్ భగీరథ పనులను సాధ్యమైనంత తర్వగా పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎంపీ బూరనర్సయ్య గౌడ్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అధికారులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించరూ...!
భువనగిరి టౌన్ : స్థానిక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని వివిధ మండలాల నుంచి ప్రజలు వచ్చి సమస్యలు పరిష్కరించాలని కోరారు. రేషన్‌కార్డు, పెన్షన్ ఇప్పించాలని వేడుకున్నారు. మరికొందరు వ్యక్తిగత సమస్యలపై జాయిం ట్ కలెక్టర్ జి.రవినాయక్, జిల్లా రెవెన్యూ అధికారి రావుల మహేందర్‌రెడ్డికి వినతులు సమర్పించారు. చౌటుప్పుల్ మండలం కేసారం గ్రామానికి చెందిన జె.నరేష్ ఎస్సీ కార్పొరేషన్ రుణం కోసం తనను ఎంపిక చేశారని, ఇప్పటి వరకు లోను మంజూరు చెయ్యలేదని వినతి పత్రం అందజేశారు. చౌటుప్పుల్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మర్చాలని, అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రత్యక్షంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చౌటుప్పుల్ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విన్నవించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణం ఇప్పించాలని కోరుతూ రాజాపేట మండలం బేగంపేట గ్రామానికి చెందిన జెల్ల స్వరూప వినతి పత్రం అందజేశారు. బస్వాపురం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న బీఎన్ తిమ్మాపురంలో ఇంటి పన్నులు వసూలు చేయకుండా మినహాయింపు ఇవ్వాలని కోరుతూ బీఎన్ తిమ్మాపురం గ్రామ మాజీ సర్పంచ్ రావుల అనురాధనందు విన్నవించారు. విలీన ప్రతిపాదన విరమించుకోవాలి భువనగిరి మున్సిపాలిటీ విలీనం కోసం ప్రతిపాదించిన గ్రామాల నుంచి గూడూరును మినహాయించాలి. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అనే నానుడి మరిచి పట్టణాలను సుందరీకరించుకునేందుకు విలీనం చేయడం సబుకాదు. మున్సిపాలిటీలో మా గ్రామం కలపడం ద్వారా ఉపాధి హామీ పథకం కోల్పోతాము. దీంతో గ్రామంలో ఉన్న బడుగు, బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. తక్షణమే మున్సిపాలిటీలో విలీన ప్రతిపాదన విరమించుకోవాలి. – గూడూరు గ్రామప్రజలు అన్ని మగ్గాలకు జియో ట్యాగింగ్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ నంబర్లు ఇస్తుంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిజమైన చేనేత కార్మికులు ఇంత వరకు జియో ట్యాగింగ్ నంబర్ కేటాయించలేదు. కొంత మంది మగ్గం పని చెయ్యని వారికి జియో ట్యాగింగ్ నంబర్ కేటాయించారు. జియో ట్యాగింగ్ లేకపోవడంతో కార్మికులు త్రిఫ్ట్ ఫండ్, నూలు యారన్ సబ్సిడీ, ముద్ర రుణాలు పొందలేక పోతున్నారు. తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి. – తెలంగాణ చేనేత కార్మిక సంఘం నాయకులు మోదుగుకుంటలో ఎలకబావిని చేర్చొద్దు ఆత్మకూర్(ఎం) మండలంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మోదుగుకుంట గ్రామ పంచాయతీలో ఎలకబావిని చేర్చొద్దు. మొరిపిరాల గ్రామ పంచాయతీ పరిధిలో యాధావిధిగా ఉంచాలి. ఈ గ్రామమే దగ్గరగా ఉంటుంది. రవాణా సౌకర్యానికి అనువుగా ఉంది. తక్షణమే అధికారులు స్పదించి యాధావిధిగా మొరిపిరాల గ్రామ పంచాయతీలో ఎలకబావిని ఉంచాలి. – ఎలకబావి గ్రామ ప్రజలు -
కలక్టరేట్ వద్ద వీఆర్వోల ఆందోళన
కరీంనగర్ : ఎంతోకాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వీర్వోలు బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద భైటాయించారు. కనీసవేతనాలు అమలు చేయాలన డిమాండ్ చేశారు. నాల్గోతరగతి ఉద్యోగులు తమను గుర్తించాలని నినదించారు. 010 పద్దు కింది జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బండెడు చాకరీ చేస్తున్న వీర్వోలపై తెలంగాణ సర్కార్ చిన్నచూపు చూస్తోందని వారు ఆరోపించారు. ఇప్పటికైన తమ డిమాండ్లు పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.