సమీక్షలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, చిత్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు
జనగామ అర్బన్ : జిల్లాలో మిషన్ భగీరథ పనులను సకాలంలో పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం సాయంత్రం అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 90శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పది శాతం పనులను మే పదో తేదీ వరకు పూర్తి చేయాలన్నారు. ఇందుకు అవసరమైన చర్యలను కలెక్టర్‌తో పాటు మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ విజయ్‌పాల్‌రెడ్డి, ఎస్‌ఈ ఏసురత్నాల నుంచి తీసుకోవాలన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులను ఉపేక్షించేది లేదన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్నీ గ్రామాల్లో అర్హులైన వారి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓ వైపు పనులు చేస్తూనే మరోవైపు మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీరు సురక్షితమైందనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ జఫర్‌గఢ్ మండలంలో కూడా మిషన్ భగీరథ పనులను సాధ్యమైనంత తర్వగా పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.
సమావేశంలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎంపీ బూరనర్సయ్య గౌడ్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment