సహకరించండి
ఖమ్మం జెడ్పీసెంటర్: నేటి సమగ్ర సర్వేకు ప్రజలందరూ సహకరించాల్సిందిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. ఇలంబరితి కోరారు. ప్రజల సామాజిక, ఆర్థికస్థితిగతులను తెలుసుకునేందుకే ఈ సర్వే చేపట్టామన్నారు. దీని నుంచి ఆంధ్రపదేశ్‌లో కలిసిన ఏడు మండలాలను మినహాయించినట్లు తెలిపారు. అక్కడ సర్వేను సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. కలెక్టరేట్లో సోమవారం ఆయనను కలిసిన విలేకరులతో మాట్లాడారు.
జిల్లావ్యాప్తంగా 39 మండలాల్లో సమగ్ర సర్వే నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేశామన్నారు. ఇప్పటికే ఏడు మండలాలను ఆంధ్రపదే శ్లో కలుపుతూ ఆర్డినెన్స్ పాస్ అయిందన్నారు. న్యాయపరమైన వ్యవహారాలు, డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ అమలు, ప్రభుత్వ నిర్ణయానుసారం ముంపు ప్రాంతాల్లో సర్వే చేయటం లేదన్నారు. ఈ సర్వేతో పథకాలు రద్దు కావని, అదనపు సౌకర్యాలు కల్పించటం కోసమే అన్నారు. ప్రజలు అనుమానాలు, అపోహలకు గురికావద్దన్నారు.
సమాచారం అసంపూర్తిగా కాకుండా నిజాలు వెల్లడించాలన్నారు. ఇప్పటికే ప్రతి ఇంటికి వెళ్లి హౌస్‌హోల్డింగ్ సర్వే చేసి, స్టిక్కర్లు అంటించామన్నారు. జిల్లావ్యాప్తంగా 99 శాతం స్టిక్కరింగ్ పూర్తయిందన్నారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి మారుమూల ప్రాంతంలో సైతం ఎలక్షన్ మాదిరిగా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 33వేల మంది ఎన్యూమరేట్లర్లకు శిక్షణ ఇచ్చామన్నారు. రహదారులు సరిగా లేని గిరిజన గ్రామాలకు సైతం ఎన్యూమరేటర్లను కార్లు, జీపులు, లాంచీల్లో పంపించామన్నారు.
ప్రజలు ఎన్యూమరేటర్లకు సహకరించాలన్నారు. సర్వేకు అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచితే ఎన్యూమరేటర్ల పని సులవవుతుందన్నారు. స్టిక్కరింగ్ లేని కుటుంబాలను ప్రత్యేకంగా పరిశీలించి సర్వే చేసేందుకు మొబైల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. ఖమ్మం నగరపాలక సంస్థ సర్వే ప్రత్యేక అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ను నియమించామన్నారు.
నేడు సెలవు..
అత్యవసర సేవలు అందించే సంస్థలు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కార్యాలయాలకు ప్రభుత్వం మంగళవారం సెలవుదినంగా ప్రకటించిందన్నారు. సమగ్ర సర్వేలో పాల్గొనేందుకు అన్ని సంస్థలూ ఉద్యోగులకు సెలవు ఇవ్వాల్సిందే అన్నారు. ఫిర్యాదులుంటే టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.