‘ఆరోఖ్య’ ఆగ్రహం
గామీణులకు ప్రాణాధారమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండాలని, సేవలు సక్రమంగా కొనసాగాలని కలెక్టర్ ఆరోఖ్యరాజ్ ఆదేశించారు.
దేవరాపల్లిమండలంలో సుడిగాలి పర్యటన జరిపిన ఆయన పీహెచ్‌సీని అకస్మాత్తుగా తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది వ్యవహార శైలిపై ఆగ్రహించారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించి పాఠశాలలను సైతం తనిఖీ చేశారు. బోధన సక్రమంగా సాగకపోవడంపై కన్నెర్ర చేశారు. దేవరాపల్లి,
దేవరాపల్లి మండలంలో సుడిగాలి పర్యటన జరిపిన కలెక్టర్ ఆరోఖ్యరాజ్ ముందు పీహెచ్‌సీని పరిశీలించారు. ఆస్పత్రిలో వివిధ విభాగాలను సందర్శించారు. రికార్డులు తనిఖీ చేసి ప్రసూతి కేసులు తక్కువగా ఉండడంపై ప్రశ్నించారు. వైద్య సేవలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎందుకు తక్కువగా జరుగుతున్నాయని వైద్యాధికారి పి. పద్మజను ప్రశ్నించారు. గ్రామీణ మహిళలు ఎక్కువ మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి ప్రసూతి సేవలు పొందుతున్నారని ఆమె సమాధానం చెప్పడంతో అసహనం వ్యక్తంచేశారు. జననీ సుఖీభవ, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చెక్కుల పంపిణీలో జాప్యంపై సిబ్బందిని నిలదీశారు. వారి పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను డిప్యుటేషన్‌పై ఇక్కకు వచ్చానని వైద్యురాలు చెప్పడంతో కలెక్టర్ అక్కడ నుంచే జిల్లా ఆరోగ్య శాఖాధికారి శ్యామలతో ఫోన్లో మాట్లాడారు. వారం రోజుల్లో ఆ పోస్టును భర్తీ చేయాలని ఆదేశించారు.
సత్వరం వంతెన పనులు
తామరబ్బ-చింతలపూడి పంచాయతీల పరిధిలో శారదానదిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణపనులు వేగవంతం చేయాలని ఆర్అండ్బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చింతలపూడి గ్రామాన్ని సందర్శించిన ఆయన మార్గ మధ్యలో అసంపూర్తిగా నిలిచిపోయిన వంతెన నిర్మాణపనులను పరిశీలించారు. తామరబ్బ వంతెన నిర్మాణం సకాలంలో పూర్తి కాకపోవడంతో తాగునీటి సరఫరా పైపులు కొట్టుకుపోతున్నాయని గ్రామస్తులు కలెక్టర్‌కు విన్నవించారు.
స్కూళ్ల తీరుపై మండిపాటు
తామరబ్బ నుంచి మోటారు సైకిల్‌పై చింతలపూడికి వెళ్లిన కలెక్టర్, సమ్మిద, చింతలపూడి పాఠశాలల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలపూడి ప్రాథమిక పాఠశాల తెరిచి ఉండి ఉపాధ్యాయుడు ఉన్నా పిల్లలు కానరాకవడంతో ఆయన మండిపడ్డారు. పిల్లలను ఎందుకు బడిలో చేర్చలేదని ఆయన ప్రశ్నించారు. సమ్మెద ప్రాథమిక పాఠశాలలో టీచర్ లేకపోగా, స్కూలుకు తాళాలు వేసి ఉండటంతో ఆగ్రహించారు. చర్యలు తీసుకోవాలనిఆదేశించారు. చింతలపూడిలో 2007లో ప్రారంభించిన పాఠశాల అదనపు భవన నిర్మాణం సగంలో నిలిచిపోవడంపై దృష్టిపెట్టిన ఆయన వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఎంపీడీఓను ఆదేశించారు. కలెక్టర్ వెంట డిప్యూటీ తహశీల్దార్ సత్యనారాయణ, హౌసింగ్ ఏఈ సూర్యారావు ఉన్నారు.