ఎన్నికల వేళ ఖాకీ జులుం
బలవంతంగా వాహనాల సేకరణ
ఎన్నికల నిధులు మిగిల్చుకునే ఆలోచన
సుబేదారి సీఐ తీరుపై విమర్శలు
వరంగల్ : ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకునేందుకు నిర్వహించే ఎన్నికల ప్రక్రియ.. స్వయం ఉపాధి పొందేవారికి అడ్డంకిగా మారుతోంది. మాటల్లో ఫ్రెండ్లీ పోలీసిం గ్ అని చెబుతున్న వరంగల్ నగర పోలీ సులు.. చేతల్లో మాత్రం తమ అసలు తీరును ప్రదర్శిస్తున్నారు. సాధారణ సమయాల్లోనే పోలీసు మార్కును చూపించే సుబేదారి స్టేషన్ అధికారి ఎన్నికల సమయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలిం గ్ ఆదివారం(6వ తేదీన) ఉంది. పోలిం గ్ సమయంలో పోలీసు సిబ్బంది పర్యవేక్షణ కోసం ఎన్నికల సంఘం నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులతో అవసరమైన వాహనాలను సమకూర్చుకుని పోలీసు శాఖ వారు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా విధులు నిర్వహించాలి. కానీ, సుబేదారి పోలీసులు మాత్రం దీనిలోనూ ఆదాయమే లక్ష్యం గా పని చేస్తున్నారు. పోలింగ్ రోజు పోలీసుల విధుల నిర్వహణకు వాహనాలు అవసరమవుతాయి.
వాహనాల యజమానులను పిలిచి కిరాయి డబ్బు లు ఇచ్చి వీటిని సేకరించుకోవాల్సి ఉం టుంది. అరుుతే, సుబేదారి పోలీస్ స్టేష న్ సీఐ నరేందర్ మాత్రం కొత్తగా ఆలోచించారు. ఉచితంగా వాహనాలను సేకరించి కిరాయి డబ్బులు మిగిల్చేందుకు ప్లాన్ చేశారు. సీఐ నరేందర్ అనుకున్నదే తడువుగా సుబేదారి పోలీస్ స్టేష న్ సిబ్బంది రోడ్లపైకి వచ్చారు. శని వారం ఉదయమే హన్మకొం డ బస్‌స్టేషన్ వద్ద ఉన్న టాటా ఏస్ వాహనాల వద్దకు వెళ్లారు. ఏమీ చెప్పకుండా... ‘స్టేషన్‌కు నడువు. బండి పట్టుకుని సుబేదారి స్టేషన్ కాడికి రా’ అని జులం ప్రదర్శించారు. ‘సార్ దూరం నుంచి వచ్చాం. వేరే కిరాయిలు ఒప్పుకున్నాం. వెళ్లకపోతే ఇబ్బంది అవుతుంది. మాట బోతది సార్’ అని ప్రాధేయపడినా ఒప్పుకోలేదు. ‘చెబితే అర్థం అయిత లేదారా? సీఐ సార్ రమ్మంటాడు. చల్ నడువ్’ అని బెదిరించి ఎనిమిది టాటా ఏస్ వాహనాలను సుబేదారి పోలీస్‌స్టేషన్ వద్దకు తీసుకువచ్చారు. ‘గ్రేటర్ ఎన్నికల్లో పోలీసులు డ్యూటీ చేసేం దుకు మీ వాహనాలను వాడుకుంటం. రేపటి దాకా ఇక్కడే ఉండాలే. డీజిల్.. కిరాయి అని అంటే మంచిగుండది. ఎల క్షన్ అయినంక ఏమన్న జూస్తం. తిండి గిండి ఏమన్న ఉంటే మీరే చూసుకోండి’ అని సీఐ కానిస్టేబుల్ రవీందర్ హు కూం జారీ చేశా రు. మధ్యాహ్నం వరకు స్టేషన్ ముందే నిలబెట్టి ఆ తర్వాత మూడు వాహనాలను పంపించారు. మిగిలిన వాహనాలను విధుల కోసం పెట్టుకున్నారు. కాగా, సుబేదారి పోలీ సుల తీరుపై వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటర్లకు విలువ ఉండే పోలింగ్ రోజు సైతం తమపై పోలీసుల జులం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల ఉదాసీనతతోనే సుబేదారి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ వాహనాల సేకరణ విషయంలో ఈ స్టేషన్ సిబ్బంది తీరు విమర్శలకు బలం చేకూరుస్తోంది.
పోలీస్ కమిషనర్ చెప్పారు : సీఐ నరేందర్
ప్రైవేటు వాహనాల బలవంతపు సేకరణపై సుబేదారి పోలీస్ స్టేషన్ సీఐ నరేందర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా... ‘ఎన్నికల నిర్వహణలో పోలీసు విధుల కోసం వాహనాలను సేకరించాలని సీపీ ఆదేశాలిచ్చారు. మూడు టాటా ఏస్ వాహనాలను తీసుకువచ్చాం. వాహనాలకు ఎంత డబ్బులు ఇచ్చే విషయం తర్వాత చెబుతాం. ఇప్పుడు బిజీగా ఉన్నా’ అని చెప్పారు.