క్రీడా విశ్వవిద్యాలయం కోసం స్థల పరిశీలన
ముద్దనూరు : కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్(ఎన్ఐఎస్), స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమయ్యే స్థలాన్ని ఇంచార్జి ఏజేసీ,స్పెషల్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, ఆర్డీవో వినాయకం, జిల్లా స్పోర్ట్స్ అధికారి బాషామొహిద్దీన్‌లు గురువారం ముద్దనూరు మండలంలో పరిశీలించారు.
శెట్టివారిపల్లెకు సమీపంలోని సుమారు 1000ఎకరాల ప్రభుత్వ భూమిని వారు పరిశీలించారు. అనంతరం ఇంచార్జి ఏజేసీ విలే కరులతో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఎన్‌ఐఎస్‌కు సుమారు 250 ఎకరాలు, స్పోర్ట్స్ విశ్వవిద్యాలయానికి సుమారు 125 ఎకరాల భూమి అవసరమన్నారు. రాష్ట్రానికి మంజూరైన ఈ సంస్థలకు జిల్లాల వారీగా ఎవరు ముందు అనువైన స్థలాన్ని సూచిస్తారో ఆ జిల్లాలోనే ఈ సంస్థల ఏర్పాటు చేస్తారన్నారు.
జిల్లా స్పోర్ట్స్ అధికారి బాషామొహిద్దీన్ మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు ఈ క్రీడాసంస్థల్లో శిక్షణ, నైపుణ్యాన్ని అందిస్తారన్నారు. కేవలం స్థల పరిశీలనచేయాలని తమకు ఆదేశాలు అందినట్లు ఆయన తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 13 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు
జిల్లా వ్యాప్తంగా 13మండల కేంద్రాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలకు స్థలాలను పరిశీలిస్తున్నట్లు స్పెషల్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి తెలిపారు ముద్దనూరు-జమ్మలమడుగు రహదారిలో ఎత్తులేటికట్ట కిందభాగంలో స్పోర్ట్ కాంప్లెక్స్ కోసం ఆర్డీవోతో కలసి ఆయన స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు జయప్రసాద్, ఆర్ఐ సుశీల, వీఆర్వో మనోహర్, సర్వేయర్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.