సింహాచలంలో ఎడ్యుకేషన్ కాంప్లెక్స్
భూ సమస్య త్వరలో పరిష్కారం
కనకమహాలక్ష్మి, అప్పన్న ఆలయాల్లో నిత్యాన్నదానం ప్రారంభోత్సవంలో మంత్రి గంటా
పాతపోస్టాఫీసు/ సింహాచలం : బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానాల్లో నిత్యాన్నదాన పథకాన్ని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. తొలుత కనకమహాలక్ష్మి ఆలయం లో ప్రారంభించి ప్రసంగించారు. సింహాచలం దేవస్థానంలో ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు చెప్పారు.
ఇంజినీరింగ్, వైద్య, డిగ్రీ, కోస్ట్‌గార్డు కళాశాలలు ఏర్పాటు చేయాలి చూస్తున్నట్టు తెలిపారు. సింహాచలం భూముల వివాదం ఒకటి, రెండు నెలల్లో పరిష్కరించనున్నట్టు స్పష్టం చేశారు. కొండపై కాటేజీలు నిర్మాణం చేసే యోచన ఉందన్నారు. ఇవన్నీ ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని, ప్రణాళికలు తయారుచేసి కార్యాచరణకు దిగుతామన్నారు.
తాజ్, ఒబెరాయ్, ఫోర్‌పాయింట్స్ హోటల్స్‌కు సింహాచలం దేవస్థానానికి చెందిన కొంత స్థలాలు కేటాయించి వాటిలో షేర్ తీసుకోవడం, వుడా, జీవీఎంసీ సంయుక్త భాగస్వామ్యంతో దేవస్థానం స్థలాల్లో ఐటీ అభివృద్ధి, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి యోచిస్తున్నట్టు వివరించారు. తొలుత కనకమహాలక్ష్మి అమ్మవారికి మంత్రి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, దేవస్థానం ఈవో డి.భ్రమరాంబ పాల్గొన్నారు.
కొండపై రోజుకు 5వేల మందికి అన్నదానం
సింహగిరిపై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారం భించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఇక్కడ రోజుకు ఐదు వేల మందికి అన్నదానం చేయనున్నట్టు తెలిపారు. దేవస్థానం తరఫున వైద్య సదుపాయం అందించేందుకు అడవివరం ఆరోగ్య కేందాన్ని దత్తత తీసుకోవాలా లేదా కొత్తగా వైద్యశాల నిర్మించాలా వంటి ఆలోచన చేస్తున్నా మన్నారు. తొలుత శ్రీగోకుంలో గోపూజల కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీకృష్ణాపురంలోని గోశాలలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్, ప్రధాన పురోహితులు మోర్తా సీతారామాచార్యులు, అడవివరం మాజీ సర్పంచ్ పాశర్ల ప్రసాద్, 72వ వార్డు టీడీపీ అధ్యక్షుడు పి.వి.నరసింహం తదితరులు పాల్గొన్నారు.