నిజాం వారసత్వాన్ని కాపాడండి
సాక్షి, హైదరాబాద్ : నిజాం చారిత్రక కట్టడం గౌలిగూడ బస్ స్టేషన్ ఒక్క సారిగా కుప్పకూలడంపై న్యాయ విచారణ జరిపించాలని ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు నజాఫ్ అలీఖాన్ సీఎం కేసీఆర్ను కోరారు. బస్ స్టేషన్ కూలిపోవడంపై పలు అనూమానాలు వ్యక్త మవుతున్నాయి, దానిపై విచారణ జరిపించాలని కేసీఆర్కు ఆదివారం లేఖ రాశారు. హైదరాబాద్లోని నిజాం అస్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పలు ఆస్తులు నగరం నుంచి అదృశ్యమవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర గల ఉస్మానియా ఆసుపత్రి, ఛాతీ ఆసుపత్రిను కూల్చీ వేయాలని ప్రభుత్వం భావిస్తోందని, చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లేఖలో తెలిపారు.
హైదరాబాద్ సందర్శనకు వచ్చిన వారికి హైటెక్ సిటీ లాంటివి కాదని, తెలంగాణ సంస్కృతి, చారిత్రక కట్టడాలే చూపించాలని పేర్కొన్నారు. గౌలిగూడ బస్ స్టేషన్ కూలీపోవడంపై పలు అనూమానాలు వ్యక్తమవుతున్నా విషయం తెలిసిందే. 90 ఏళ్ల క్రితం మూసీ నది ఒడ్డున నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గౌలిగూడ బస్ స్టేషన్ నిర్మించారు. 1994లో మహాత్మ గాంధీ బస్టాండ్ నిర్మించడంతో ప్రస్తుతం దానిని సిటీ బస్ స్టేషన్ (సీబీఎస్)గా ఉపయోగిస్తున్నారు. నిజాం స్మారక చిహ్నాలను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్ఐఎమ్ ఛీప్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేసీఆర్ను కోరిన విషయం తెలిసిందే.