ఈ కథ తయారు చేసినది అల్లు అర్జున్ కోసమే
కమెడియన్‌గా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న సునీల్, ‘అందాల రాముడు’లో హీరోగా చేసి స్టార్ అయిపోయారు. చాలా తెలివిగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న సునీల్ గత రెండేళ్లుగా ఏ సినిమా చేయలేదు. ఈ నెల 19న వస్తున్న ‘కృష్ణాష్టమి’ సినిమాతో ఆ లోటు తీరిపోతుందంటున్నారాయన. సునీల్‌తో జరిపిన భేటీ...
హీరోగా దాదాపు రెండేళ్లు గ్యాప్ వచ్చింది.. కారణం?
కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చాను. మాటిచ్చినందుకు వెయిట్ చేశాను. కానీ, అవి జరగలేదు. ఈ రెండేళ్లల్లో ఎక్కువగా జిమ్ చేశాను. కథలు విన్నాను. నా పిల్లలతో అంతకు ముందెప్పుడూ ఎంజాయ్ చేయనంతగా చేశాను. ప్రస్తుతం వంశీ ఆకెళ్ల, వీరూ పోట్ల దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాను. రెండేళ్ల గ్యాప్‌ని కవర్ చేస్తున్నా.
‘కృష్ణాష్టమి’ ఎలా ప్రారంభమైంది?
ఓ రోజు ‘దిల్’ రాజుగారు పిలిచి, ‘కథ ఉంది. యాక్చువల్‌గా పెద్ద హీరోకి అనుకున్నాం. ఆ కథ నీకు సూట్ అవుతుందని విన్న వాళ్లందరూ అన్నారు. కథ నచ్చితే చెయ్’ అన్నారు. ఆయనే కథ చెప్పారు. వాసూ వర్మ డెరైక్షన్‌లో సినిమా ఉంటుందనగానే ఆనందపడ్డాను. ‘ఆర్య’ అప్పట్నుంచీ వాసు నాకు పరిచయం. ‘బొమ్మరిల్లు’ సినిమాలో ‘సత్తి.. మంచి పనోడు’ అనే ట్యాగ్ లైన్ తను ఇచ్చిందే. ఇప్పటివరకూ నేను చేసిన అన్ని చిత్రాల్లోకీ భారీ మూవీ ఇదే.
‘దిల్’ రాజు బేనర్లో కమెడియన్‌గా చేశారు.. ఇప్పుడు హీరో కాబట్టి, స్పెషల్‌గా ట్రీట్ చేశారా?
నేను పంజాగుట్టలో రూమ్‌లో ఉన్నప్పుడు ‘దిల్’ రాజుగారు డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. అప్పట్లో చాలా లావుగా ఉండేవారు. అలాంటి ఆయన చాలా పట్టుదలగా రన్నింగ్, ఎక్సర్సైజులు చేసి, ఇప్పుడున్నట్లుగా తయారయ్యారు. మామూలుగా బిహైండ్ది కెమెరా ఉన్నవాళ్లు అంత కష్టపడి తగ్గాల్సిన అవసరం లేదు. కెమెరా ముందు కనిపించే మనం ఎలా ఉండాలి? పైగా కమెడియన్‌గా అంటే ఏ పదిహేను, ఇరవై నిముషాలో కనిపిస్తాం.. హీరోగా దాదాపు రెండు గంటలకు పైగా కనిపించాలి. అందుకే ‘దిల్’ రాజుగారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని సన్నబడ్డాను. ఆ సంగతి పక్కనపెడితే ఆయనతో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. నేను కమెడియన్‌గా చేసినప్పుడు కూడా నన్ను హీరోలానే ట్రీట్ చేసేవారు.
అల్లు అర్జున్ కోసం అనుకున్న కథతోనే ‘కృష్ణాష్టమి’ తీశారట.. ఆ కథ మీకెలా సూట్ అవుతుంది?
అల్లు అర్జున్ కోసం కథ తయారు చేసినది నిజమే. ఆ తర్వాత నాకు తగ్గట్టుగా మార్చారు.
హీరో అంటే పెద్ద బాధ్యత కదా.. టెన్షన్ లేదా?
ఆ బాధ్యత తట్టుకునే ఓపిక లేదు. నాకు బ్యాగ్రౌండ్ లేదు. అందుకని ‘ఏం జరుగుతుందో.. ఏంటో’ అని విపరీతంగా ఆలోచించేవాణ్ణి. ఆ ఒత్తిడి వల్లే డల్ అయిపోయాను. ఆ ప్రభావం నటన మీద పడుతోంది. దాంతో, ‘దేవుడా.. భారం నీదే. నువ్వే కాపాడాలి’ అని మొరపెట్టుకున్నా. ఆ తర్వాత ఆలోచించడం మానేశా.
హీరోగా మొదలుపెట్టాక సిక్స్ ప్యాక్ చేయాల్సి రావడం కష్టం అనిపించలేదా?
ఒక సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశా. అది బాగుందని మిగతా దర్శకులు కూడా ఎంకరేజ్ చేయడంతో అప్పుడప్పుడు సిక్స్ ప్యాక్‌కి మారి, మళ్లీ కొంచెం బరువు పెరగాల్సి వస్తోంది. నాకు తిండి అంటే ప్రాణం. కానీ, సిక్స్ ప్యాక్ కోసం త్యాగం చేశా. నేనెంత తిండి ప్రియుణ్ణో మావాళ్లకు తెలుసు. అందుకే నా త్యాగం చూసి, బాధపడతారు.
మీలో మంచి హీరో మెటీరియల్ ఉన్నాడని ఎప్పుడు మీకు నమ్మకం కలిగింది?
హీరో అంటే కామెడీ, ఫైట్స్, డ్యాన్స్, సెంటిమెంట్, రొమాన్స్ అన్నీ చేయాలి. నాకు రొమాన్స్ కష్టం. ‘మర్యాద రామన్న’ చేస్తున్నప్పుడు సలోనికి ముద్దు పెట్టే సీన్‌కి ఎన్ని టేక్స్ తీసుకున్నానో. ఆ సీన్ చేసి చూపించిన అసిస్టెంట్ డెరైక్టర్ ప్రతిసారీ ముద్దు పెట్టేవాడు. ‘ఇన్నిసార్లు నేను ముద్దు పెట్టే బదులు మీరు ఒక్కసారి సరిగ్గా పెట్టేస్తే షాట్ ఓకే అయిపోద్ది కదా’ అనేవాడు. నా రొమాంటిక్ సీన్స్‌ని క్షుణ్ణంగా గమనిస్తే, మొహమాట పడిన విషయం ఈజీగా పట్టేయొచ్చు. మిగతావన్నీ చేసేయగలను. బాలీవుడ్లో గోవిందాలా అన్నమాట. నాలో మంచి హీరో మెటీరియల్ ఉన్నాడనే నమ్మకం మొదటి సినిమా అప్పుడు, ఆ తర్వాత ఇంకా బలపడింది.
మీ తోటి కమెడియన్లు మీ గురించి కామెంట్ చేయడం విన్నారా?
దాదాపు అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు. నా దగ్గర ఎవరూ రియాక్ట్ కాలేదు. కానీ, హీరోగా చేస్తూ, లైఫ్ పోగొట్టుకుంటున్నాడని కొందరు అనడం విన్నాను. నేనిక్కడకు వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు. ఇక పోగొట్టుకుంటానని టెన్షన్ ఎందుకు?