‘క్యాడ్వామ్’తో చివరి ఆయకట్టుకూ నీరు
కొత్త పథకానికి కేంద్రం శ్రీకారం.. ఏప్రిల్ ఒకటి నుంచి అమలు
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల కింద నిర్ణయించిన ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగు నీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం క్యాడ్వామ్ (కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్) పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టుల కింద నిర్ణయించిన వాస్తవ ఆయకట్టుకు, సాగునీరు అందుతున్న ఆయకట్టుకు మధ్యన తేడా ఉన్నపక్షంలో దాన్ని పూడ్చేలా ఈ పథకాన్ని తెస్తోంది. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. నీటి లభ్యత, ప్రాజెక్టు వ్యయం, సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టుల ఆయకట్టు నిర్ణయించినప్పటికీ సాంకేతిక కారణాలు, టెయిల్లాండ్ వంటి కారణాలతో కొంత ఆయకట్టుకు సాగునీరు అందదు. ఈ గ్యాప్ ఆయకట్టు ప్రతీ ప్రాజెక్టు పరిధిలో 25 శాతం మేర ఉంటుందని కేంద్రం అంచనా వేస్తోంది. దీన్ని సరి చేసేందుకు రూ.28 వేల కోట్ల బడ్జెట్ను కేటాయించింది.
ఈ పథకం కింద ఆమోదించిన పనులకు కేంద్రం 60 శాతం నిధులు ఇవ్వనుండగా, మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఈ గ్యాప్ ఆయకట్టుకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని జూరాల, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు–1, అలీసాగర్, గుత్ప, డిండి, నిజాంసాగర్, ఆర్డీఎస్, కడెం, మూసీ, గుండ్లవాగు, ఆసిఫ్ నహర్, కోటిపల్లివాగు, నల్లవాగు, ఘన్పూర్ ఆనకట్ట, పోచారం, కౌలాస్నాలా, సాత్నాల, స్వర్ణ, వట్టివాగు, ఎన్టీఆర్ సాగర్, పీపీ రావు ప్రాజెక్టు, అప్పర్ మానేరు, శనిగరం, బొగ్గులవాగు, ముల్లూరువాగు, పాకాల చెరువు, పెద్దవాగు, సుద్దవాగు ప్రాజెక్టులను ఈ జాబితాలో చేర్చి నిధులు రాబట్టే యత్నాలు చేస్తోంది.