మరింత వేగంగా పోలీసు సేవలు
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో రాష్ట్ర పోలీసు వ్యవస్థ మరో ముందడుగు వేసింది. అన్ని రకాల పోలీసు సేవలను సాంకేతిక పరిజ్ఞానంతో ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. ‘ఫస్ట్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టం ఆఫ్ తెలంగాణ స్టేట్’(ఫస్ట్) కార్యక్రమంలో భాగంగా సమాచారం అందిన వెంటనే సేవలు అందించేందుకు, పోలీసు శాఖలోని అన్ని ఆధునిక వ్యవస్థలను ‘కమాండ్ అండ్ కంట్రోల్’ సిస్టంతో అనుసంధానించేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం అమలులో వున్న ‘డయల్ 100’ వ్యవస్థ కూడా ‘కమాండ్ అండ్ కంట్రోల్’తో అనుసంధానం కానుంది. కమాండ్ కంట్రోల్ వ్యవస్థతో అనుసంధానానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం కోసం రాష్ట్ర పోలీసు శాఖ తాజాగా టెండరు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి వస్తే దేశంలో అత్యాధునిక పరిజ్ఞానం వినియోగించుకునే పోలీసు విభాగంగా తెలంగాణ పోలీసు శాఖ గుర్తింపు పొందనుందని అధికార వర్గాలు తెలిపాయి.