భద్రతకు మాది భరోసా
నగర పోలీస్ కమిషనర్ పి.మహేందర్‌రెడ్డి
ఘనంగా పోలీసుల ఓపెన్ హౌస్
ఆకట్టుకున్న మాక్‌డ్రిల్
రసూల్‌పురా: ప్రజలకు భద్రత కల్పించడం, వారు సమాజంలో శాంతియుత వాతావరణంలో జీవించేలా చూడడం పోలీసుల బాధ్యత అని నగర పోలీస్ కమిషనర్ పి.మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా సోమవారం సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో నగర పోలీసు విభాగం అధ్వర్యంలో ఓపెన్‌హౌస్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ గతేడాది సెప్టెంబర్ నుండి ఇప్పటివరకు 673 మంది పోలీసులు విధి నిర్వహణలో అసువులు బాసారని చెప్పారు. సమాజంలో పోలీసులు ఎంతో బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నారన్నారు.
పండుగలు, పర్వదినాల్లో ప్రజలు ఇంటి వద్ద ఉండి సంతోషంగా గుడుపుతారని...పోలీసులు మాత్రం వారి భద్రత కోసం వీధుల్లో...స్టేషన్లలో విధులు నిర్వహిస్తారన్నారు. ప్రజలు కూడా పోలీసులతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. అత్యవసర సమయాల్లో 100 నంబర్‌కు డయల్ చేస్తేపది నిమిషాల్లో పోలీస్ పెట్రోలింగ్ అందుబాటులో ఉంటుందని అన్నారు. డీఐజీ (క్రైమ్స్) స్వాతి లక్రా, ట్రాఫిక్ ఐజీ జితేంద్ర ఇతర పోలీస్ విభాగం అధికారులు ఈసందర్భంగా ప్రసంగించారు. అదనపు డీజీ అంజనీకుమార్, డీఐజీ మల్లారెడ్డి, ఐజీ సంజయ్‌జైన్, డీఐజీ శివప్రసాద్, వివిధ జోన్ల డీసీపీలు, ఏసీపీలు సీఐ,ఎస్సైలు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఓపెన్‌హౌస్‌లో పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శన...మాక్‌డ్రిల్
పోలీస్ వ్యవస్థ అంటే ఏమిటి, విధి నిర్వహణ ఎలా చేస్తారు, ఎలాంటి అయుధాలు ఉపయోగిస్తారు అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఓపెన్‌హౌస్, మాక్‌డ్రిల్ ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖలోని పలు విభాగాలు ఈ ప్రదర్శనలో పాలుపంచుకున్నాయి. పోలీసులు ఉపయోగించే రైఫిల్, పిస్టల్, ఎకే 47, లైట్ మిషన్‌గన్, క్లూస్ టీం ఉపయోగించే వివిధ వస్తువులు, బాంబ్‌స్క్వాడ్ తదితర స్టాల్స్‌ను విద్యార్థులు ఆసక్తిగా తిలకించి, పోలీస్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక నగరంలో ఉద్రిక్తతలు, ఆందోళనల సమయంలో పోలీసు విభాగం ఎలా వ్యవరిస్తుందో మాక్‌డ్రిల్ ద్వారా ప్రదర్శించారు.