కలాం నిజాయితీతో ఎదిగారు
కలాం సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు
హైదరాబాద్: నిరుపేద కుటుంబంలో జన్మించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నిజాయితీ, అకుంఠిత దీక్ష, చిత్తశుద్ధితో సమున్నత శిఖరాలను అధిరోహించారని ముఖ్యమంత్రి చంద్రబాబు కీర్తించారు. కలాం గొప్ప రాజనీతిజ్ఞుడని, ఆయన మరణంతో దేశం గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయినట్లైందన్నారు. మంగళవారం సచివాలయంలో కలాం చిత్రపటానికి బాబు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రపతి అభ్యర్థిగా కలాంను ఎంపిక చేయడంలో తాను ప్రధాన పాత్ర పోషించానని చెప్పుకొచ్చారు. తిరుపతిలోని అలిపిరిలో నకల్స్ దాడిలో గాయపడిన తనను నిబంధనలను తోసిరాజని నేరుగా వచ్చి పరామర్శించారని గుర్తు చేసుకున్నారు. కాగా, గురువారం ఉదయం తమిళనాడులోని రామేశ్వరంలో జరిగే కలాం అంత్యక్రియలకు చంద్రబాబు హాజరుకానున్నారు.
గంట అదనంగా పని చేయండి: సీఎం
తాను మరణిస్తే సెలవు ప్రకటించవద్దని అదనంగా ఓ గంట పని చేయటమే తనకు అర్పించే నిజమైన నివాళి అని కలాం చెప్పిన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు ఒక గంట అదనంగా పని చేయాలని చంద్రబాబు సూచించారు. విద్యాలయాల్లో ఆ గంటపాటు కలాం జీవిత చరిత్రను బోధించాల్సిందిగా సూచించారు. కలాం మరణంతో దేశం గొప్ప మార్గదర్శిని కోల్పోయినట్లయిందని మంత్రి పల్లె రఘునాథరెడి అన్నారు.
ఎన్టీఆర్ భవన్లో కలాంకు నివాళులు
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు తమ పార్టీకి అవినాభావ సంబంధం ఉదని టీడీపీ నేతలు అన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో అబ్దుల్ కలాంకు పార్టీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు.
మాజీ రాష్ర్టపతికి పీసీసీ ఘన నివాళి
కలాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎంపీ తులసిరెడ్డి తదితరులు ఇందిర భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కలాం ముద్ర చెరగనిది: డీజీపీ రాముడు
సాంకేతిక రంగంతో పాటు ప్రజా జీవితంలోనూ కలాం ముద్ర చెరగనిదని రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు విభాగం కలాంకు ఘనంగా నివాళులర్పించింది.