comments on government
-
రసమయి వ్యాఖ్యలు, టీఆర్ఎస్లో కలకలం
మహబూబాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గజ్జెకట్టి ఆడిపాడి ఉద్యమాన్ని ఉరకలెత్తించిన రమమయి బాలకిషన్ అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. రెండుసార్లు మానకొండూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తాను చాలామందికి దూరమయ్యానంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో కవులు, కళాకారులు మౌనంగా ఉండటం క్యాన్సర్ కంటే ప్రమాదకరమని రసమయి వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. అంటే కళాకారులు మునుపటిలా కదం తొక్కడం లేదని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ హోదాలో రసమయి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మహబూబాబాద్‌లో ప్రముఖ కవి జయరాజు తల్లి సంతాప సభలో పాల్గొన్న రసమయి ఈవ్యాఖ్యలు చేశారు. తాను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండటంతో తన సహజత్వాన్ని కోల్పోయానని అన్నారు. ప్రస్తుతం తానో లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉండటంతో చాలా మందికి దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు టీఆర్ఎస్లో వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. టీఆర్ఎస్ అధిష్టానం తనను పట్టించుకోవడం లేదనే ఆవేదనతో రసమయి ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్థానికంగా వినిపిస్తున్న మాట. ఇక కేటీఆర్ సీఎం అవుతారని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేయడం.. మరికొందరు హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం పార్టీలో కొంత ఇబ్బందికర వాతావరణం సృష్టించింది. -
కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు
అనంతపురం అర్బన్: ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులతో ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయిస్తోందని మెడికల్ కాంట్రాక్టు వర్కర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ మాణిక్యం ధ్వజమెత్తారు. జాతీయ కార్మిక సంఘాలు సెప్టెంబరు 2న తలపెట్టిన సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఐఎంఏ హాల్లో నిర్వహించిన సంఘం సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వకుండా ప్రభుత్వం దగా చేస్తోందని మండిపడ్డారు. కాంట్రాక్టు వ్యవస్థని రద్దు చేసి కార్మికులకు ప్రభుత్వమే కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సి.జాఫర్, శకుంతలమ్మ, జె.రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.