గ్రేటర్‌కు ‘విద్యుత్ షాక్’
సిటీబ్యూరో: గ్రేటర్ వాసులకు డిస్కం షాక్ ఇచ్చింది. వంద యూనిట్ల కంటే ఎక్కువ వాడే సామాన్య మధ్య, ఆపై తరగతులే లక్ష్యంగా చార్జీలు పెంచింది. ఈ చార్జీలు జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో 41 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 35.5 లక్షల గృహ విద్యుత్, 4.5 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల కనెక్షన్లు 40 వేల దాకా ఉన్నాయి. లక్షకుపైగా వీధి దీపాలు ఉన్నాయి.
వీటిలో ప్రస్తుతం ప్రతి నెలా 38 లక్షల కనెక్షన్లకు మాత్రమే బిల్లింగ్ వసూలు అవుతోంది. వీరిలో 100 లోపు యూనిట్ల విద్యుత్ వాడే వినియోగదారులు సుమారు 20 లక్షల మంది ఉండగా, ఆపై యూనిట్లు వాడేవారు మరో 18 లక్షల మందికి పైగా ఉన్నారు. ప్రభుత్వం తాజాగా పెంచిన చార్జీల వల్ల 18 లక్షల కనెక్షన్లపై భారం పడే అవకాశం ఉంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గ్రేటర్ వాసులపై రూ.680 కోట్ల భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం వీధి దీపాలకు యూనిట్ చార్జి రూ. 6.70గా ఉండగా, ఇది కొత్త ధరలతో రూ. 7.10కి పెరిగింది. ప్రస్తుత చార్జీల ప్రకారం జీహెచ్ఎంసీ విద్యుత్ చార్జీల కింద నెలకు రూ.14.50 కోట్లు చెల్లిస్తుండగా,పెరిగిన ధరలతో రూ.86 లక్షల మేర అదనపు భారం పడే అవకాశం ఉంది.