33 మండలాలతో నుడా!
నెల్లూరు, సిటీ: 33 మండలాలతో కూడిన ‘నెల్లూరు అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ’(నుడా) ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు నగర పాలక సంస్థ కమిషనర్ చక్రధర్‌బాబు తెలిపారు. నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి నారాయణ నెల్లూరులో పర్యటనలో భాగంగా నగరం అభివృద్ధికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు పంపాల్సిందిగా కోరారన్నారు.
33 మండలాలతో కూడిన ‘నెల్లూరు అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ’(నుడా) ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తాగునీరు, అండర్‌బ్రిడ్జ్ సంబంధించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. కార్పొరేషన్‌లోని ఇంజనీరింగ్ విభాగాన్ని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా చీఫ్ ఇంజనీర్ పోస్టును కూడా భర్తీ చేస్తామన్నారు.
ఇప్పటికే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మీసేవలో పొందుతున్నారని, త్వరలో మరిన్ని మున్సిపాలిటీ సేవలను మీసేవలోనే పొందేందుకు వీలు కల్పిస్తామని తెలిపారు. నగరంలోని అన్ని డివిజన్లలో దోమల నివారణకు ఫాగింగ్, స్ప్రేలు చేయిస్తామని పేర్కొన్నారు. డ్రైనేజీని శుభ్రపరిచేందుకు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. అదేవిధంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు త్వరలో నిర్వహిస్తామని తెలిపారు.