సమాచారం ఇవ్వాల్సిందే..
రాష్ట్ర సమాచార కమిషన్
ప్రధాన కమిషనర్ జన్నత్ హుస్సేన్
సాక్షి, విశాఖపట్నం : నిర్ణీత గడువులోగా అడిగిన సమాచారం ఇవ్వకుంటే బాధ్యులపై చర్యలు తప్పవని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ జన్నత్ హుస్సేన్ స్పష్టం చేశారు. ‘స.హ.చట్టం-విజయాలు-తీర్పులు’ అనే అంశంపై శుక్రవారం జెడ్పీ సమావేశం హాలులో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లగలిగితేనే ప్రజాస్వామ్యానికి సార్ధకత చేకూరుతుందన్నారు.
ప్రభుత్వంలోని అన్ని శాఖలు, కార్యాలయాలు స్వచ్ఛందంగా సమాచారాన్ని వెల్లడిస్తే చట్టం మరింత ఫలవంతంగా వినియోగమవుతుందన్నారు. స.హ.చట్టం జిల్లా నోడల్ అధికారి, డీఆర్ఓ కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఆర్టీఐ లోగోను వినియోగించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. అధికార యంత్రాంగానికి అప్డేట్ సమాచారాన్ని తెలియజేస్తూ వివిధ స్థాయిల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. జెడ్పీ సీఈఓ ఎం.మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో సహకార చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్థానిక సంస్థలు కృషి చేయాలన్నారు.
కాండ్రేగుల వెంకటరమణ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ఈ చ ట్టాన్ని ఎక్కువ సంఖ్యలో ప్రజలు వినియోగించుకునేందుకు వీలుగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. సదస్సులో హెల్ప్ టు హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ బి.ఎం.నాయుడు, రమేష్, కేవిఎస్ నరసింహం, వివిధ మండలాల సమాచార హక్కు చట్టం కార్యకర్తలు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.