Commissioner of Police Mahesh Bhagwat
-
‘ఐపీఎల్’కు కట్టుదిట్టమైన భద్రత
ఉప్పల్: నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ఈ మేరకు సోమవారం స్టేడియంలో హెచ్‌సీఏ కార్యదర్శి శేష్ నారాయణ్, ఉపాధ్యక్షులు అనిల్ కుమార్, అదనపు డీసీపీ ఉదయ్ కిరణ్, మల్కాజిగిరి డీసీపీ రమేష్ నాయుడులతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భద్రత ఏర్పాట్లను వెల్లడించారు. ఉప్పల్ స్టేడియంలో బుధవారం ప్రారంభ మ్యాచ్, వచ్చే నెల 21న ఫైనల్ సహా ఎనిమిది మ్యాచ్‌లకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ నెల 9, 17, 19, 30, మే 6, 8 తేదీల్లో మిగతా ఆరు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌ల కోసం ప్రత్యేకించి 250 సెక్యూరిటీ వింగ్, 270 ట్రాఫిక్ సిబ్బంది, 700 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఆరు ప్లాటూన్ల ఆక్టోపస్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, సీసీఎస్ స్టాఫ్, రెండు టెండర్ స్క్వాడ్ సహా మొత్తం 1800 మందికిపైగా సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికార్లు వెల్లడించారు. పోలీస్ పహారాలో స్టేడియం... ఉప్పల్ స్టేడియంను సోమవారమే తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. పోలీస్ భద్రతతో పాటు 88 సీసీ కెమెరాలు, అవసరమైన చోటల్లా చెక్ పాయింట్లు, బాంబు స్క్వాడ్ టీమ్‌లతో 24 గంటలు పహారా కాస్తున్నట్లు తెలిపారు. అనుకోని సంఘటనలు ఎదురైతే అప్పటికప్పుడు స్పందించే విధంగా టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంఘవిద్రోహ శక్తులపై కన్నేసి ఉంచామని... అనుమానిత స్థలాల్లో రోజూ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. స్టేడియం లోపల, బయట షీ టీమ్‌లను అందుబాటులో ఉంచుతామని, ఈవ్ టీజర్లను గుర్తించి అదుపులోకి తీసుకుంటామన్నారు. ఎమ్మార్పీ ధరలకే అమ్మాలి వ్యాపారస్తులు గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)లకే తినుబండారాలు, శీతల పానీయాలను విక్రయించాలని, ఎమ్మార్పీ కంటే అధికంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ఇందుకోసం ప్రత్యేక వెండర్ సూపర్వైజింగ్ బృందాలను నియమించామని కమిషనర్ చెప్పారు. బీసీసీఐ జారీ చేసే అక్రిడేషన్ కార్డులను బదిలీ చేసుకోవద్దని సూచించారు. 4 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లకు రెండు గంటలు ముందుగానే అనుమతిస్తామన్నారు. మొబైల్ ఫోన్లకు ఓకే.. కెమెరాలకు నో! మొబైల్ ఫోన్లను అనుమతిస్తామని ఎలక్ట్రానిక్ పరికరాలు, కెమెరాలు, అగ్గిపెట్టెలు, బైనాక్యులర్స్, బ్యాగ్‌లు, బ్యానర్లు, సిగరేట్లు, లైటర్స్, కాయిన్స్, హెల్మెట్స్, బయటి తినుబండారాలు, వాటర్ బాటిల్స్, పెన్నులు, ఫర్ఫ్యూమ్స్, సెల్‌ఫోన్ రీచార్జి బ్యాటరీలను స్టేడియంలోపలికి అనుమతించరు. ట్రాఫిక్ దారి మళ్లింపు సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వెళ్లే భారీ వాహనాలను మ్యాచ్ జరుగుతున్న సమయాల్లో అనుమతించరు. సికింద్రాబాద్ నుంచి ఘట్కేసర్ వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ ఎన్ఎఫ్సి బ్రిడ్జి మీదుగా చంగిచర్ల నుంచి వరంగల్ హైవే కు కలవాల్సి ఉంటుంది. అటునుంచి వచ్చే వారు కూడా అదే దారిలో వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు బోడుప్పల్, చంగిచర్ల మీదుగా హబ్సిగూడ చేరుకోవాల్సి ఉంటుంది. పార్కింగ్ ప్రాంతాలు సుమారు 9000 వాహనాల పార్కింగ్‌కు సరిపోయే స్థలాలను కేటాయించారు. ఐదు వేల ద్విచక్ర వాహనాలు, నాలుగు వేల ఫోర్ వీలర్ల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. కారు పాస్ ఉన్న వారు రామంతాపూర్ నుంచి గేట్ నంబర్ 1, 2 లకు వెళ్లాలి. కారు పాస్‌లు లేని వారు రామంతాపూర్ రోడ్డుకు ఇరువైపుల తమ వాహనాలను పార్క్ చేసుకోవచ్చు. దివ్యాంగులు తమ వాహనాలను పార్క్ చేసుకున్న అనంతరం రామంతాపూర్ దారి గుండా స్టేడియంలోకి గేట్ నంబర్ –3 ద్వారా లోపలికి ప్రవేశించాలి. గేట్ నంబర్ 4 నుంచి 10 ద్వారా వెళ్లాల్సినవారు తమ వాహనాలను పెంగ్విన్ గ్రౌండ్లో పార్కు చేసి, ఏక్ మినార్ మజీద్ రోడ్ నుంచి లోపలికి వెళ్లొచ్చు. -
కన్నవారికి.. కన్నీళ్లు మిగల్చకండి!
సిటీబ్యూరో: తమ ప్రమేయం లేకుండా కొందరు, స్వయం తప్పిదాలు చేసి మరికొందరు రోడ్డు ప్రమాదాల్లో అర్ధంతరంగా తనువులు చాలిస్తూ వారి కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టేస్తున్నారు. ఇక బంగారు భవిష్యత్ కలిగిన విద్యార్థులు ‘స్టూడెంట్ లైఫ్...గోల్డెన్ లైఫ్’ అంటూ ఓవర్, ర్యాష్, డ్రంకన్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. తమ కుటుంబానికి అండగా..ఆశాకిరణంగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా రోడ్డు ప్రమాదంలో చనిపోతే..ఆ బాధ..ఆ కష్టాలు..కన్నీళ్లు చెప్పనలవి లేకుండా ఉంటాయని పలువురు బాధితులు పేర్కొన్నారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ స్టేడియంలో మంగళవారం ‘యాక్సిడెంట్ ఫ్రీ డే’ సందర్భంగా రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దాదాపు మూడు వేల మందికిపైగా ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల్లో ఆప్తులను కోల్పోయిన కొంతమంది ప్రముఖులను పిలిపించి.. యువతకు సందేశాన్నిప్పించారు. ట్రాక్టర్ డ్రైవర్ అయిన గణేశ్ ఆ చిన్న కుటుంబానికి ఆధారం. భార్య విద్యకు పాప పుట్టిందని తెలిసి చూసేందుకు బైకుపై ఆస్పత్రికి వెళ్తుండగా గతేడాది ఆగస్టు 28న గురునానక్ కాలేజ్ వద్ద బొలెరో వాహనం ఢీకొట్టడంతో ప్రాణాలు విడిచాడు. దీంతో విద్యతో పాటు ఆమె పాప దిక్కులేనివారయ్యారు. బాగోగులు చూసుకునే వారు లేకపోవడంతో నల్గొండ జిల్లా చింతపల్లి మండలం బొడుకొండ్లుకు చెందిన పుట్టింట్లో ఉంటోంది విద్య. కూలీపని చేసుకుంటూ తన బిడ్డను చూసుకుంటోంది. ప్లీజ్...పెద్దల మాట వినండి నేటి కుర్రకారుకు సాధన తక్కువ. వాదన ఎక్కువ. పెద్దలు చెప్పిన విషయాలను అనుసరించరు. అన్నిరకాల వాహనాలు రోడ్డు మీద వెళ్లే సమయంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పడినప్పుడు బైకర్లు చిన్న ప్లేస్ దొరికితే చాలు ఆత్రంగా ముందుకెళుతుంటారు. కొన్ని సెకన్ల పాటు వేచిచూస్తే ప్రమదాన్ని తప్పించినవారమవుతాం. ఇది పిల్లలకు చెబితే కోపం ఎక్కువ. చెప్పకపోతే ఏమైనా జరుగుతోందోనని బాధ. ఇప్పటికైనా పెద్దలు చెప్పిన మాటలు వినడంతో పాటు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించి జీవితం సుఖమయం చేసుకోవాలి. నా కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడన్న విషయం ఇప్పటికీ కలిచి వేస్తుంటుంది. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదు. –కోట శ్రీనివాసరావు, నటుడు కడుపు తీపి ఇప్పటికీ ఏడిపిస్తోంది చాలా సందర్భాల్లో ఈ తరహా మీటింగ్‌లకు వెళ్లొద్దనుకున్నా. గతం గుర్తుకు వచ్చి కోలుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే రోడ్డు ప్రమాదంలో బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులుగా మేం పడే కష్టాలను వివరిస్తే మీలో మార్పు వస్తుందని వచ్చా. కనిపెద్ద చేసి చేతికందిన కొడుకులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే కడుపు తీపి ఏడిపిస్తుంది. పిల్లలు దైవ సమానములు. మీరొక వెలుగునిస్తారు. మిమ్మల్ని ప్రయోజకుల్ని చేయాలని అహర్నిశలు శ్రమించే తల్లిదండ్రులను మీ చిన్నపాటి తప్పిదాల ద్వారా నిరాశపరచవద్దు. సాధ్యం చేయు నరుడికి సాధ్యం కానిది లేదు. పిల్లలూ పెద్దల మాట వినండి. సంయమనంతో డ్రైవింగ్ చేయండి. –బాబూమోహన్, సినీ నటుడు, ఎమ్మెల్యే జీవితం విలువైనదని తెలుసుకోండి... డ్రంకన్ డ్రైవ్ చేస్తూ యువత రోడ్డు ప్రమదాలకు కారణమవుతోంది. ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్‌లతో ఎదుటివారు ప్రాణాలను సైతం సంకటంలోకి నెడుతున్నారు. యువతలో చాలా మంది ఈ నేరాలు చేయడం వల్ల పడే జైలు శిక్షపై అవగాహన లేదు. చాలా మంది చట్టం పేరుకే కానీ అమలు లేదనే భావనలో ఉన్నారు. అయితే పోలీసులు తాజాగా తీసుకుంటున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. మీరు ఒక్కసారి జీవిస్తారనే (యూ లీవ్ ఓన్లీ వన్) విషయాన్ని కౌన్సెలింగ్ సెషన్ల ద్వారా యువతలోకి తీసుకెళ్లగలుగుతున్నాం. యువకులూ..జీవితం విలువ తెలుసుకొని మసలుకోండి. –దేవిక, అమృతా ఫౌండేషన్ మార్పుకోసమే ఈ ప్రయత్నం... రోడ్డు ప్రమాదాల్లో తమవారిని కోల్పోయిన బాధితులు, సెలబ్రిటీల కుటుంబాలు పడే కడుపు తీపి కష్టాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించడం వల్ల యువతలో మార్పు తీసుకురావాలనుకున్నాం. అందుకే ప్రత్యక్షంగా పెద్దల అనుభవాలనే కాలేజీ విద్యార్థుల ముందు ఉంచే ప్రయత్నం చేశాం. ఇక డ్రైవింగ్ చేసేటప్పుడు వారు జాగ్రత్తగా నడుపుతారని అనుకుంటున్నాం. ఇప్పటికే ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. – మహేష్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్