‘ఐపీఎల్‌’కు కట్టుదిట్టమైన భద్రత | high-security to 'IPL' | Sakshi
Sakshi News home page

‘ఐపీఎల్‌’కు కట్టుదిట్టమైన భద్రత

Published Tue, Apr 4 2017 1:46 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM

‘ఐపీఎల్‌’కు కట్టుదిట్టమైన భద్రత

‘ఐపీఎల్‌’కు కట్టుదిట్టమైన భద్రత

ఉప్పల్‌: నగరంలోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరుగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం స్టేడియంలో హెచ్‌సీఏ కార్యదర్శి శేష్‌ నారాయణ్, ఉపాధ్యక్షులు అనిల్‌ కుమార్, అదనపు డీసీపీ ఉదయ్‌ కిరణ్, మల్కాజిగిరి డీసీపీ రమేష్‌ నాయుడులతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భద్రత ఏర్పాట్లను వెల్లడించారు.

ఉప్పల్‌ స్టేడియంలో బుధవారం ప్రారంభ మ్యాచ్, వచ్చే నెల 21న ఫైనల్‌ సహా ఎనిమిది మ్యాచ్‌లకు ఉప్పల్‌ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ నెల 9, 17, 19, 30, మే 6, 8 తేదీల్లో మిగతా ఆరు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌ల కోసం ప్రత్యేకించి 250 సెక్యూరిటీ వింగ్, 270 ట్రాఫిక్‌ సిబ్బంది, 700 మంది లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు, ఆరు ప్లాటూన్ల ఆక్టోపస్, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు, సీసీఎస్‌ స్టాఫ్, రెండు టెండర్‌ స్క్వాడ్‌ సహా మొత్తం 1800 మందికిపైగా సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికార్లు వెల్లడించారు.

పోలీస్‌ పహారాలో స్టేడియం...
ఉప్పల్‌ స్టేడియంను సోమవారమే తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. పోలీస్‌ భద్రతతో పాటు 88 సీసీ కెమెరాలు, అవసరమైన చోటల్లా చెక్‌ పాయింట్లు, బాంబు స్క్వాడ్‌  టీమ్‌లతో 24 గంటలు పహారా కాస్తున్నట్లు తెలిపారు. అనుకోని సంఘటనలు ఎదురైతే అప్పటికప్పుడు స్పందించే విధంగా టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంఘవిద్రోహ శక్తులపై కన్నేసి  ఉంచామని... అనుమానిత స్థలాల్లో రోజూ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. స్టేడియం లోపల, బయట షీ టీమ్‌లను అందుబాటులో ఉంచుతామని, ఈవ్‌ టీజర్లను గుర్తించి అదుపులోకి తీసుకుంటామన్నారు.

ఎమ్మార్పీ ధరలకే అమ్మాలి
వ్యాపారస్తులు గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)లకే తినుబండారాలు, శీతల పానీయాలను విక్రయించాలని, ఎమ్మార్పీ కంటే అధికంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ఇందుకోసం ప్రత్యేక వెండర్‌ సూపర్‌వైజింగ్‌ బృందాలను నియమించామని కమిషనర్‌ చెప్పారు. బీసీసీఐ జారీ చేసే అక్రిడేషన్‌ కార్డులను బదిలీ చేసుకోవద్దని సూచించారు. 4 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లకు రెండు గంటలు ముందుగానే అనుమతిస్తామన్నారు.

మొబైల్‌ ఫోన్లకు ఓకే.. కెమెరాలకు నో!
మొబైల్‌ ఫోన్లను అనుమతిస్తామని ఎలక్ట్రానిక్‌ పరికరాలు, కెమెరాలు, అగ్గిపెట్టెలు, బైనాక్యులర్స్, బ్యాగ్‌లు, బ్యానర్లు, సిగరేట్లు, లైటర్స్, కాయిన్స్, హెల్మెట్స్, బయటి తినుబండారాలు, వాటర్‌ బాటిల్స్, పెన్నులు, ఫర్‌ఫ్యూమ్స్, సెల్‌ఫోన్‌ రీచార్జి బ్యాటరీలను స్టేడియంలోపలికి అనుమతించరు.

ట్రాఫిక్‌ దారి మళ్లింపు
సికింద్రాబాద్‌ నుంచి ఉప్పల్‌ వెళ్లే భారీ వాహనాలను మ్యాచ్‌ జరుగుతున్న సమయాల్లో అనుమతించరు.  సికింద్రాబాద్‌  నుంచి ఘట్‌కేసర్‌ వెళ్లే భారీ వాహనాలు  హబ్సిగూడ  ఎన్‌ఎఫ్‌సి బ్రిడ్జి  మీదుగా చంగిచర్ల నుంచి వరంగల్‌ హైవే కు కలవాల్సి ఉంటుంది. అటునుంచి వచ్చే వారు కూడా అదే  దారిలో వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఎల్‌బీనగర్‌ నుంచి  ఉప్పల్‌ మీదుగా సికింద్రాబాద్‌ వెళ్లే  వాహనాలు  బోడుప్పల్, చంగిచర్ల మీదుగా హబ్సిగూడ చేరుకోవాల్సి ఉంటుంది.

పార్కింగ్‌ ప్రాంతాలు
సుమారు 9000 వాహనాల పార్కింగ్‌కు సరిపోయే స్థలాలను కేటాయించారు. ఐదు వేల ద్విచక్ర వాహనాలు, నాలుగు వేల ఫోర్‌ వీలర్ల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. కారు పాస్‌ ఉన్న వారు రామంతాపూర్‌ నుంచి గేట్‌ నంబర్‌ 1, 2 లకు వెళ్లాలి. కారు పాస్‌లు లేని వారు రామంతాపూర్‌ రోడ్డుకు ఇరువైపుల తమ వాహనాలను పార్క్‌ చేసుకోవచ్చు. దివ్యాంగులు తమ వాహనాలను పార్క్‌ చేసుకున్న అనంతరం రామంతాపూర్‌  దారి గుండా స్టేడియంలోకి గేట్‌ నంబర్‌ –3 ద్వారా లోపలికి ప్రవేశించాలి. గేట్‌ నంబర్‌ 4 నుంచి 10 ద్వారా వెళ్లాల్సినవారు తమ వాహనాలను పెంగ్విన్‌ గ్రౌండ్‌లో పార్కు చేసి, ఏక్‌ మినార్‌ మజీద్‌ రోడ్‌ నుంచి లోపలికి వెళ్లొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement