ఐపీఎల్ మ్యాచ్‌లకు భారీ బందోబస్తు
ఉప్పల్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నేటి నుంచి జరగనున్న ఐపిఎల్-8వ ఎడిషన్ మ్యాచ్‌లకు భారీ బందోబస్తును ఏర్పాటుచేసినట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ తెలిపారు. ఈ మేరకు బందోబస్తు, పార్కింగ్, ట్రాఫిక్‌పై ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 1200 మంది సిబ్బందితో ప్రత్యేక భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.
250 మంది సెక్యూరిటీవింగ్, 270 ట్రాఫిక్ పోలీసులు, 600 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, 2 యూనిట్ల ఆక్టోపస్, ప్లాటున్ల ఆర్మీ సిబ్బందితో పాటు స్పెషల్ బ్రాంచ్ సీసీఎస్ సిబ్బందితో పాటు 2 ఫైర్ వాహనాలు, ఫైర్ ఫైటింగ్ స్క్వాడ్‌లతో బందోబస్తును కట్టుదిట్టం చేసినట్లు పేర్కొన్నారు. స్టేడియం చుట్టూ 2 కిలోమీటర్ల మేర వీక్షించే విధంగా పార్కింగ్ ప్రాంతాలతో కలిసి 60 సీసీ కెమెరాలను ఏర్పాటుచేసినటు వివరింఆచరు. అలాగే అసాంఘిక శక్తుల కార్యక్రమాలను పసిగట్టేందుకు ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈవ్ టీజర్లను అదుపులో పెట్టేందుకు ఈసారీ ప్రత్యేకంగా షీ టీమ్స్‌ను ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు.
స్టేడియంలోకి ఎలా వెళ్లాలి..
మెట్రో రైల్ పనులు జరుగుతున్న దృష్ట్యా ఎలాంటి వాహనాలను ఉప్పల్ జెన్‌ప్యాక్ట్ నుంచి రింగురోడ్డు వరకు నిలపరాదు. కార్ పాస్ ఉన్న వారు, వికలాంగులు, కార్పొరేట్ బాక్స్‌కు వెళ్లాల్సిన వారు రామంతాపూర్ నుంచి గేట్-1, గేట్-2 ద్వారా లోనికి ప్రవేశించి ఏబీ పార్కింగ్‌లో పార్కింగ్ చేసుకోవాలి.
గేట్-2,3,11 లోకి వెళ్లాల్సిన వారు రామంతాపూర్ రోడ్డుకు ఇరువైపులా సింగిల్ లైన్ పార్కింగ్ చేసుకోవాలి. గేట్-4 మొదలుకొని గేట్-9 ద్వారా వెళ్లాల్సిన వారు తమ వాహనాలను ఏక్‌మినార్ మజీద్, పెంగ్విన్ గ్రౌండ్ వద్ద పార్కింగ్ చేసుకోవాలి.
ఉప్పల్‌లో ట్రాఫిక్ అంక్షలు..
ఎల్బీనగర్, వరంగల్ రూట్ల ద్వారా హబ్సిగూడ వైపు వచ్చే ఎలాంటి భారీ వాహనాలను అనుమతించరు. ఎల్బీనగర్ నుంచి వచ్చే భారీ వాహనాలు ఉప్పల్ చౌరస్తా, చెంగిచర్ల , మల్లాపూర్ వైపుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈసీఐఎల్, కుషాయిగూడ, చర్లపల్లి నుంచి ఉప్పల్ చౌరస్తా వైపు వచ్చే భారీ వాహనాలు మల్లాపూర్ బ్రిడ్జి నుంచి చెంగిచెర్ల చౌరస్తా మీదుగా తరలిస్తారు. ట్రాఫిక్ ఆంక్షలు ఈ నెల 2,11,15,17 తేదీలలో మరుసటి రోజు అర్ధరాత్రి వరకు ఉంటుంది.