కన్నవారికి.. కన్నీళ్లు మిగల్చకండి! | "Student Life ... Golden Life ' | Sakshi
Sakshi News home page

కన్నవారికి.. కన్నీళ్లు మిగల్చకండి!

Published Wed, Feb 1 2017 12:41 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

కన్నవారికి.. కన్నీళ్లు మిగల్చకండి! - Sakshi

కన్నవారికి.. కన్నీళ్లు మిగల్చకండి!

సిటీబ్యూరో:  తమ ప్రమేయం లేకుండా కొందరు, స్వయం తప్పిదాలు చేసి మరికొందరు రోడ్డు ప్రమాదాల్లో అర్ధంతరంగా తనువులు చాలిస్తూ వారి కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టేస్తున్నారు. ఇక బంగారు భవిష్యత్‌ కలిగిన విద్యార్థులు ‘స్టూడెంట్‌ లైఫ్‌...గోల్డెన్‌ లైఫ్‌’ అంటూ ఓవర్, ర్యాష్, డ్రంకన్‌ డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. తమ కుటుంబానికి అండగా..ఆశాకిరణంగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా రోడ్డు ప్రమాదంలో చనిపోతే..ఆ బాధ..ఆ కష్టాలు..కన్నీళ్లు చెప్పనలవి లేకుండా ఉంటాయని పలువురు బాధితులు పేర్కొన్నారు.

రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌ స్టేడియంలో మంగళవారం ‘యాక్సిడెంట్‌ ఫ్రీ డే’ సందర్భంగా రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దాదాపు మూడు వేల మందికిపైగా ఇంజనీరింగ్‌ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల్లో ఆప్తులను కోల్పోయిన కొంతమంది ప్రముఖులను పిలిపించి.. యువతకు సందేశాన్నిప్పించారు.

ట్రాక్టర్‌ డ్రైవర్‌ అయిన గణేశ్‌ ఆ చిన్న కుటుంబానికి ఆధారం. భార్య విద్యకు పాప పుట్టిందని తెలిసి చూసేందుకు బైకుపై ఆస్పత్రికి వెళ్తుండగా గతేడాది ఆగస్టు 28న గురునానక్‌ కాలేజ్‌ వద్ద బొలెరో వాహనం ఢీకొట్టడంతో ప్రాణాలు విడిచాడు. దీంతో విద్యతో పాటు ఆమె పాప దిక్కులేనివారయ్యారు. బాగోగులు చూసుకునే వారు లేకపోవడంతో నల్గొండ జిల్లా చింతపల్లి మండలం బొడుకొండ్లుకు చెందిన పుట్టింట్లో ఉంటోంది విద్య. కూలీపని చేసుకుంటూ తన బిడ్డను చూసుకుంటోంది.

ప్లీజ్‌...పెద్దల మాట వినండి
నేటి కుర్రకారుకు సాధన తక్కువ. వాదన ఎక్కువ. పెద్దలు చెప్పిన విషయాలను అనుసరించరు. అన్నిరకాల వాహనాలు రోడ్డు మీద వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పడినప్పుడు బైకర్లు చిన్న ప్లేస్‌ దొరికితే చాలు ఆత్రంగా ముందుకెళుతుంటారు. కొన్ని సెకన్ల పాటు వేచిచూస్తే ప్రమదాన్ని తప్పించినవారమవుతాం. ఇది పిల్లలకు చెబితే కోపం ఎక్కువ. చెప్పకపోతే ఏమైనా జరుగుతోందోనని బాధ. ఇప్పటికైనా పెద్దలు చెప్పిన మాటలు వినడంతో పాటు డ్రైవింగ్‌ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించి జీవితం సుఖమయం చేసుకోవాలి. నా కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడన్న విషయం ఇప్పటికీ కలిచి వేస్తుంటుంది. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదు.
    –కోట శ్రీనివాసరావు, నటుడు

కడుపు తీపి ఇప్పటికీ ఏడిపిస్తోంది
చాలా సందర్భాల్లో ఈ తరహా మీటింగ్‌లకు వెళ్లొద్దనుకున్నా. గతం గుర్తుకు వచ్చి కోలుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే రోడ్డు ప్రమాదంలో బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులుగా మేం పడే కష్టాలను వివరిస్తే మీలో మార్పు వస్తుందని వచ్చా. కనిపెద్ద చేసి చేతికందిన కొడుకులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే కడుపు తీపి ఏడిపిస్తుంది. పిల్లలు దైవ సమానములు. మీరొక వెలుగునిస్తారు. మిమ్మల్ని ప్రయోజకుల్ని చేయాలని అహర్నిశలు శ్రమించే తల్లిదండ్రులను మీ చిన్నపాటి తప్పిదాల ద్వారా నిరాశపరచవద్దు. సాధ్యం చేయు నరుడికి సాధ్యం కానిది లేదు. పిల్లలూ పెద్దల మాట వినండి. సంయమనంతో డ్రైవింగ్‌ చేయండి.  –బాబూమోహన్, సినీ నటుడు, ఎమ్మెల్యే

జీవితం విలువైనదని తెలుసుకోండి...
డ్రంకన్‌ డ్రైవ్‌ చేస్తూ యువత రోడ్డు ప్రమదాలకు కారణమవుతోంది. ఓవర్‌ స్పీడ్, ర్యాష్‌ డ్రైవింగ్‌లతో ఎదుటివారు ప్రాణాలను సైతం సంకటంలోకి నెడుతున్నారు. యువతలో చాలా మంది ఈ నేరాలు చేయడం వల్ల పడే జైలు శిక్షపై అవగాహన లేదు. చాలా మంది చట్టం పేరుకే కానీ అమలు లేదనే భావనలో ఉన్నారు. అయితే పోలీసులు తాజాగా తీసుకుంటున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. మీరు ఒక్కసారి జీవిస్తారనే (యూ లీవ్‌ ఓన్లీ వన్‌) విషయాన్ని కౌన్సెలింగ్‌ సెషన్ల ద్వారా యువతలోకి తీసుకెళ్లగలుగుతున్నాం. యువకులూ..జీవితం విలువ తెలుసుకొని మసలుకోండి.     –దేవిక, అమృతా ఫౌండేషన్‌

మార్పుకోసమే ఈ ప్రయత్నం...
రోడ్డు ప్రమాదాల్లో తమవారిని కోల్పోయిన బాధితులు, సెలబ్రిటీల కుటుంబాలు పడే కడుపు తీపి కష్టాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించడం వల్ల యువతలో మార్పు తీసుకురావాలనుకున్నాం. అందుకే ప్రత్యక్షంగా పెద్దల అనుభవాలనే కాలేజీ విద్యార్థుల ముందు ఉంచే ప్రయత్నం చేశాం. ఇక డ్రైవింగ్‌ చేసేటప్పుడు వారు జాగ్రత్తగా నడుపుతారని అనుకుంటున్నాం. ఇప్పటికే ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటూనే ఉన్నాం.     – మహేష్‌ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement