మెట్రో తొలిదశ పై డైలమా..!
వచ్చే ఏడాదిలో ప్రారంభించే అవకాశం
కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ కోసం నిరీక్షణ
భారత్లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మకు తెలిపిన సీఎం..
సిటీబ్యూరో: నగరంలో మెట్రో ప్రాజెక్టు తొలిదశ (నాగోల్-మెట్టుగూడ 8 కి.మీ మారం)ప్రారంభోత్సవ తేదీపై సందిగ్ధం నెలకొంది. ముందుగా అనుకున్నట్టుగా మార్చి 21న ప్రారంభించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల రీత్యా వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్టు మంగళవారం తనను సచివాలయంలో కలిసిన భారత్లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపినట్లు సీఎం కార్యాలయం ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఇదే విషయమై నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ మెట్రో రైలు మేనేజింగ్ డెరైక్టర్ వీబీ గాడ్గిల్ను ‘సాక్షి’ సంప్రదించగా.. నాగోలు-మెట్టుగూడ మార్గంలో పనులు తుదిదశకు చేరుకున్నాయన్నారు. ఈ మార్గంలో మెట్రో రైళ్లు నిరంతరాయంగా పరుగులు పెట్టడానికి, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్ర రైల్వేశాఖ ఆధ్వర్యంలోని కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నుంచి అధికారికంగా భద్రతా ధ్రువీకరణ రావాల్సి ఉందన్నారు. ఇటీవలే పూణేలోని రైల్వే డిజైన్స్ అండ్ స్టాండర్ట్స్ అర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) సంస్థ నిపుణుల ఆధ్వర్యంలో ఉప్పల్ మెట్రో డిపోలోని 8 మెట్రో రైళ్లకు 18 రకాల ప్రయోగ పరీక్షలు చేశామని, అన్నింటిలోను మెట్రో రైళ్లు సఫలమయ్యాయన్నారు. ఆర్డీఎస్వో జారీచేసిన రిపోర్టుతో పాటు ఇతర కీలక పత్రాలను కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీకి ఇటీవలే నివేదించామన్నారు.
వారు జారీ చేసే ధ్రువీకరణతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే మెట్రో రైళ్ల వాణిజ్య రాకపోకలను అధికారికంగా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. నగరంలో మొత్తం మూడు కారిడార్లలో 72 కి.మీ మార్గంలో చేపట్టిన పనులను పరిపాలన సౌలభ్యం కోసమే ఆరు దశలుగా విభజించామన్నారు. అంతేతప్ప అదే తేదీల్లో ఆయా రూట్లలో మెట్రో రైళ్లను విధిగా నడపాలన్న నిబంధనకు చట్టబద్ద తేదీ లేదని, 2011లో రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న రాయితీ ఒప్పందం (కన్సేషన్ అగ్రిమెంట్)లోనూ అదే తేదీల్లో విధిగా రైళ్ల రాకపోకలను ప్రారంభించాలన్న నిబంధన విధించలేదన్నారు. మెట్టుగూడ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు మెట్రో మార్గం పూర్తయితేనే ఈ రూట్లో అత్యధిక మంది మెట్రో రైళ్లను ఉపయోగించుకుంటారని గాడ్గిల్ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ఈ విషయమై హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని సంప్రదించగా స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము పనిచేస్తామని స్పష్టంచేశారు.
పాతనగరంలో ఆలస్యంగా మెట్రో పరుగులు..
మెట్రో రైళ్లు పాసైన సాంకేతిక పరీక్షలివే..
పట్టాలపై రైలు నిలిపి ఉన్నపుడు, ఎలివేటెడ్ మార్గంలో పరుగులు, పట్టాల సామర్ధ్యం, ప్రొఫెల్షన్ సిస్టం, రైలు బ్రేకులు, సీసీ టీవీలు, హెడ్ లైట్ల పనితీరు, శబ్దం, కూత, కుదుపులు, కమ్యునికేషన్ వ్యవస్థ, రైలు పరుగులో గమనం తీరు, ప్రయాణీకులకు సమాచారం అందించే వ్యవస్థ, కంప్రెసర్,రైలు ఆగినపుడు,పరుగులు తీస్తున్నపుడు ఆటోమేటిక్గా మూసుకొని, తెరుచుకునే డోర్ల పనితీరు. రైలులో వెంటిలేషన్, ఎయిర్ కండిషన్ వ్యవస్థల పనితీరు, విపత్తులు సంభవిస్తే రైలులో వివిధ వ్యవస్థ పని చేసే విధానం, ఆసిలేషన్, అత్యవసర బ్రేకుల పనితీరు, సిగ్నలింగ్, ఓవర్హెడ్ ట్రాక్షన్ సిస్టం, విశ్వసనీయత, సానుకూలత, నిర్వహణ సామర్థ్యం, భద్రతకు సంబంధించిన ఇతర పరీక్షలు.