Commissioner Srikanth
-
అమర్నాథ్ యాత్ర.. తెలుగు యాత్రికులు క్షేమం
ఢిల్లీ: అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగు యాత్రికులు సురక్షితంగా ఉన్నారని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు. శ్రీనగర్‌లో కర్ఫ్యూ కారణంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాకు చెందిన యాత్రికులు అవస్థలు పడిన విషయం తెలిసిందే. శ్రీనగర్ ఎస్పీతో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ శ్రీకాంత్ ఫోన్లో మాట్లాడారు. యాత్రికులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. షానీ రిసార్ట్ లో 128 తెలుగు యాత్రికులు ఉన్నారు. ఆర్మీ పర్యవేక్షణలో తెలుగు యాత్రికులు సురక్షితంగా ఉన్నారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి యాత్రికులను ఇక్కడికి తీసుకొస్తామన్నారు. -
మరో 3 రోజులు
‘రాజధాని’లో గ్రామ కంఠాలపై రానున్న స్పష్టత రెండు, మూడు రోజుల్లో నిర్ణయం ప్రకటించనున్న అధికారులు గుంటూరు: రాజధాని గ్రామాల్లో గ్రామ కంఠాలపై అధికార యంత్రాంగం రెండు మూడు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించనుంది. కొంతకాలంగా గ్రామ కంఠాలపై స్పష్టత లేకపోవడంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాజధానిలో కనీసం ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉండదేమోననే భయం వారిని వెంటాడింది. తుళ్ళూరు సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిషనర్ శ్రీకాంత్, జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, అడిషనల్ జాయింట్ కలెక్టర్ చెన్నకేశవులు రాజధానిలోని 29 గ్రామాలకు చెందిన కాంపిటెంట్ అథార్టీ, డిప్యూటీ కలెక్టర్లతో సమీక్షించారు. గ్రామ కంఠాలపై సీఆర్డీఏ రూపొందించిన విధివిధానాల ఆధారంగా అధికారులు సరిహద్దులు నిర్ణయించారు. వీటిని ఆధారంగా చేసుకుని జాయింట్ కలెక్టర్ శ్రీధర్ కమిషనర్‌కు వివరాలు అందజేశారు. ‘సమీకరణ’ నుంచి మినహాయింపు రాజధానిలోని 29 గ్రామాల్లో సుమారు 300 ఎకరాల్లో గ్రామ కంఠాలు విస్తరించి ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో రెండు మూడు ఎకరాల్లో, మరి కొన్ని గ్రామాల్లో 10 నుంచి 15 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. గ్రామానికి దూరంగా ఉన్నప్పటికీ వ్యవసాయ పనులకు ఉపయోగించే షెడ్లు, గడ్డివాముల ఏర్పాటుకు కేటాయించిన స్థలాలు, పొగాకు బ్యారెన్లు తదితర నిర్మాణాలను భూ సమీకరణ నుంచి మినహాయించారు. ఈ స్థలాలను రైతులు భవిష్యత్తులో తమకు అనుకూలంగా వినియోగించుకునే అవకాశం లభించనున్నది. గ్రామ కంఠం పరిధిలో లేఅవుట్లు ఉంటే వాటికీ మినహాయింపునిచ్చారు. ఆ లేఅవుట్లలో నిర్మాణాలు జరుపుకొనే అవకాశం లభించనుంది. ఆ తేదీకి ముందు నిర్మాణాలకూ మినహాయింపు.. డిసెంబర్ ఎనిమిదో తేదీ -2014కి ముందు స్థలాల్లో ఉన్న నిర్మాణాలకూ మినహాయింపు ఇచ్చారు. ఆ తరువాత నిర్మాణం జరిగిన స్థలాలకూ భూ సమీకరణ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. గ్రామ కంఠాలపై వచ్చిన 7700 దరఖాస్తులను అధికారులు పరిశీలించి నివేదికను కమిషనర్‌కు అందించారు. వీటిపై ఒకటి రెండ్రోజుల్లో కమిషనర్ నిర్ణయం తీసుకుని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. -
సీఆర్డీఏ చట్టం పేదల కడుపుకొట్టేందుకే
విరుచుకుపడిన వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం సీఆర్డీఏ కమిషనర్‌కు వినతిపత్రం విజయవాడ బ్యూరో : రాజధాని కోసం చేపట్టిన భూసమీకరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోందని వైఎస్సార్ సీపీ శాసనసభా పక్షం ఆరోపించింది. సోమవారం రాజధాని రైతులు, పేదల సమస్యలపై సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్‌కు ఇచ్చిన వినతిపత్రంలో అనేక అంశాలను ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పేర్కొన్నారు. సీఆర్డీఏ చట్టం పేదవాడి పొట్టగొట్టేందుకే అన్నట్లు ఉందని, భూసమీకరణ పేరుతో రైతులను దగా చేస్తున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి ప్రైవేటు భూములు తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా ప్రభుత్వం తుళ్లూరు ప్రాంత రైతులను వేధిస్తోందని ఆరోపించారు. సీఆర్డీఏ చట్టంలో ఏముందనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియకుండా చేసిందని తెలిపారు. మాయమాటలు చెప్పి, రెవెన్యూ అధికారులతో బెదిరించి, పోలీసులతో ఒత్తిడి తెచ్చి పార్టీలు, కులాల వారీగా ప్రజలను విడదీసి, గూండాలతో దాడులు చేయించి ప్రభుత్వం భూసమీకరణకు రైతులను ఒప్పించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. సీఆర్డీఏ చట్టం ద్వారా రాజధాని ప్రాంతంలో ఎమర్జెన్సీ తరహా పాలన చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యతగల ప్రతిపక్షంగా వైఎస్సార్ సీపీ రాజధాని రైతు పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి అక్కడి రైతులకు అండగా నిలిచిందని తెలిపారు. మూడు, నాలుగు పంటలు పండే ప్రాంతంలో రైతులు భూములు తీసుకోవడానికి వీల్లేదని డిమాండ్ చేసింది. అనుమతి పత్రాలు ఇచ్చిన అమాయక రైతులందరికీ వారు వాటిని వెనక్కు తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం అగ్ర నాయకులెవరూ భూములు ఇవ్వకపోవడం, సీఆర్డీఏ పరిధి బయట ఆ పార్టీ పెద్దలు భారీ ఎత్తున వేల ఎకరాలు కొనుగోలు చేయడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. మొత్తం రాజధాని భూముల వ్యవహారంపై న్యాయ విచారణ జరగాలన్నారు. రాజధాని నిర్మాణానికి తాము అడ్డుపడడంలేదని, అమాయక రైతుల భూములను అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదించాలనుకోవడం దారుణమన్నారు. రైతులు, కూలీలు, భూమి లేని నిరుపేదలు, సంప్రదాయ వృత్తులవారు, పల్లెల్లో నివసించే ప్రతి ఒక్కరి హక్కులు కాపాడేందుకు తాము పోరాడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం వివిధ జిల్లాలకు చెందిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతోపాటు కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్, మేకా ప్రతాప్ అప్పారావు, రక్షణనిధి, పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. భారీ బందోబస్తు వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయానికి వస్తుందనే సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. వందల మంది పోలీసులు లెనిన్ సెంటర్లో మోహరించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ పోలీసుల బందోబస్తు వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు.