విరుచుకుపడిన వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షం
సీఆర్‌డీఏ కమిషనర్‌కు వినతిపత్రం
విజయవాడ బ్యూరో : రాజధాని కోసం చేపట్టిన భూసమీకరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోందని వైఎస్సార్ సీపీ శాసనసభా పక్షం ఆరోపించింది. సోమవారం రాజధాని రైతులు, పేదల సమస్యలపై సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌కు ఇచ్చిన వినతిపత్రంలో అనేక అంశాలను ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పేర్కొన్నారు. సీఆర్‌డీఏ చట్టం పేదవాడి పొట్టగొట్టేందుకే అన్నట్లు ఉందని, భూసమీకరణ పేరుతో రైతులను దగా చేస్తున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి ప్రైవేటు భూములు తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా ప్రభుత్వం తుళ్లూరు ప్రాంత రైతులను వేధిస్తోందని ఆరోపించారు. సీఆర్‌డీఏ చట్టంలో ఏముందనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియకుండా చేసిందని తెలిపారు. మాయమాటలు చెప్పి, రెవెన్యూ అధికారులతో బెదిరించి, పోలీసులతో ఒత్తిడి తెచ్చి పార్టీలు, కులాల వారీగా ప్రజలను విడదీసి, గూండాలతో దాడులు చేయించి ప్రభుత్వం భూసమీకరణకు రైతులను ఒప్పించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. సీఆర్‌డీఏ చట్టం ద్వారా రాజధాని ప్రాంతంలో ఎమర్జెన్సీ తరహా పాలన చేస్తున్నారని ఆరోపించారు.
బాధ్యతగల ప్రతిపక్షంగా వైఎస్సార్ సీపీ రాజధాని రైతు పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి అక్కడి రైతులకు అండగా నిలిచిందని తెలిపారు. మూడు, నాలుగు పంటలు పండే ప్రాంతంలో రైతులు భూములు తీసుకోవడానికి వీల్లేదని డిమాండ్ చేసింది. అనుమతి పత్రాలు ఇచ్చిన అమాయక రైతులందరికీ వారు వాటిని వెనక్కు తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం అగ్ర నాయకులెవరూ భూములు ఇవ్వకపోవడం, సీఆర్‌డీఏ పరిధి బయట ఆ పార్టీ పెద్దలు భారీ ఎత్తున వేల ఎకరాలు కొనుగోలు చేయడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. మొత్తం రాజధాని భూముల వ్యవహారంపై న్యాయ విచారణ జరగాలన్నారు. రాజధాని నిర్మాణానికి తాము అడ్డుపడడంలేదని, అమాయక రైతుల భూములను అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదించాలనుకోవడం దారుణమన్నారు. రైతులు, కూలీలు, భూమి లేని నిరుపేదలు, సంప్రదాయ వృత్తులవారు, పల్లెల్లో నివసించే ప్రతి ఒక్కరి హక్కులు కాపాడేందుకు తాము పోరాడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం వివిధ జిల్లాలకు చెందిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతోపాటు కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్, మేకా ప్రతాప్ అప్పారావు, రక్షణనిధి, పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి పాల్గొన్నారు.
భారీ బందోబస్తు
వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షం విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయానికి వస్తుందనే సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. వందల మంది పోలీసులు లెనిన్ సెంటర్‌లో మోహరించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ పోలీసుల బందోబస్తు వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
సీఆర్‌డీఏ చట్టం పేదల కడుపుకొట్టేందుకే
Published Tue, Feb 24 2015 1:25 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement