land of the equation
-
కనిపించని నారాయణ
వినిపించని అభివృద్ధి పారాయణ పూటకో నజరానాతో రాజధాని గ్రామాలలో హడావుడి పని పూర్తయ్యాక పత్తాలేని వైనం విడుదలకు నోచని గ్రామాలకు ప్రకటించిన సాయం భూ సమీకరణ వేగంగా పూర్తి చేయడానికి మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ అనేక గిమ్మిక్కులు చేశారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా రాజధాని గ్రామాల్లో పర్యటించారు. మీతోనే.. నేను అంటూ ప్రజలతో మమేకమయ్యారు. చెట్ల కింద భోజనాలు చేశారు. సమీకరణకు సహకరించిన నేతలు, గ్రామస్తులను సత్కరించారు. వారి నుంచి తానూ సత్కారాలు పొందారు. గుర్రమెక్కి ఊరేగారు. భూ సమీకరణ ముందుగా పూర్తి చేసిన గ్రామాలకు నజరానాలు {పకటించారు. ఇంత హడావుడి చేసిన మంత్రి భూ సమీకరణ కార్యక్రమం పూర్తయిన తరువాత ఒట్టు తీసి గట్టుమీద పెట్టిన రీతిలో వ్యవహరించారు. అమరావతి శంకుస్థాపన తరువాత రాజధానివైపు కన్నెత్తి చూడటం లేదు. -సాక్షి ప్రతినిధి, గుంటూరు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూ సమీకరణ నోటిఫికేషన్‌ను మొదట్లో అన్ని గ్రామాల రైతులు పూర్తిగా వ్యతిరేకించారు. ఈ విధానంపై అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం టీడీపీ గ్రామాలను ఎంచుకుంది. మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు అక్కడి టీడీపీ నేతలు, కార్యకర్తలను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనా విధానంపై అవగాహన కలిగించారు. రైతుల నుంచి భూ సమీకరణకు వ్యతిరేకత లేకుండా చూసే బాధ్యతను స్థానిక నేతలకు అప్పగించారు. తొలుత తుళ్ళూరు మండలంలోని టీడీపీ అనుకూల గ్రామాలను ఎంచుకున్నారు. ముఖ్యంగా నేలపాడు, ఐనవోలు, శాఖమూరు, తుళ్ళూరు, దొండపాడు, బోరుపాలెం, అబ్బురాజుపాలెం తదితర గ్రామాల రైతులను మంత్రి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, తాడికొండ శాసన సభ్యులు తెనాలి శ్రావణ్‌కుమార్‌లు ఎక్కువగా కలిశారు. ఉత్సాహపరిచి.. ఆనక నీరుగార్చి.. మంత్రి నారాయణ రాజధాని గ్రామాల్లో రేయింబవళ్లు పర్యటించారు. గ్రామాల్లోని వార్డు స్థాయి నాయకుడిని కూడా కలిసి భూ సమీకరణ కార్యక్రమానికి మనమంతా సహకరించాలి... ప్రపంచం మెచ్చే రాజధానిని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్న సీఎం చంద్రబాబుకు మనమంతా అండగా ఉందాం..రాజధాని నిర్మాణంతో మనమూ.. పెరుగుదాం అంటూ వారిని ఉత్సాహ పరిచారు. భూ సమీకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన గ్రామాలకు నజరానాలు ప్రకటించారు. ఒకో గ్రామానికి రూ.30 లక్షలను ప్రభుత్వం నుంచి సహాయంగా ఇప్పిస్తానని, డ్రైనేజి, రక్షిత మంచినీటి సరఫరా, వీధిలైట్ల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎల్ఈడీ బల్బులు వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు. అధికారులతో యుద్ధప్రాతిపదికన ప్రతిపాదనలు తయారు చేయించారు. దీనితో తుళ్ళూరు మండల పరిధిలోని నేలపాడు, ఐనవోలు గ్రామాలు 99 శాతం భూములను రెండు నెలల్లోపే భూ సమీకరణకు అందించాయి. మిగిలిన గ్రామాలు అటు ఇటుగా భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చేశాయి. నాయకుల్లో అసహనం.. భూ సమీకరణ పూర్తయి నాలుగు నెలలు గడిచినా మంత్రి నారాయణ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ప్రతిపాదనలన్నీ అటకెక్కాయి. ముందుగా భూములు ఇచ్చిన గ్రామాలకు మంత్రి ప్రకటించిన రూ.30 లక్షల సహాయం ఇంకా విడుదలకాలేదు. ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి. రాజధానిలోని అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ బల్బుల సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీ కొన్ని గ్రామాల్లోనే అమలు పరిచారు. మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలు ఏ దశలో ఉన్నాయో తెలి యని పరిస్థితి. దీనికితోడు నిత్యం రాజధాని గ్రామాల ప్రజలతో మమేకం అయిన నారాయణ శంకుస్థాపన తరువాత అటువైపు కన్నెత్తి చూడలేదు. ఈ పరిణామాలకు భూములు ఇచ్చిన రైతులు కలవరం చెందుతుంటే, పచ్చని పంటలు పండే మాగాణి భూముల్లో పెరిగిన పిచ్చి మొక్కల్ని చూసి టీడీపీ నేతలు తప్పుచేశామనే భావనతో మధనపడుతున్నారు. -
బాబుగారి భూదాహం
ఎయిర్‌పోర్టుల పేరుతో మరో 22 వేల ఎకరాలపై కన్ను భోగాపురంలో ఎయిర్‌పోర్టుకు 6,500ఎకరాలు చాలన్న అధికారులు.. అదీ ఎక్కువేనన్న నిపుణులు 15 వేల ఎకరాల సేకరణకు నిర్ణయం రైతుల పొట్టకొట్టి బడా సంస్థలకు.. హైదరాబాద్: రాజధాని పేరుతో, భూసమీకరణ ముసుగులో 35 వేల ఎకరాల పచ్చని పంటభూములను గుంజుకున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విమానాశ్రయాల పేరుతో మరో 22 వేల ఎకరాలపై కన్నేసింది. పచ్చని పంటలు పండే వేల ఎకరాల భూములను సిమెంట్ కాంక్రీటుగా మార్చేయడానికి సిద్ధమైంది. అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో విజయనగరం జిల్లా భోగాపురంలో ఏకంగా 15 వేల ఎకరాలు, ఏడు మినీ విమానాశ్రయాల పేరుతో మరో ఏడు వేల ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబు ఇటీవల పర్యటించిన జపాన్‌లోని హనెడా అంతర్జాతీయ విమానాశ్రయం 1,800 ఎకరాలు మాత్రమే. దేశంలోనే అత్యంత ఎక్కువ ఎయిర్ ట్రాఫిక్ ఉన్న ముంబై విమానాశ్రయాన్ని 1,850 ఎకరాల్లోనే నిర్మించారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కూడా 6,500 ఎకరాలు సరిపోతుందని అధికారులు ఇచ్చిన నివేదికలో స్పష్టంగా ఉంది. ఈ భూమి కూడా ఎక్కువేనని నిపుణులు చెబుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు సర్కారు మాత్రం 15 వేల ఎకరాలు సేకరించడం ఎవరికి మేలు చేసేందుకన్నది అర్థం కావడంలేదు. భోగాపురంలో తొలి దశ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి రూ.3000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. స్థల క్లియరెన్స్‌కు ఇప్పటికే కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు దరఖాస్తు కూడా చేశారు. ఇందుకోసం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కంపెనీ లిమిటెడ్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పీపీపీ విధానంలో విమానాశ్రయ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 6,500 ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సరిపోతున్నా 15 వేల ఎకరాలు సేకరించాలని చంద్రబాబు నాయుడు సర్కారు తీసుకున్న నిర్ణయం వెనుక రైతుల పొట్టకొట్టి కార్పొరేట్ సంస్థ జేబులు నింపే ఎత్తుగడ ఉందనే అనుమానాన్ని అధికార వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ప్రాంతంలో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు భూములను అప్పగించడానికి ఇన్ని వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. భోగాపురంలో అర ఎకరం, ఎకరం, రెండేసి ఎకరాల చిన్న, సన్న కారు రైతులే ఎక్కువగా ఉన్నారని, అలాంటి రైతుల పొట్టకొట్టడం అన్యాయమని అధికారులు పేర్కొంటున్నారు. అన్నీ పీపీపీలే! రాష్ట్రంలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్య విధానంపైనే ఆధారపడుతుంది. ఇఛ్చాపురం నుంచి తడ వరకు చేపట్టనున్న బీచ్ కారిడార్‌కు బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (బూట్) విధానాన్ని అవలంబించనుంది. దీనివల్ల ప్రయాణికులపై భారీగా టోల్ భారం పడుతుంది. ఇఛ్చాపురం నుంచి తడ వరకు 1000 కిలో మీటర్ల మేర బీచ్ కారిడార్ నిర్మాణం. ఇఛ్చాపురం-విశాఖపట్నం, విశాఖపట్నం-నర్సాపురం, నర్సాపురం-ఒంగోలు, ఒంగోలు-తడ వరకు నాలుగు ప్యాకేజీలు. M>-Mుళం జిల్లా బావనపాడులో 4000 ఎకరాల్లో రూ.3,500 కోట్ల వ్యయంతో పోర్టు ఏర్పాటు. విశాఖపట్టణం, నెల్లూరు, తిరుపతి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో అంతర్జాతీయ స్కూళ్ల ఏర్పాటు. ఒక్కో స్కూలుకు రూ.65 కోట్ల వ్యయం, 20 ఎకరాల స్థలం. తిరుపతి, విశాఖపట్టణాల్లో రూ.400 కోట్ల వ్యయంతో మెగా కన్వెన్షన్ కేంద్రాల నిర్మాణం. ఒక్కో కేంద్రానికి 60 ఎకరాలు చొప్పున స్థలం. విజయవాడలో 30 ఎకరాల స్థలంలో రూ.110 కోట్ల వ్యయంతో కన్వెన్షన్ కేంద్రం. విశాఖ, తిరుపతిలో ఐదు నక్షత్రాల హోటళ్లు. విజయవాడలో మూడు నక్షత్రాల హోటల్. విశాఖపట్టణం, తిరుపతిల్లో 180 కోట్ల రూపాయల చొప్పున వ్యయంతో సమగ్ర క్రీడా కాంప్లెక్స్‌ల నిర్మాణం. ఒక్కో కాంప్లెక్స్‌కు 70 ఎకరాలు. ఏడు జిల్లాల్లో విమానాశ్రయాలకు ఏడు వేల ఎకరాలు మరోవైపు ఏడు జిల్లాల్లో కూడా విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఒక్కో జిల్లాల్లో 1000 ఎకరాలు చొప్పున ఏడు వేల ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. ఒక్కో విమానాశ్రయ నిర్మాణానికి 100 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. పీపీపీ విధానంలోనే ఈ విమానాశ్రయాలను నిర్మిస్తారు. నెల్లూరు జిల్లా దగ్గదర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లు, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, చిత్తూరు జిల్లా కుప్పం, ప్రకాశం జిల్లా ఒంగోలు, దొనకొండ, గుంటూరు జిల్లా నాగార్జునసాగర్‌లో ఈ విమానాశ్రయాలను నిర్మించనున్నారు. -
గడువులోపు నిర్ణయం చెప్పండి
ఏపీ భూ సమీకరణ అభ్యంతరాలపై హైకోర్టు హైదరాబాద్: ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) చట్టం కింద చేస్తున్న భూ సమీకరణపై పిటిషనర్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, వాటిపై చట్టంలో నిర్దేశించిన గడువులోపు నిర్ణయం వెలువరించాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో పిటిషనర్ల వ్యవసాయ కార్యకలాపాలకు వీలుంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎ.రాజశేఖరరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్డీఏ కింద చేస్తున్న భూ సమీకరణ నుంచి తమ భూములను మినహాయించేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గుంటూరు జిల్లాకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. శుక్రవారం ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేస్తూ విచారణను వాయిదా వేశారు. -
ఇవ్వని భూములను భూసేకరణ ద్వారా తీసుకుంటాం..
‘రాజధాని భూసమీకరణ’పై హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్) కింద ఇవ్వనిపక్షంలో ఆ భూములను భూసేకరణ(ల్యాండ్ అక్విజిషన్) ద్వారా తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం గురువా రం హైకోర్టుకు నివేదించింది. ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) చట్టం కింద చేస్తున్న భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్)పై పిటిషనర్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని, వాటిపై రెండు వారాల్లో తగిన నిర్ణయం వెలువరిస్తామని కూడా తెలిపింది. ఇదే సమయంలో పిటిషనర్ల వ్యవసాయ కార్యకలాపాల్లో చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకోబోమని వివరించింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ మేరకు కోర్టుకు నివేదించారు. ఈ నివేదనను రికార్డ్ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణకు ఈ కేసుకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సీఆర్డీఏ చట్టం కింద చేస్తున్న భూసమీకరణ నుంచి తమ భూములను మినహాయించేలా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ గుంటూరు జిల్లాకు చెం దిన దాదాపు 200 మంది రైతులు హైకోర్టులో వేర్వేరుగా నాలుగు పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. వీటిని జస్టిస్ రాజశేఖరరెడ్డి గురువారం విచారించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ప్రభుత్వం చేపట్టిన భూసమీకరణపై తమకు అభ్యంతరాలున్నాయన్నారు. వాస్తవాలు చెప్పకుండా అధికారులు పిటిషనర్ల నుంచి భూసమీకరణకు అభ్యంతరం లేదంటూ సంతకాలు తీసుకున్నారని, పిటిషనర్లకు ఇప్పుడు వాస్తవాలు తెలిశాయన్నారు. వ్యవసాయ కార్యకలాపాలను అధికారులు అడ్డుకుంటున్నారని తెలిపారు. దీంతో రాష్ట్రప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునే పనిలోనే అధికారులు ఉన్నారని, అభ్యంతరాలపై రెండు వారాల్లో తగిన ఉత్తర్వులిస్తామని తెలిపారు. -
తిరిగొచ్చిన సంక్రాంతి
రాజధాని గ్రామాల్లో పండుగ వాతావరణం సాక్షి ప్రతినిధి, గుంటూరు: బలవంతపు భూ సమీకరణ తగదని హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజధాని ప్రాంత రైతు కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. నాలుగు నెలలుగా అధికారులు, టీడీపీ పాలకులు గ్రామాల్లో నెరపిన భూదందాకు గురువారం హైకోర్టు పుల్‌స్టాఫ్ పెట్టడంతో రాజధాని రైతులకు సంక్రాంతి తిరిగి వచ్చినట్టయింది. సంతోషంతో మిఠాయిలు పంచుకున్నారు. సంబరాలు చేసుకున్నారు. రాజధాని నిర్మాణం పేరిట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాగించిన భూ దందాను గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించేందుకు అన్ని వర్గాలు ప్రయత్నించాయి. చివరకు హక్కుల ఉల్లంఘనకు ప్రభుత్వం తెగబడటంతో రైతులు కంటిమీద కునుకులేకుండా కాలం గడిపారు. ఈ పరిస్థితుల్లోనే వ్యవసాయం మినహా మరొకటి తెలియని రైతుల భవిష్యత్ అగమ్యగోచరం కావడంతో వైఎస్సార్ సీపీ వారి పక్షాన నిలిచింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారు. అంతకు ముందు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) రైతుల పక్షాన పోరాటం ప్రారంభించారు. ఇక్కడి పరిస్థితులను పార్టీకి వివరించడంతో 42 మంది శాసన సభ్యులు, సీనియర్లు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతుల పక్షాన పోరాటం చేస్తామని వారిలో మనోధైర్యం నింపారు. రైతుల బాధలు, వ్యవసాయ కార్మికులు, కౌలుదారుల స్థితిగతులపై అసెంబ్లీలో చర్చించేందుకు వైఎస్సార్సీపీ చేసిన ప్రయత్నాలను ప్రభుత్వం నిలువరించినా, హైకోర్టు ఆదేశంతో టీడీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది వేడుకలు నిర్వహించిన అనంతరవరం గ్రామ రైతులు సైతం ఇప్పుడు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు సుముఖంగా లేరు. దాంతో కింకర్తవ్యంపై ప్రభుత్వం ఆలోచనలో పడింది. మూడు పంటలు పండుతున్న జరీబు భూములను వదిలి, మెట్టభూముల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలా? న్యాయపోరాటం చేయాలా? అనే అంశాలపై ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. దాదాపు 30 వేల ఎకరాలను ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సమీకరించింది. ఇందులో సాలీనా మూడు పంటలు పండిస్తున్న జరీబు భూములు 10 వేల ఎకరాల వరకు ఉన్నాయి. ఇదీ నేపథ్యం... రాజధాని నిర్మాణానికి రైతుల అంగీకారం లేకుండా భూములు సమీకరిస్తున్నారనీ, సారవంతమైన భూములను మినహాయించాలని కోరుతూ నిడమర్రు గ్రామానికి చెందిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాక, ఆది నుంచి భూ సమీ కరణను వ్యతిరేకిస్తూ అనేక ఆందోళనలు చేశారు. భూ సేకరణ చట్టంలో మార్పులు తీసుకురావద్దని ఢిల్లీలో దీక్ష చేసిన సామాజిక ఉద్యమ కార్యకర్త అన్నా హజారేను కలిశారు. ఇక్కడి పరిస్థితులను వివరించారు. ఈ సమయంలోనే సమీకరణకు సహకరించకపోతే భూ సేకరణ చట్టాన్ని అమలులోకి తీసుకువస్తామని రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు ఇతర మంత్రులు రైతులను తీవ్రస్థాయిలో బెదిరించారు. దీంతో భయపడిన రైతులు అంగీకారపత్రాలు ఇచ్చారు. అనంతరం భయంతోనే భూములు ఇచ్చామంటూ తమ అంగీకారపత్రాలు తిరిగి ఇవ్వాలంటూ కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే గురువారం హైకోర్టు భూసమీకరణకు ఇష్టం లేని రైతులను మినహాయించాలని, అదేవిధంగా భయంతో అంగీకారపత్రాలు ఇచ్చిన వారికి తిరిగి ఇవ్వాలనీ, దీనిపై 15 రోజులలో నివేదిక అంద జేయాలని సీఆర్డీఏ కమిషనర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫలించిన వైఎస్సార్ సీపీ ఉద్యమం .. భూ సమీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన ఉద్యమం ఫలించింది. ఎమ్మెల్యే ఆర్కే భూసమీకరణ ప్రక్రియ ప్రారంభం నుంచి చివర వరకు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, అనుసరిస్తున్న విధానాలు సక్రమంగా లేవంటూనే 9.2 అభ్యంతర పత్రాలపై రైతులకు అవగాహన కలిగించారు. దీంతో జరీబు గ్రామాల్లోని ఎక్కువ మంది రైతులు అభ్యంతర పత్రాలు ఇచ్చారు. దీని ప్రకారం రైతుల నుంచి భూములు తీసుకునే అధికారాన్ని ప్రభుత్వం కోల్పోతుంది. అంగీకారం తెలుపుతూ 9.3 పత్రాలు ఇచ్చిన రైతులు కూడా ఇప్పుడు తిరిగి తమ భూములు తీసుకునే ఆలోచన చేస్తున్నారు. పవన్‌కల్యాణ్‌కు తొలగిన మబ్బులు .... రాజధాని రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తానని ఇక్కడి పర్యటన సమయంలో ప్రకటించిన సినీ నటుడు పవన్‌కల్యాణ్, ఆ మర్నాడే అందుకు భిన్నంగా హైదరాబాద్‌లో ప్రకటించారు. అంతేకాకుండా రాజధాని రైతుల సమస్యలపై ఆ తరువాత ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో ఆయనపై పెట్టుకున్న ఆశలు సన్నగిల్లాయి. ఆర్కే అండతో కోర్టుకు వెళ్లాం... నిడమర్రు గ్రామంలో ఎకరా పొలం వుంది. భూసమీకరణ గడువు ముగింపు సమయంలో ప్రభుత్వం లాక్కుంటుందని భయపడి అంగీకారపత్రం ఇచ్చాం. మళ్లీ ఎమ్మెల్యే ఆర్కే ధైర్యం చెప్పడంతో కోర్టుకెళ్లాం. - భీమిరెడ్డి సీతామహాలక్ష్మి, రైతు. ఆర్కే వల్లే మా భూములు నిలిచాయి... తొలి నుంచి భూసమీకణను వ్యతిరేకించేందుకు కారణం రాజధాని ఇష్టం లేక కాదు. ఏడాదికి మూడు పంటలు పండే మా భూములను మాత్రమే మినహాయించాలని కోరాం. అయినా ప్రభుత్వం మొండితనంగా భూములు తీసుకునేందుకు ప్రయత్నించడంపై కోర్టుకు వెళ్లాం. ఎమ్మెల్యే ఆర్కే రైతుల్లో మనోధైర్యం నింపడంతో పాటు పోరాటం చేయడం ద్వారానే ఈ రోజు భూములను నిలబెట్టుకోగలిగాం. - తమ్మిన వీరాంజనేయులు, రైతు -
సంతకాలు ముగిశాక ఇక సమరమే
సందర్భం రాజధాని నిర్మాణం ప్రకటించినది మొదలు ఆయన సింగపూర్ పర్యటనలు చేస్తుంటే ఇక్కడ ప్రజలు కంటి మీద కునుకు లేకుండా అభద్రతతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కోసం భూసమీకరణ పూర్త యింది. ఇక రైతులూ, కూలీలు చేయవలసిన రణం మిగిలి ఉంది. మెతుక్కీ, బతుక్కీ భరో సా ఇచ్చిన జరీబు భూముల ను కోల్పోయిన రైతాంగం ‘అభివృద్ధి’ విధ్వంసాల మధ్య నష్టపరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయబోతున్నారు. చంద్రబాబు రంగుల ప్రపంచాన్ని కలలుకంటూ ఊహా లోకాలలో తేలుతూ సింగపూర్ తరహా రాజధానిని నిర్మిస్తే ఆ నూతన రాజధాని కూడళ్లలో రైతులు, కూలీల స్థానమెక్కడ? భవిష్యత్తు ఊహించడానికే భయానకంగా ఉంది. భయపడ్డారో, భద్రత లేదనుకున్నారో, మోసపో యారో గానీ కొంతమంది రైతులు భూములు ఇచ్చేశా రు. ‘మేము పూర్తి అవ గాహన/ ఆమోదంతో భూసేకరణ పథకంలో భాగస్వాములం కావడానికి అంగీకారం తెలి యజేస్తున్నాం. కావున ప్రస్తుత భూసేకరణ చట్టం- 2013 (పునరావాస, పునర్నిర్మాణ చట్టం) ప్రకారం ఎలాంటి నగదు పరిహారం లేదా ఇతర ప్రయోజనాలు, రాయితీలు పొందేందుకు మేం అర్హులం కాము, హక్కు లేదని ఇందుమూలంగా స్పష్టపరుస్తున్నాం’ అని 9.3 ఫారం మీద రైతులు సంతకాలు చేశారు. వేలిముద్ర లెన్నో, సంతకాలెన్నో తెలియదుకానీ, ప్రభుత్వం భయ పెట్టి ఈ ప్రక్రియను ఎట్టకేలకు ముగించింది. ఇంత జరి గినా ప్రభుత్వం ఈ భూములను ప్రజలే స్వచ్ఛందంగా ఇచ్చారని చెబుతోంది. కొత్త రాజధాని ఏర్పాటు కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ మాటతో సహా, చంద్రబాబు ఎవరి అభిప్రాయాలనూ పరిగణన లోనికి తీసుకోలేదు. విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని ఉంటుందని చెబుతూనే తుళ్లూరు, మంగళ గిరి, తాడేపల్లి మండల ప్రాంతాలను ఎంపిక చేయడం లో ఒక దుర్మార్గం ఉంది. అరెకరం, ఒకటి రెండు ఎక రాలు ఉన్న రైతులు, కూలీలు, దళితులు 90 శాతం ఉన్న ప్రాంతం ఇదే. భూస్వాములు, ధనికులు తక్కువగా ఉన్న ప్రాంతమిది. దాదాపు 20 వేల కుటుంబాలకు భూమి లేదు. కాబట్టి ఈ ప్రాంత వాసులను బెదిరించి తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిం చుకుని లక్షల కోట్లు దండుకోవాలనే దృష్టితో ఈ ప్రాం తాన్ని రాజధాని ప్రాంతంగా ఎంపిక చేశారనేది స్పష్టం. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇక్కడి భూములను కొని సింగపూర్ తరహా రాజధానిని నిర్మించడం భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. ప్రత్యేక ప్రతిపత్తి తదితర హామీలు నీటి మీద రాతలవుతున్నాయి. అందువల్ల చంద్రబాబు నాయుడు కానీ ఖర్చు లేకుండా 30 నుంచి 50 వేల ఎకరాల దాకా ప్రజలనుంచి నయానో భయానో సేకరించాలని ల్యాండ్ పూలింగ్ పద్ధతిని తీసుకువచ్చారు. దీనికి ఎలాంటి చట్ట బద్ధతా లేదు. అయినా మంత్రులు గ్రామాల్లో తిష్టవే శారు. ఫిబ్రవరి 28 లోపు ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు సమీకరిస్తాం లేకపోతే సేకరణకు వెళ్లి భూము లు తీసుకుంటాం అని హెచ్చరికలు చేయడంతో రెండు రోజుల్లోనే రైతులు కొంత మంది భయపడి భూములు ఇచ్చి వేశారని చెబుతున్నారు. ఇది స్వచ్ఛందంగా ఇచ్చిం ది కానే కాదు. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి రైతులు భూములిస్తే ప్రభుత్వం అభివృద్ధి చేసి పట్టా భూమికి 1200 చ.గ.లు, అసైన్డుభూమికి 900 చ.గ.లు ఇస్తామని ప్రకటించింది. సంవత్సరానికి 30 వేలు ఇస్తానంది. వ్యవసాయ కూలీలకు నెలకు 2,500 రూపా యలు ఇస్తామని ప్రకటించింది. సంవత్సరానికి 30 వేలు కౌలు ఇస్తానంది. వ్యవసాయ కూలీలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. రాజధాని నిర్మా ణం చేస్తామన్న 29 గ్రామాలలో 52 వేల ఎకరాల భూమి ని లాండ్ పూలింగ్ పద్ధతిలో సేకరించడానికి ప్రభుత్వం పూనుకుంది. అక్కడ పంట పొలాల్లో రైతులూ, కూలీలూ జీవిస్తున్నారు. ఈ మూడు మండలాల్లోనే 11,687 రైతు కుటుంబాలు, 51,573 మంది రైతు కూలీలు జీవిస్తు న్నారు. మూడు మండలాల పరిధిలో 74 వేల మంది దళి తులు, 12 వేల మంది ఎస్టీలు ప్రధానంగా వ్యవసా యం మీద ఆధారపడి జీవిస్తున్నారు. కూలీల్లో అత్య ధికం దళితులూ, బీసీలూ, ఇతర పేదలూ ఉన్నారు. వారి మాటల్లోనే చెప్పాలంటే 20 సెంట్లున్న రైతు సాఫ్ట్ వేర్ ఉద్యోగి సంపాదించినంత సంపాదిస్తున్నాడని ఈ భూములు పోతే మాకు దిక్కేమిటని గ్రామాల్ని సంద ర్శించిన వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఆవేదనతో మాట్లాడుతున్నారు. భార్యాభర్తలిద్దరూ రోజూ కూలీకి వెళితే నెలకు 20 వేలు సంపాదిస్తామని, ప్రభుత్వం ఇచ్చే 2,500 రూపాయలు ఏ మూలకు సరిపోతాయని బాధ పడుతున్నారు. రాజధాని నిర్మాణం ప్రకటించినది మొదలు ఆయన సింగపూర్ పర్యటనలు చేస్తుంటే ఇక్కడ ప్రజలు కంటి మీద కునుకు లేకుండా అభద్రతతో ఉన్నారు. పం టపొలాలు ఇవ్వబోమని, జరీబు భూములు ఇవ్వబో మని తేల్చి చెబితే పంట పొలాలు తగులబడతాయి. పోలీసులు రంగప్రవేశం చేస్తారు. ఈ ప్రాంతమంతా యుద్ధ వాతావరణం అలుముకుంటుంది. అదిరింపులు, బెదిరింపులు నిత్యకృత్యం అవుతాయి. పూలింగ్ అయితే మీకు లాభం, సేకరణ అయితే నష్టం అని మీరు ఇవ్వక పోయినా భూములు లాక్కొంటాం అని బెదిరింపులతో రైతుల్ని భయాందోళనలకు గురి చేశారు. విదేశీ పెట్టుబడుల కోసం అర్రులు చాస్తూ, సింగ పూర్, జపాన్ లాంటి రాజధాని కోసం ఆకాశానికి నిచ్చె నలు వేస్తున్న చంద్రబాబు వైఖరిని ప్రజలు పెద్ద ఎత్తున తిరస్కరించాలి. కార్పొరేట్ సంస్థల దోపిడీకి, తెలుగు దేశం పెద్దలు చేయబోయే రియల్ ఎస్టేట్ వ్యాపార దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలి. ఆత్మ విశ్వాసంతో పోరాడుతున్న రాజధాని ప్రాంత రైతులకు, కూలీలకు అంతా అండగా నిలబడాలి. (వ్యాసకర్త సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ర్ట నాయకులు మొబైల్: 9989737776) చిట్టిపాటి వెంకటేశ్వర్లు -
రిక్తహస్తం బడ్జెట్ 2015
రాజధాని ఊసేలేని కేంద్ర బడ్జెట్ భూసమీకరణకూ నిధులు నిల్ మెట్రో రైలు, పోలవరం మొక్కుబడి కేటాయింపులతో సరి విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన విజయవాడకు కేంద్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపించింది. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ ప్రాంతానికి భారీగా నిధులు కేటాయిస్తారని రాజధాని ప్రాంతవాసులంతా ఆశించారు. గతంలో ప్రధాని నరేంద్రమోదీ తిరుపతి, విశాఖపట్నం ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచస్థాయి నగరం నిర్మించి ఇస్తామని చెప్పారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో దానికి మిత్రపక్షమైన తెలుగుదేశం అధికారంలోకి రావడం, ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తానంటూ చంద్రబాబు ఊదరగొడుతుండటంతో ఈసారి కేంద్ర బడ్జెట్లో రాజధానికి కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తారని అందరూ భావించారు. అందుకు భిన్నంగా బడ్జెట్లో నూతన రాజధాని ఊసే ఎత్తకపోవడం విస్మయం కలిగిస్తోంది. భూసమీకరణకు నిధులేవీ? తుళ్లూరు ప్రాంత రైతుల నుంచి భూసమీకరణకు ప్రభుత్వం సిద్ధమై ఇప్పటికే రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకుంది. ఆయా రైతులకు రెండుమూడు రోజుల్లో డబ్బులు ఇస్తామంటూ రాష్ట్ర మంత్రులు ఊదరగొడుతున్నారు. భూ సమీకరణకు సహకరించని రైతులపై భూసేకరణ ఆయుధాన్ని ప్రయోగిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో చెబుతున్న సీఎం చంద్రబాబు భూసమీకరణకు కావాల్సిన నిధులన్నీ కేంద్రమే ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇతర మంత్రులూ అదే ఆశతో ఉన్నారు. బడ్జెట్లో ఏమాత్రం నిధులు కేటాయించకపోవడంతో భూసమీకరణకు కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సమీకరించాల్సి వస్తుందని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం భూసమీకరణకు కావాల్సిన వేల కోట్లు ఎలా సమీకరించుకుంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక భూసేకరణ చట్టంలో మార్పులు చేర్పులు చేస్తూ ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆర్డినెన్స్ తేవాలని ఏన్డీఏ ప్రభుత్వం భావించింది. ఆర్డినెన్స్ తెస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కొంత ఊరట లభించేది. ఎన్డీఏలోనే కొన్ని భాగస్వామ్య పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తుండటంతో ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్ వచ్చే అవకాశం లేదని, ప్రస్తుత చట్టంతో రాష్ట్ర ప్రభుత్వానికి భూసేకరణ సాధ్యం కాద ని రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో నూతన రాజ ధాని నిర్మా ణం శరవేగంతో జరుగుతుందనుకోవడం పొరపాటేనని పరి శీలకులు చెబుతున్నారు. మరోపక్క రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన, నూతన భవనాల నిర్మాణాలకు కావాల్సిన భారీ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మెట్రో రైలుకు రూ.5.63 కోట్లు : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంలో నిర్మించతలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుకు బడ్జెట్లో కేవలం రూ.5.63 కోట్లు కేటాయించారు. ఈ నిధులు ఏమాత్రం సరిపోవని పలువురు అభిప్రాయపడుతున్నారు. మెట్రోరైలు ప్రాజెక్టుకు పనిచేసే సిబ్బంది జీతాలు, డీపీఆర్ నివేదికలు తయారు చేయడానికే ఈ నిధులు సరిపోతాయని, అందువల్ల పనులు నత్తనడకన సాగే అవకాశముందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని మెట్రో వర్గాలు అంచనా. పోలవరానికి రూ.100 కోట్లు : రాష్ట్రానికి ఎంతో కీలకమైన ప్రాజెక్టుగా భావిస్తున్న పోలవరానికీ అరకొర నిధులే కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు కేటాయించిన రూ.100 కోట్లు కాల్వల అభివృద్ధికే సరిపోతాయనే ఇంజనీర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే తరహాలో నిధులు కేటాయిస్తే రాబోయే పదేళ్లలో కూడా ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. నిట్‌కు రూ.40 కోట్లు... రాజధాని జోన్ ప్రాంతంలోని ఆగిరిపల్లిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని గతంలో కేంద్రం ప్రకటించింది. దీనికి బడ్జెట్లో రూ.40 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తిగా కేంద్రం ఆధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో ఇచ్చి రాష్ట్రం చేపట్టే ప్రాజెక్టులకు నిధులు తగ్గించడం గమనార్హం. సామాన్యుడి నడ్డి విరుస్తున్న బడ్జెట్ ! బడ్జెట్లో కేబుల్, డిష్‌ల చార్జీలను పెంచుతున్నారు. వీటితో పాటు అనేక చానల్స్ రావడానికి వాడే సెటప్బాక్స్లపై పన్నులు విధించనున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులపై చార్జీల బాదుడు పడనుంది. బొగ్గు మీద సెస్ 100 నుంచి 200 శాతంపెంచుతున్నారు. సిమెంట్‌పై పన్నుల భారం మోపడంతో రాబోయే రోజుల్లో నిర్మాణాలు భారమౌతాయి. సిగరెట్, మద్యం, గుట్కా ధరలు ప్రతి బడ్జెట్ మాదిరిగానే యథావిధిగా పెంచారు. టెలికాం సర్వీసులు, రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్, ప్లాస్టిక్ బ్యాగులపై పన్నుల భారం మోపుతున్నారు. సెల్ఫోన్లు, ఫ్రిజ్‌లు, కంప్యూటర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, ఎల్ఈడీ బల్బులు, సోలార్ వాటర్ హీటర్లు వంటి వాటిపై పన్నుల భారం తగ్గించినా.. దీనివల్ల సామాన్య ప్రజలకు పెద్దగా ఉపయోగం ఉండదంటున్నారు. -
ఆఖరి రోజు
నేటితో ముగుస్తున్న భూసమీకరణ గడువు తాడికొండ : రాజధాని నిర్మాణ గ్రామాల్లో భూ సమీకరణ గడువు శనివారంతో ముగియనుంది. ఈ ప్రక్రియను జనవరి 1వ తేదీన ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పటివరకు 26,281 ఎకరాలను మాత్రమే సమీకరించగలిగింది. మెట్ట భూముల రైతులు సుముఖంగా ఉన్నప్పటికీ, ఏటిపట్టు గ్రామాల్లోని జరీబు రైతులు సమీకరణను వ్యతిరేకిస్తూ వచ్చారు. సారవంతమైన తమ భూములు ఇచ్చేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవడం లేదు. దీంతో ఆదిలో ఉన్న భూ సమీకరణ వేగం క్రమంగా తగ్గుతూ వచ్చింది. సమీకరణకు ఈ నెల 28వ తేదీ చివరి రోజు అని ఎట్టిపరిస్థితుల్లోనూ గడువు పెంచబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. గురువారం రాజధాని ప్రాంత రైతులతో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో పరిహారం పెంచడంతో మరికొంత మంది ముందుకు వచ్చి భూములు ఇవ్వవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇదిలావుండగా, ఏటిపట్టు గ్రామాల్లో ఇప్పటివరకు జరిగిన భూ సమీకరణ ఇలా ఉంది. బోరుపాలెంలో 95 శాతం, అబ్బరాజుపాలెంలో 82 , రాయపూడిలో 80, లింగాయపాలెంలో 73, ఉద్దండ్రాయునిపాలెంలో 80 శాతం భూములను సమీకరించినట్టు అధికారులు చెబుతున్నారు. అలాగే వెంకటపాలెంలో 70 శాతం భూములను ఇచ్చారంటున్నారు. మిగతా మెట్ట భూములు దాదాపు నూరుశాతానికి చేరినట్లు పేర్కొంటున్నారు. జరీబు భూములు ఇచ్చేందుకు గడువు పెంచాల్సి ఉంటుందని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు ఇవ్వకూడదనుకున్న రైతులు ఇప్పటికిప్పుడు ఇవ్వాలనుకుంటే కుటుంబీకులతో చర్చించాలి. కొందరు దూరప్రాంతాల్లో ఉండి ఉంటారు. వారిని కలసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో గడువు పెంచాల్సి వస్తుందని అంటున్నారు. -
మే 15 కల్లా రాజధాని మాస్టర్‌ప్లాన్!
హైదరాబాద్: రాజధాని మాస్టర్‌ప్లాన్ డిజైన్ వ్యవహారాలపై రాష్ట్రప్రభుత్వం వేగం పెంచింది. ఈ క్రమంలో మే 15 కల్లా రాజధాని మాస్టర్‌ప్లాన్ డిజైన్‌ను ఇస్తామని సింగపూర్ కన్సల్టెన్సీ చెప్పినట్టు తెలిసింది. ఈలోగా భూసమీకరణ ప్రక్రియను పూర్తిచేసి, జూన్ మొదటివారంలో రాజధాని నిర్మాణాలకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకూ 23వేల ఎకరాల భూసమీకరణ చేసిన ప్రభుత్వం.. మిగతా ఏడువేల ఎకరాలను సైతం సమీకరించడంపై దృష్టిపెట్టింది. రాజ ధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) పరిధిలో తొలిదశలో 180 కి.మీ. ఔటర్ రింగ్‌రోడ్డు పనులు చేపట్టాలని ప్రభుత్వం భావి స్తోంది. నివాసయోగ్యంగా రాజధాని ఉండేలా రాజధాని మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధాని ప్రాంతవాసులకు తాగునీటి అవసరాలు.. హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలపై ఇరురాష్ట్రాలు త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. రాష్ట్రానికి తొలిదశలో 4 స్మార్ట్ సిటీలకు కేంద్రం అంగీకరించినట్టు అధికారవర్గాలు చెప్పాయి. వీటికోసం విశాఖ, విజయవాడ-గుంటూరు, నెల్లూరు-కృష్ణపట్నం, తిరుపతి నగరాలను ప్రతిపాదించారు. -
సీఆర్డీఏ చట్టం పేదల కడుపుకొట్టేందుకే
విరుచుకుపడిన వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం సీఆర్డీఏ కమిషనర్‌కు వినతిపత్రం విజయవాడ బ్యూరో : రాజధాని కోసం చేపట్టిన భూసమీకరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోందని వైఎస్సార్ సీపీ శాసనసభా పక్షం ఆరోపించింది. సోమవారం రాజధాని రైతులు, పేదల సమస్యలపై సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్‌కు ఇచ్చిన వినతిపత్రంలో అనేక అంశాలను ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పేర్కొన్నారు. సీఆర్డీఏ చట్టం పేదవాడి పొట్టగొట్టేందుకే అన్నట్లు ఉందని, భూసమీకరణ పేరుతో రైతులను దగా చేస్తున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి ప్రైవేటు భూములు తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా ప్రభుత్వం తుళ్లూరు ప్రాంత రైతులను వేధిస్తోందని ఆరోపించారు. సీఆర్డీఏ చట్టంలో ఏముందనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియకుండా చేసిందని తెలిపారు. మాయమాటలు చెప్పి, రెవెన్యూ అధికారులతో బెదిరించి, పోలీసులతో ఒత్తిడి తెచ్చి పార్టీలు, కులాల వారీగా ప్రజలను విడదీసి, గూండాలతో దాడులు చేయించి ప్రభుత్వం భూసమీకరణకు రైతులను ఒప్పించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. సీఆర్డీఏ చట్టం ద్వారా రాజధాని ప్రాంతంలో ఎమర్జెన్సీ తరహా పాలన చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యతగల ప్రతిపక్షంగా వైఎస్సార్ సీపీ రాజధాని రైతు పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి అక్కడి రైతులకు అండగా నిలిచిందని తెలిపారు. మూడు, నాలుగు పంటలు పండే ప్రాంతంలో రైతులు భూములు తీసుకోవడానికి వీల్లేదని డిమాండ్ చేసింది. అనుమతి పత్రాలు ఇచ్చిన అమాయక రైతులందరికీ వారు వాటిని వెనక్కు తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం అగ్ర నాయకులెవరూ భూములు ఇవ్వకపోవడం, సీఆర్డీఏ పరిధి బయట ఆ పార్టీ పెద్దలు భారీ ఎత్తున వేల ఎకరాలు కొనుగోలు చేయడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. మొత్తం రాజధాని భూముల వ్యవహారంపై న్యాయ విచారణ జరగాలన్నారు. రాజధాని నిర్మాణానికి తాము అడ్డుపడడంలేదని, అమాయక రైతుల భూములను అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదించాలనుకోవడం దారుణమన్నారు. రైతులు, కూలీలు, భూమి లేని నిరుపేదలు, సంప్రదాయ వృత్తులవారు, పల్లెల్లో నివసించే ప్రతి ఒక్కరి హక్కులు కాపాడేందుకు తాము పోరాడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం వివిధ జిల్లాలకు చెందిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతోపాటు కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్, మేకా ప్రతాప్ అప్పారావు, రక్షణనిధి, పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. భారీ బందోబస్తు వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయానికి వస్తుందనే సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. వందల మంది పోలీసులు లెనిన్ సెంటర్లో మోహరించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ పోలీసుల బందోబస్తు వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
జాతీయస్థాయికి ‘రాజధాని’ అన్యాయం
మంగళగిరి: రాజధాని కోసం బలవంతపు భూసమీకరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు కలసివచ్చే రాజకీయపక్షాల, ప్రజాసంఘాలు, రాజధాని ప్రాంతరైతులతో కలిసి ఐక్యకార్యాచరణ వేదికను ఏర్పాటు చేయాలని రాజధాని రైతు, రైతుకూలీల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఐక్య చర్చావేదిక తీర్మానించింది. ఇప్పటి వరకు జరిగిన భూసమీకరణపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరింది. భూసేకరణ చట్టాన్ని మార్చడంపై ప్రముఖ సామాజికవేత్త అన్నాహజారే చేపట్టిన దీక్షకు మద్దతు తెలపాలని నిర్ణయించింది. ఒక బృందం ఢిల్లీ వెళ్లి హజారే దీక్షకు మద్దతు తెలపడంతో పాటు రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాన్ని వివిధ రాజకీయపక్షాల నాయకులు, ముఖ్యనేతలకు వివరించాలని తీర్మానించింది. సమితి ఆధ్వర్యంలో స్థానిక చిల్లపల్లి నాగేశ్వరావు కల్యాణమండపంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీల నేతలతో పాటు, ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాలు, మహిళా సంఘాలు , రైతులు భారీగా పాల్గొన్నారు. నష్టాలపై అవగాహన కల్పిద్దాం తొలుత వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ భూసమీకరణ వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తే 29 గ్రామాల్లో అంగీకార పత్రాలు ఇచ్చిన రైతుల్లో సగం మందికిపైగా వెనక్కి తీసుకునే అవకాశముందని చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా పోరాడదామని చెప్పారని తెలిపారు. మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ సీఆర్డీఏ పేరుతో భూములను తీసుకుని వాటితో వ్యాపారం చేసి రాజధాని నిర్మిస్తావా, నిధులు లేనిది ఎలా నిర్మాణం సాగిస్తావు.. సీఎంగా అనుభవం ఉన్న వ్యక్తికి తెలియదా.. అని చంద్రబాబును ప్రశ్నించారు. గ్రామాలవారీ కమిటీలు అవసరం వైఎస్సార్ సీపీ రైతు విభాగం కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి మాట్లాడుతూ భూసమీకరణ వల్ల కలిగే నష్టాలను వివరించేందుకు గ్రామాల వారీగా కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. మాజీ మత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ భూములు లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.కృష్ణాడెల్టా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ ఉద్యమాన్ని జాతీయస్థాయికి వెళ్లేలా కార్యాచరణను రూపొందించాలని కోరారు. అంగీకార పత్రాలు ఇస్తే ఆత్మహత్యలే.. న్యాయవాది మల్లెల శేషగిగరిరావు మాట్లాడుతూ అంగీకారపత్రంతో ప్రభుత్వం ఇచ్చే రశీదుకు విలువ లేదన్నారు. అఖిల భారత రైతుసంఘం నాయకుడు కుమారస్వామి, రైతు నేతలు అనుమోలు గాంధీ, ఎంపీపీ పచ్చల రత్నకమారి, జనచైతన్యవేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భూములివ్వనివారే కోటీశ్వరులు !
రాజధానికి భూములు ఇవ్వనివారు సాగు చేసుకునేందుకు అనుమతి ఇచ్చినవారు పంటలు వేసుకునేందుకు నిరాకరణ ఇప్పటికే కోటీశ్వరులుగా భూములివ్వని తాడేపల్లి, మంగళగిరి రైతులు ఇచ్చినవారికి ప్రభుత్వం ఇచ్చే ఎకరానికి వెయ్యి గజాల స్థలమే దిక్కు వెయ్యి గజాల స్థలానికి ఎన్నేళ్లకు మంచి ధర వస్తుందనే అనుమానాలు పునరాలోచనలో భూములు ఇచ్చిన తుళ్లూరు రైతాంగం అంగీకార పత్రాలు వెనక్కి తీసుకునే అవకాశాలపై సంప్రదింపులు గుంటూరు : రాజధాని గ్రామాల్లో భూ సమీకరణకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించడంతో రైతులు తర్జనభర్జన పడుతున్నారు. మొదటి నుంచీ భూ సమీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు నడిపిన మంగళగిరి, తాడేపల్లి రైతులకు సానుకూలంగా, భూములు ఇచ్చిన తుళ్లూరు రైతులకు ప్రతికూలంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భూములు ఇచ్చేందుకు అంగీకార పత్రాలు ఇచ్చిన తుళ్లూరు రైతుల పొలాల్లో ప్రభుత్వం సాగును నిషేధించింది. దీంతో రబీలో పంటల సాగుకు వీల్లేకుండా పోయింది. అభ్యంతర పత్రాలు ఇచ్చిన తాడేపల్లి, మంగళగిరి రైతులకు మాత్రం అనుమతి లభించడంతో వారు ముమ్మరంగా రబీ పనులు చేసుకుంటున్నారు. భూ సమీకరణకు చట్టబద్ధత లేకపోవడంతో రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకోలేకపోతోంది. నిధుల కొరత కారణంగా భూ సేకరణకు ముందుకు వెళ్లలేకపోతోంది. దీంతో తాడేపల్లి, మంగళగిరి రైతుల పొలాలు వారి వద్దనే ఉన్నాయి. పైగా తమ అభ్యంతర పత్రాల ఉద్యమానికి రాజకీయ పార్టీలు కూడా దన్నుగా నిలుస్తుండటంతో ఈ మండలాల రైతులు నిశ్చింతగా ఉన్నారు. మరోవైపు భూములిచ్చిన తుళ్లూరు రైతులకు మాత్రం ప్రభుత్వం ఇచ్చే కొద్ది గజాల స్థలమే మిగలనుంది. ఈ పరిస్థితుల్లోనే ఇప్పటివరకు సమీకరించిన భూమిని ఇతర పరిశ్రమలకు లీజుకు ఇచ్చేందుకు, అమ్మేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి, మంత్రులు ఇచ్చిన హామీలు నెరవేరే సూచనలు కనిపించకపోవడం, రాజధాని నిర్మాణం ప్రారంభం కాకుండానే ప్రభుత్వం తమ భూముల అమ్మకాలు, లీజులు ప్రారంభిస్తుందేమోనన్న ఆందోళనతో.. భూములిచ్చిన రైతులు పునరాలోచనలో పడ్డారు. ఇచ్చిన అంగీకారపత్రాలను ఉపసంహరించుకునే అవకాశాల కోసం న్యాయవాదులను సంప్రదిస్తున్నారు. ఆశించిన స్థాయిలో సాగని సమీకరణ భూ సమీకరణకు తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు మండలాల్లో గ్రామాల వారీగా వివిధ తేదీల్లో ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. నెల రోజుల వ్యవధిని గడువుగా నిర్ణయించారు. జనవరి 2 నుంచి 11 వరకు గ్రామాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా డెప్యూటీ కలెక్టర్లు విధుల్లో చేరకపోవడంతో భూ సమీకరణ లక్ష్యం చేరుకోలేక పోయామంటూ మంత్రి పి.నారాయణ గడువు తేదీని ఫిబ్రవరి 14 వరకు పొడిగించారు. అప్పటివరకు 29 గ్రామాల్లో 21,627 ఎకరాలను సమీకరించారు. అప్పటికి తుళ్లూరు మండలంలో 17,684, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో 3,943 ఎకరాలకు రైతులు అంగీకార పత్రాలు ఇచ్చారు. 31,205 ఎకరాల లక్ష్యానికి ఇంకా 9,578 ఎకరాలను సమీకరించాల్సి ఉంది. రైతుల కోరిక మేరకు భూ సమీకరణ గడువు తేదీని ఈ నెల 28 వరకు పొడిగించినట్టు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. ఈ ప్రకటన తుళ్లూరు మండల రైతుల్లో మరింత కలవరం సృష్టించింది. నెల రోజుల క్రితం అంగీకారపత్రాలు ఇచ్చినా ప్యాకేజీ చెల్లింపుపై ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వారిలో అనుమానాలు పెంచుతోంది. పైగా భూములు ఇచ్చిన తమ పంట భూముల్లో సాగుపై నిషేధం విధించడం, ఇవ్వనివారిని సాగుకు అనుమతించడం వారిలో తీవ్ర ఆగ్రహావేశాలు రగిలిస్తోంది. ప్రభుత్వ వైఖరి ఎంతవరకు సమంజసమని టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారులను రైతులు నిలదీస్తున్నారు. ఇచ్చిన ఎకరా భూమికి ప్రభుత్వం ఇవ్వనున్న 1,000 చదరపు గజాల స్థలానికి ఎన్నేళ్లకు మంచి ధర వస్తుందో, అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఏమీ పాలుపోని స్థితిలో తర్జనభర్జనలు పడుతున్నారు. సందేహం.. సంశయం.. చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తిగా జరిగితే.. ప్రభుత్వం ఇవ్వనున్న 1,000 చదరపు గజాల స్థలానికి(చదరపు గజం రూ.30 వేల చొప్పున) రూ.3 కోట్లు వస్తాయనుకున్నా.., ఇప్పటి పరిస్థితులు అందుకు సానుకూలంగా లేవనే సందేహాలు భూములిచ్చిన రైతాంగంలో వ్యక్తం అవుతున్నాయి. కేంద్రం నుంచి సహకారం పూర్తిగా లేకపోవడంతో రాజధాని నిర్మాణం మూడేళ్లలో పూర్తికాదనే సందేహమూ వారిని వెన్నాడుతోంది. దీంతో ఇచ్చిన అంగీకారపత్రాలు ఉపసంహరించుకునే అవకాశాల కోసం న్యాయవాదులను సంప్రదిస్తున్నారు. మరోవైపు తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని రైతులు మొదటి నుంచి భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉన్నారు. ఉద్యమాన్నీ చేపట్టారు. వీరికి వైఎస్సార్సీపీతోపాటు ఇతర పార్టీలు మద్దతుగా నిలబడటంతో 3,943 ఎకరాలకే భూ సమీకరణ పరిమితమైంది. మిగిలిన రైతులు యధాతథంగా సాగు చేసుకుంటున్నారు. పెరుగుతున్న సందేహాలు చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు రైతుల్లో సందేహాలను పెంచుతున్నాయి. తాత్కాలిక రాజధాని నిర్మాణానికి ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి సమీకరిస్తున్న భూమికి గాను ఎకరాకు ఎకరా ఇస్తూ నిర్ణయం తీసుకుంది. తమకు మాత్రం ఎకరాకు 1,000 చదరపు గజాల స్థలం మాత్రమే ఇవ్వడంపై రైతులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించలేక తాము ఇచ్చిన భూములు విక్రయించే దిశగా చర్యలు తీసుకుంటుందేమోనన్న అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే అంగీకార పత్రాలు వెనక్కి తీసుకునే దిశగా రైతులు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. -
‘తమ్ముళ్ల’ తిరుగుబాటు
తాడికొండ(గుంటూరు): రాజధాని నిర్మాణం కోసం జరుపుతున్న భూ సమీకరణపై ఆ ప్రాంత తెలుగు తమ్ముళ్లు తిరుగుబావుటా ఎగురవేశారు. జరీ భూములకు ఎకరాకు వెయ్యి గజాల నివాస భూమి, 600 గజాల వాణిజ్య స్థలం ఇస్తూ వాటికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ భూములు ఇవ్వబోమని తెల్చి చెప్పారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో మంగళవారం టీడీపీ గ్రామ నేతలు, మద్దతు దారులు ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ జెండాలతో నిరసన తెలిపారు. పరిహారంపై తమకున్న సందేహాలను ఇప్పటి వరకు తీర్చలేదని ఆరోపించారు. అభద్రతా భావాన్ని తొలగించే ప్రయత్నం చేయకుంటే కోర్టుకు వెళతామన్నారు. -
5 రోజులు.. 13వేల ఎకరాలు.. సాధ్యమేనా?
కౌంట్‌డౌన్ నేతలు, అధికారులకు తలనొప్పిగా మారిన భూసమీకరణ {పభుత్వంపై నమ్మకం లేకనే నత్తనడక తాడికొండ: రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం తలపెట్టిన భూసమీకరణ ఇటు టీడీపీ నేతలు, అటు డిప్యూటీ కలెక్టర్ల స్థాయి అధికారులకు తలనొప్పిగా మారింది. సీఎం చంద్రబాబు భూసమీకరణను వేగవంతం చేయాలని సీఆర్డీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఇద్దరు ఐఏఎస్ అధికారులను నియమించారు. మంత్రి పి. నారాయణను రాజధాని ప్రాంతంలోనే ఉండి సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించినప్పటికీ నత్తనడక నడుస్తోంది. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఇప్పటివరకు 17,004 ఎకరాలకు మాత్రమే రైతులు అంగీకార పత్రాలు అందించారు. ఈ నెల 14 తేదీతో భూసమీకరణ తేది గడువు ముగియనుంది. ప్రభుత్వ లక్ష్యం తొలివిడత 30 వేల ఎకరాలు సమీకరించాల్సి ఉంది. మరో ఐదు రోజుల్లో మిగతా 13 వేల ఎకరాలు సమీకరించటం సాధ్యమేనా..? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటివరకు 40 రోజుల్లో రోజుకు సగటున 400 నుంచి 500 ఎకరాలు మాత్రమే సమీకరించారు. ఐదురోజుల్లో 13 వేల ఎకరాలంటే రోజుకు కనీసం 2,600 ఎకరాలు సమీకరించాల్సిఉంది.ఇది ఎంత వరకు సాధ్యమో వేచి చూడాల్సిందే. ప్రభుత్వంపై నమ్మకం లేకనే... భూసమీకరణ నత్తనడకకు ప్రధాన కారణం చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం లేకపోవటమేనని రైతులు అంటున్నారు. ఇప్పటికి గ్రామాల్లో టీడీపీ ప్రజాప్రతినిధులే భూ అంగీకార పత్రాలను సమర్పించ లేదు. అధిక గ్రామాల్లో ఇప్పటివరకు 40 శాతం కూడా సమీకరణ పూర్తి కాలేదు. రాయపూడి, వెంకటపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, ఉండవల్లి, పెనుమాక, మంగళగిరి తదితర గ్రామాల్లో భూసమీకరణకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా గ్రామాల్లో అధికారులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు రైతులను ఒప్పించే భాధ్యత అప్పగించినా ఫలితం శూన్యంగా మారింది. భూ సమీకరణపై స్పస్టమైన విధివిధానాలు, సీఆర్డీఏ కార్యాలయంలో అందుబాటులోలేని భూ వివరాలు, రైతుల సందేహాలు నివృత్తి చేయలేకపోవటం వంటి కారణాలతో సమీకరణ మందగించింది. ప్రధానంగా చంద్రబాబు సీఎంగా రైతు రుణమాఫీలో విఫలంకావడంతో ఆయనను నమ్మలేక రైతులు సమీకరణకు భూములు ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు ఏదిఏమైనా మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, సీఆర్డీఏ అధికారులకు భూ సమీకరణ ఓ సవాల్‌గా మారింది. -
ఆత్మహత్యలే గతి..!
నులకపేట, డోలాస్‌నగర్ వాసుల ఆందోళన భూసమీకరణ నోటిఫికేషన్లో తమ నివాస స్థలాలు ఉన్నాయని ఆవేదన మంగళగిరి ఎమ్మెల్యే ఎదుట కంటతడి పేదల ఇళ్ల జోలికివస్తే ఊరుకోబోమని ఆర్కే హెచ్చరిక తాడేపల్లి (గుంటూరు) : రాజధాని భూ సమీకరణ ప్రక్రియ వారికి నిలువనీడ లేకుండా చేస్తోంది. వారి బతుకులను ప్రశ్నార్థకం మార్చింది. ఎక్కడికి వెళ్లి తలదాచుకోవాలో కూడా తెలియని వారంతా తమకు మూకుమ్మడి ఆత్మహత్యలే గతి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని గ్రామాల్లో రైతులు, కూలీలకు అండగా నిలుస్తున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే)కి తమకు ఎదురైన కష్టాన్ని వివరించి కంటతడి పెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లి రూరల్ మండలం నులకపేట డోలాస్‌నగర్‌లో దాదాపు 1200 గృహాలు ఉన్నాయి. వీటిల్లో రెండువేల కుటుంబాలు ఏళ్ల తరబడి నివసిస్తున్నాయి. రాజధాని భూసమీకరణ పరిధిలో వారి నివాస స్థలాలు ఉండడమే ఆయా కుటుంబాల ఆవేదనకు కారణమైంది. ఉన్నపళంగా ఇల్లు వదిలి వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేని నులకపేటకు ఆహ్వానించి తమ కష్టాన్ని తెలియజేశారు. భూసమీకరణలో తమ నివాస స్థలాలను లాగేసుకుంటే మూకుమ్మడి ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి ఇప్పటివరకు తమ భూములు భూసమీకరణలో ఉన్నట్టు కూడా తెలియదన్నారు. అభ్యంతరాలు తెలిపే ప్రక్రియపై ఏ అధికారీ తమకు అవగాహన కల్పించలేదని వాపోయారు. ఇళ్ల జోలికి వస్తే ఊరుకోం: ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రాజధాని నిర్మాణం కోసం పేదల ఇళ్లజోలికి వస్తే సహించేది లేదని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూలీనాలీ చేసుకుని జీవిస్తున్న డోలాస్‌నగర్, నులకపేట ప్రాంతాల వాసుల ఇళ్ల తొలగింపునకు మూడవ కంటికి తెలియకుండా ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందన్నారు. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన నోటిఫికేషన్లో ఈ సర్వే నంబర్లు కూడా ఉన్నాయన్నారు. ఈ విషయాలను అధికారులు తెలియజేయకుండా ఆఫీసుల్లో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని, నివాస గృహాల జోలికి రానన్న ప్రభుత్వం ఈ సర్వే నంబర్లను ల్యాండ్ పూలింగ్‌లో ఎందుకు కలిపిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుని నివాసప్రాంతాల వారి వద్దకు వెళ్లి అభిప్రాయాలు సేకరిస్తోందన్నారు. రాజధానికి తమ భూమి ఇస్తే, దానికి అనుగుణంగా దరఖాస్తులు ఇవ్వనటువంటి వారి నుంచి 9.2 ఫారాలను పూరించి అధికారులకు అందజేయనున్నట్లు ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మి, వైస్ చైర్మన్ దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడేపల్లి పట్టణ, మండల కన్వీనర్లు భీమిరెడ్డి సాంబిరెడ్డి, పాటిబండ్ల కృష్ణమూర్తి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
పంట నిషేధంపై రైతు మంట
ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో నెమ్మదిగా ఆంక్షల కత్తిని ఝుళిపిస్తోంది. అయోమయంలో ఉన్న రైతన్నలను మరింత కుంగదీస్తోంది. తాజాగా రాజధాని ప్రాంతంలో రెండో పంటసాగు చేయడానికి వీల్లేదని ప్రకటించడం అన్నదాతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే రెండో పంట సాగు కోసం చేసిన ఖర్చు వృథా అవుతుందని వరి, మొక్కజొన్న పంటలు వేసిన రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాడేపల్లి రూరల్ : రైతులను బెదిరించి, వారికి జీవనధారమైన పంట పొలాలను బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తే ప్రజల తరఫున న్యాయపోరాటం చేస్తామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెనుమాకలో బుధవారం రైతులు నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. భూ సమీకరణకు నోటిఫికేషన్ విడుదలై ఇన్ని రోజులైనా 57 వేల ఎకరాలకు అధికారులు ఏడువేల ఎకరాలు మాత్రమే సమీకరించగలిగారు. మంగళగిరి ప్రాంతంలో 16,500 ఎకరాలకు కేవలం 410 మంది రైతులు 734 ఎకరాలను ఇచ్చారన్నారు. ప్రజా వ్యతిరేకతతో జరుగుతున్న ల్యాండ్ పూలింగ్‌పై ప్రభుత్వం బెంబేలె త్తి సీఆర్ఆర్ డీఏ అధికారుల ద్వారా రైతులను బెదిరింపులకు గురిచేసే ప్రకటనలు ఇప్పిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. భూ సమీకరణ పూర్తవకుండా రైతులకు ఒప్పంద హామీ పత్రాలు ఇవ్వకుండా, మార్చి తర్వాత రాజధాని పొలాల్లో పంటలు వేయడానికి వీల్లేదని సీఆర్డీఏ అధికారులు ఏ విధంగా ప్రకటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో ఇదే ప్రాంతాన్ని ఉడా పరిధిలోకి తీసుకునేందుకు అప్పటి ఉడా అధికారులు పావులు కదపగా వారి చర్యలను ఖండిస్తూ రైతులకు మద్దతు పలికిన చంద్రబాబు ఇప్పుడు ప్లేటు ఫిరాయించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ప్రస్తుతం రైతులు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలకు ప్రభుత్వం హడలెత్తి భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయలంటూ సీఆర్డీఏ అధికారులపై పడడంతో వారు ఈ విధంగా ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపించారు. రైతులకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు. -
సమీకరణలో స్తబ్దత
సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ ప్రక్రియ ముందుకు సాగటం లేదు. అధికారులు మొదట్లో చేసిన హడావుడి ఇప్పుడు గ్రామాల్లో కనిపించటం లేదు. ఆది నుంచి అనుకూలంగా ఉన్న తుళ్లూరు మండలం మెట్టరైతుల నుంచి సైతం ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) కమిషనర్ శ్రీకాంత్, గుంటూరు కలెక్టర్ కాంతి లాల్‌దండే ల్యాండ్ పూలింగ్ అధికారులతో ప్రతిరోజు సమీక్షిస్తున్నా ఫలితం నామమాత్రంగానే ఉంటుంది. ముఖ్యంగా రైతుల నుంచి తీసుకుంటున్న భూముల విస్తీర్ణం రోజు రోజుకు పెరగాల్సి ఉండగా, తగ్గుతోంది. సోమవారం 277 మంది రైతులు 560.31ఎకరాల భూములు ఇచ్చారు. ప్రక్రియ ప్రారంభమైన ఈ నెల 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు మొత్తం 1779 మంది రైతులు 3,885.05 ఎకరాలను మాత్రమే ఇచ్చేందుకు అంగీకార పత్రాలు అందజేశారు. ముఖ్యంగా రాజధాని ప్రతిపాదిత గ్రామాల రైతుల్లో భూములు ఇస్తే తామంతా ముఖ్యమంత్రి చేతిలో ఇరుక్కుపోతామనే ఆందోళన కనిపిస్తోంది. రాజధాని ప్రాంతానికి 30 వేల ఎకరాలు సమీకరిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ పూర్తి కావటానికి ఎన్నో రోజులు పడుతుందని అప్పటివరకు తమ పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు మాటలు నమ్మి భూములు ఇస్తే రైతు రుణమాఫీ మాదిరి మరోసారి మోసపోవాల్సి వస్తుందనే భయంతో రైతులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగానే తుళ్లూరు మండలం మెట్ట రైతులు పెద్దగా ఆసక్తి చూపటం లేదంటున్నారు. దీంతో భూ సమీకరణ ప్రక్రియ ముందుకు సాగటం లేదు. జరీబు భూముల రైతులు మొదటి నుంచి ల్యాండ్ పూలింగ్ను వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. రాజధాని ప్రాంత రైతుల్లో అత్మవిశ్వాసం నింపేందుకు సింగపూర్ బృందం పర్యటించిన ఆదివారం కూడా స్పందన కనిపించలేదు. మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లోనే తిష్టవేసి వరాలు కురిపిస్తున్నా ఇవేమీ భూ సమీకర ణను ముందుకు సాగేలా చేయలేకపోతున్నాయి. సంక్రాంతి లోపు 30 వేల ఎకరాల భూమిని సేకరించాలనే లక్ష్యంతో అధికారులు వడివడిగా అడుగులు వేసినా ఇప్పటి వరకు కేవలం 3,885.05 ఎకరాల భూమికి మాత్రమే 1,779 మంది రైతులు అంగీకార పత్రాలు సమర్పించారు. భూ సమీకరణకు సంబంధించి ఉద్దండ్రాయునిపాలెం, నవులూరు, నిడమర్రు రెండు యూనిట్లు, అబ్బురాజుపాలెంలో ఇంకా బోణీ కాలేదు. సోమవారం తాడేపల్లి, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో ఈప్రక్రియ ప్రారంభమైంది. రాయపూడి, వెంకటపాలెం, లింగాయపాలెం, మల్కాపురంలో సైతం స్పందన అంతంత మాత్రంగానే ఉంది. జరీబు రైతుల్లో ఎక్కువ మంది ఆసక్తి చూపటం లేదు. అధికారుల సమావేశం వాయిదా... భూ సమీకరణపై జరీబు భూముల రైతుల్లో వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదివారం రాయపూడిలో ఏర్పాటు చేసిన సమావేశం సైతం వాయిదా పడింది. తిరిగి సంక్రాంతి పండుగ తరువాత ఈ సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ సుబ్బారావు రైతులకు సమాచారం అందజేశారు. ఇదిలావుండగా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ సోమవారం తుళ్లూరు మండలంలో పర్యటించి భూ సమీకరణ జరుగుతున్న తీరును పరిశీలించారు.ఈ ప్రక్రియలో ఉన్న డిప్యూటీ కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. గుంటూరు ఆర్డీఓ భాస్కరనాయుడు కూడా ఈ ప్రాంతంలో పర్యటించారు. మరోవైపు సర్వేను ల్యాండ్స్ ఏడీ కిజిరియా కుమారి పరిశీలించి సిబ్బందికి తగుసూచనలు అందజేశారు. సోమవారం 277 మంది రైతులు 560.31ఎకరాల భూములు ఇవ్వగా, ఇప్పటివరకు మొత్తం 1,779 మంది రైతులు 3,885.05 ఎకరాల భూమిని ఇచ్చేందుకు అంగీకార పత్రాలు సమర్పించినట్టు ఆర్డీవో భాస్కరనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. -
మూడు గ్రామాల్లో భూ సమీకరణకు నోటిఫికేషన్
రైతులకు దరఖాస్తులు అందజేసిన అధికారులు మంగళగిరి రూరల్: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి గానూ మంగళగిరి మండలంలోని నీరుకొండ, కురగల్లు, కృష్ణాయపాలెం గ్రామాల్లో భూ సమీకరణ ప్రక్రియ బుధవారం ప్రారంభించినట్లు తహశీల్దార్ సీహెచ్ కృష్ణమూర్తి తెలిపారు. మండలంలోని కృష్ణాయపాలెం గ్రామ పంచాయితీ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ ఎం.ధనుంజయ, తహశీల్దార్ సత్యానందం, డిప్యూటీ తహశీల్దార్ శోభన్‌బాబు, కె.శ్రీనివాసరావులు రైతులకు భూ సమీకరణ దరఖాస్తులను అందజేశారు. భూ సమీకరణపై అభ్యంతరాలను ఈనెల 19వ తేదీన పంచాయితీ కార్యాలయంలో జరిగే గ్రామసభ దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. అదే విధంగా మండలంలోని నీరుకొండ గ్రామ పంచాయితీ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ ఎం.దాసు, తహశీల్దార్ ఈశ్వరయ్య, డిప్యూటీ తహశీల్దార్లు చంద్రశేఖర్, దైవాదీనంలు రైతులకు భూ సమీకరణ దరఖాస్తులను అందజేశారు. కురగల్లులో డిప్యూటీ కలెక్టర్ టి.వరభూషణరావు, తహశీల్దార్ డి.చంద్రశేఖరరావు, డిప్యూటీ తహశీల్దార్లు వి.నాగేశ్వరరావు, ఎం.బాల నరసింహారావులు భూ సమీకరణ దరఖాస్తులను రైతులకు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో వీర్వోలు, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు. తూళ్లురులో కొనసాగుతున్న ల్యాండ్‌పూలింగ్ రాయపూడి(తుళ్ళూరు): తుళ్ళూరు మండలంలో బుధవారం జరిగిన ల్యాండ్ పూలింగ్‌లో మొత్తం 326.94 ఎకరాల, 188 మంది రైతులు అంగీకార పత్రాలు ఇచ్చారు. గ్రామాల వారీగా వివరాలు ఇలా వున్నాయి. అబ్బురాజుపాలెంలో 8 మంది రైతులు 8.42 ఎకరాలు, బోరుపాలెంలో ముగ్గురు రైతులు 1.09 ఎకరాలు, నేలపాడులో 21 మంది రైతులు 44.42ఎకరాలు, దొండపాడులో 4 మంది రైతులు 4.27ఎకరాలు, పిచుకులపాలెంలో 5 మంది 4.29ఎకరాలు, కొండమరాజుపాలెంలో 5 రైతులు 7.64 ఎకరాలు, అనంతవరంలో 28 మంది 80.10 ఎకరాలు, నెక్కల్లులో 4 మంది 14 ఎకరాలు, శాఖమూరులో 36మంది 47.68 ఎకరాలు మందడం -2 లో 2 మంది రైతులు 2.13 ఎకరాలు,వెలగపూడిలో 16 మంది 26 .65ఎకరాలు, ఐనవోలు లో 19 మంది రైతులు 22 ఎకరాలు, తుళ్లూరు-1లో 20 మంది రైతులు 33.32 ఎకరాలు, తుళ్లూరు-2 లో 16 మంది , 30.93 ఎకరాలకు రైతులు అంగీకార పత్రాలను డిప్యూటీ కలెక్టర్లకు అందజేసి రసీదులు పొందారు. దీంతో ఇప్పటి వరకు తుళ్లూరు మండలంలో జరిగిన ల్యాండ్ పూలింగ్‌లో అంగీకార పత్రాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మండలంలో ఇంకా పూలింగ్ ప్రారంభం కాని పలు గ్రామాల్లో గురువారం మున్సిపల్ మంత్రి నారాయణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఎంపీపీ పద్మలత తెలిపారు. -
రెండో రోజు 629 ఎకరాలు
తుళ్ళూరు : నవ్యాంధ్ర రాజధాని కోసం భూ సమీకరణ ప్రక్రియ రెండోరోజు శనివారం కూడా కొనసాగింది. తుళ్లూరు మండలం నేలపాడు గ్రాంలో శుక్రవారం ల్యాండ్‌పూలింగ్ ప్రారంభం కాగా శనివారం ఆ గ్రామంతో పాటు నెక్కల్లు, అనంతవరం గ్రామాల్లోనూ భూములు సమీకరించారు. నెక్కల్లు, అనంతవరం గ్రామాల్లో నిర్వహించిన సభలకు మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణతోపాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ హాజరై రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు. స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండేతో పాటు జేసీ చెరుకూరి శ్రీధర్, ఆర్డీవో భాస్కరనాయుడు తదితరులు పాల్గొని రైతుల నుంచి ఫారం 9(1) లను తీసుకున్నారు. ఫారం9(2) లో అభ్యంతరాలను కూడా ఇవ్వవచ్చని ప్రజలను కోరారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు అంగీకరించిన రైతులు ఫారం 9(1) ఇవ్వగా వారికి అధికారులు భూ సమీకృత అధికారి ధ్రువీకరించిన రసీదు ఫారం 9(7)ను అందజేశారు. తొలుత స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ ల్యాండ్ పూలింగ్‌లో ధ్రువపత్రాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఎవరికి ఏవిధమైన సమస్యలు వచ్చినా తాను దగ్గరుండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతంలో యువకులు, విద్యావంతులు వృత్తి నైపుణ్యం సాధించాలని చెప్పారు. మాస్టర్‌ప్లాన్ వచ్చాక అమర్‌రాజా కంపెనీని ఈ ప్రాంతంలో స్థాపిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ మేలు చేయాలని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీసుకువచ్చార ని పేర్కొన్నారు. భూములు ఇచ్చి ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న రైతులకు ఆయన పేరుపేరున అభినందనలు తెలిపారు. జూన్ కల్లా సింగపూర్ కంపెనీ రాజధాని మ్యాప్‌ను ఇస్తారని వెను వెంటనే పనులు ప్రారంభమవుతాయన్నారు. శనివారం జరిగిన కార్యక్రమంలో అనంతవరం గ్రామానికి చెందిన 20 మంది రైతులు 150 ఎకరాలకు, నెక్కల్లులో మొత్తం రైతులు 920 మంది ఉండగా 32 మంది రైతులు 419 ఎకరాలకు అంగీకార పత్రాలను మంత్రి నారాయణ, ఎంపీ జయదేవ్‌లకు అందజేశారు. రెండో రోజు నేలపాడులో 25 మంది రైతులు 60 ఎకరాల అంగీకార పత్రాలు అందజేశారు. అనంతవరం భూముల వివరాలు.. భూమి రకం ఎకరాల్లో మొత్తం భూమి 2544.22 పట్టాభూమి 1968.54 ఎండోమెంట్ భూమి 81.22 చెరువులు 15.05 కొండలు 285.89 ఎస్సైన్డ్ 41.10 గ్రామ కంఠం 15.64 డొంకలు, రోడ్లు 137.78 మొత్తం రైతులు 1047 మంది నెక్కల్లు గ్రామ భూముల వివరాలు భూమి రకం ఎకరాల్లో మొత్తం భూమి 1411.41 పట్టాభూమి 1205 ఎండోమెంట్ 31 చెరువులు 30.5 అస్సైన్డ్ 28.82 డొంకలు 93.62 కొండలు 22 -
పూలింగ్ నేటి నుంచే
-
పూలింగ్ నేటి నుంచే
* 9 నెలల్లో యాజమాన్య ధ్రువపత్రాలు.. త్వరలో అసెంబ్లీలో బిల్లు * రాజధానిపై సీఎం ప్రకటన * ఇన్నర్, మిడిల్, ఔటర్ రింగ్రోడ్లుగా నిర్మాణ పరిధి * తొలిదశలో ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలో పనులు సాక్షి, హైదరాబాద్: రాజధానికి అవసరమైన భూ సమీకరణ ప్రక్రియను మంగళవారం నుంచి ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రపంచస్థాయి మౌలిక వసతులతో, అత్యాధునిక టెక్నాలజీతో నవ్యాంధ్ర రాజధానిని నిర్మిస్తున్నట్టు చెప్పారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజధాని భూ సమీకరణపై సీఎం విధాన ప్రకటన చేశారు. రాజధాని నిర్మాణ పరిధిని ఇన్నర్ రింగ్‌రోడ్డు, మిడిల్ రింగ్‌రోడ్డు, ఔటర్ రింగ్‌రోడ్డు పేరుతో మూడు భాగాలుగా విభజించామన్నారు. ఇందులో భాగంగా.. పక్కా వాస్తు ప్రకారం గుంటూరుకు సమీపంలో 75 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్‌రోడ్డు పరిధిలో తొలి దశ రాజధాని నిర్మాణం పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఆ తర్వాత గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో మిడిల్ రింగ్‌రోడ్డు 125 కిలోమీటర్ల పరిధిలో, ఔటర్ రింగ్‌రోడ్డు 200 కిలోమీటర్ల పరిధిలోనూ మరో రెండు దశల్లో నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు రాజధానికి భూ సమీకరణ ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానికి భూములిచ్చే రైతుల రుణమాఫీని (కుటుంబానికి గరిష్టంగా రూ.1.50లక్షలు) ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. ఇందుకోసం 22,405 మంది లబ్ధిదారులకు రూ.200 కోట్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. భూ సమీకరణకు సంబంధించిన బిల్లును త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. లాటరీ పద్ధతిలో స్థలాల కేటాయింపు రైతులు ప్రభుత్వానికి భూములు అప్పగించిన వెంటనే చట్టబద్ధమైన రసీదు ఇస్తామని, ఆ తర్వాత 9 నెలల్లో భూ సమీకరణయాజమాన్య ధ్రువపత్రాలను (ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికెట్ - ఎల్పీఓసీ) ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ‘రైతులు భూములు ఇచ్చిన నాటినుంచి మూడేళ్లలో అభివృద్ధి చేసిన భూములు వారికిస్తాం. రైతులు ఇచ్చే భూములు ఏ ప్రాంతమైతే (మెట్ట, జరీబు (ఏటా మూడు పంటలు పండే సారవంతమైన భూములు) అదే ప్రాంతంలో ప్లాట్లు ఇస్తాం. భూములిచ్చిన రైతులకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, నాలా ఫీజులు, మౌలిక వసతుల అభివృద్ధి ఫీజు తదితరాలు ఉండవు. అయితే ఇవి వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఒకసారి అమ్మడం లేదా కొనడం) వరకే వర్తిస్తాయి. రైతులకు నివాస, వాణిజ్య స్థలాలను వారి భూములను బట్టి ఆయా కేటగిరీల వారీగా లాటరీ పద్ధతి ద్వారా కేటాయిస్తాం. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న భూములకు భూ సమీకరణ యాజమాన్య ధ్రువపత్రాలను ఆ దేవాలయాలకే అందజేస్తాం. రైతులకు ఇచ్చే ప్యాకేజీ తరహాలోనే దేవాలయాలకూ పరిహారం ఉంటుంది. అసైన్ట్ భూములకు కూడా మెట్ట, జరీబు భూములుగా విభజించి, పదేళ్ల పాటు పట్టా రైతులకు ఇచ్చినట్టే పరిహారం ఇస్తాం..’ వివరించారు. ఇక్కడ కోల్పోయే పంట దిగుబడిని ఏవిధంగా భర్తీ చేస్తారన్న ప్రశ్నకు.. ఈ ప్రాంతాన్ని డ్రాట్ ప్రూఫ్ (కరువు రహిత) ప్రదేశంగా మారుస్తానంటూ చంద్రబాబు ముక్తాయింపునిచ్చారు. భూసమీకరణ ప్రాంతంలో భూములకు నష్టపరిహారం పొందని లేదా భూమిలేని సుమారు 12 వేల కుటుంబాలకు (ఇందులో కౌలుదారులున్నారు) నెలకు రూ. 2500 చొప్పున పదేళ్ల పాటు రాజధాని సామాజిక భద్రతా నిధి (క్యాపిటల్ రీజియన్ సోషల్ సెక్యూరిటీ ఫండ్) కింద చెల్లింపులు చేస్తామన్నారు. ‘రైతు కూలీలకు వృత్తినైపుణ్య శిక్షణనిస్తాం. శిక్షణా కాలంలో స్టైఫండ్ ఇస్తాం. అనంతరం ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలకు అవకాశం ఇస్తాం. ఇక కూలీలకు 365 రోజులూ పని ఉండేలా చూస్తాం. ఇళ్లు లేని వారికి ఉచితంగా ఇళ్లు ఇస్తాం. రహదారుల విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికీ కొత్తగా ఇళ్లు కేటాయిస్తాం. ఈ ప్రాంతంలో 2014 డిసెంబర్ 8 నాటికి స్థానికంగా నివాసం ఉన్న వారికి ఉచితంగా విద్య, వైద్యం అందిస్తాం. వృద్ధుల కోసం ఆశ్రమాలు, ఎన్టీఆర్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం..’ అని చెప్పారు. సమీకరణ చేస్తున్న ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగుతాయని సీఎం అన్నారు. సీఆర్డీఏ చట్టం వచ్చాక నిబంధనల మేరకే రిజిస్ట్రేషన్లు ఉంటాయని పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులు.. అంటే ఎకరా రెండెకరాల పొలం ఉన్న రైతులు ఒక్కరు లేదా గ్రూపుగా కలిసి ఒకే చోట భూమి కావాలన్నా ఇస్తామని అన్నారు. గ్రామ కంఠంలోని ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించేందుకు త్వరలోనే ధ్రువపత్రాలను జారీ చేస్తామని చెప్పారు. దొంగలు కోర్టుకెళతారు బాబు వివాదాస్పద వ్యాఖ్యలు రాజధాని కోసం భూ సమీకరణను వ్యతిరేకిస్తూ కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారన్న ప్రశ్నకు తీవ్రంగా స్పందిస్తూ.. చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులను దొంగలతో పోల్చారు. భూ సమీకరణపై కొందరు రైతులు కోర్టును ఆశ్రయిస్తున్నారనీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇప్పటికే నోటీసులు జారీ చేసిందన్న విషయాన్ని విలేకరులు గుర్తుచేయగా.. ‘చాలామంది ఎర్రచందనం దొంగలు కూడా కోర్టుకు వెళ్లారు కదా! ఏం చేశారు. ఇది కూడా అలాగే ఉంటుంది..’ అని ముఖ్యమంత్రి జవాబిచ్చారు. రాజధాని కోసం భూములు ఇవ్వలేమని రైతులు ఎవరైనా అంటే వారిపై చట్టపరంగా చర్యలుంటాయని హెచ్చరించారు. భూ సేకరణ ద్వారా తీసుకోవలసిన వస్తుందని స్పష్టం చేశారు. రాజధాని రావడం ఇష్టం లేని కొన్ని రాజకీయ పార్టీలు అక్కడికెళ్లి మొసలి కన్నీళ్లు కారుస్తున్నాయని, మరికొంతమంది దీనిపై రాజకీయాలు చేయాలని చూశారని, వాటిని పట్టించుకోమని అన్నారు. ప్రభుత్వోద్యోగాలు ఇవ్వలేం రాజధాని ప్రాంతానికి భూములిచ్చిన రైతులకు గానీ, కౌలుదారులకు గానీ, రైతు కూలీలకు గానీ ఎలాంటి ప్రభుత్వోద్యోగాలు ఇవ్వలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరమైతే నైపుణ్య శిక్షణ (స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ)నిచ్చి వారికి ప్రైవేటు ఉద్యోగాల్లో ప్రాధాన్యతనిస్తామని అన్నారు. ఈ ఆరు నెలల్లో మీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని విలేకరులు అడగ్గా.. నిద్రపోయే సమయం మినహా మిగతా సమయాన్నంతా ప్రజల కోసమే వెచ్చించానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తిచేస్తానని అన్నారు. చంద్రబాబు చెప్పిన మరికొన్ని ముఖ్యాంశాలు.. - నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఒక ము ఖ్య భవనానికి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు (దివంగత మాజీ మంత్రి) పేరు పెడతాం - ప్రస్తుతం ఈ భూముల్లో టేకు చెట్లు ఉన్నాయి. వాటిని రైతులే అమ్ముకోవచ్చు - నిమ్మ, సపోట, జామ తోటల రైతులకు ఎకరానికి ఏకమొత్తంగా రూ.50 వేలు అదనంగా ఇస్తాం - పేద కుటుంబాల వారు స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకునేందుకు రూ.25 లక్షల వరకు వడ్డీలేని రుణాలు - ప్రస్తుతం ఉన్న పంటలకు సంబంధించి తుది ఫలసాయం పొందేందుకు అనుమతి. తదుపరి పంటకు వీలుండదు - భూ యజమానుల జాబితాను బహిరంగంగా ప్రకటిస్తాం. సవరణలు స్వీకరించి తుది జాబితా ప్రకటిస్తాం - భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ గెయిన్స్, ఆదాయ పన్నుల మినహాయింపు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తాం - భూములిచ్చిన రైతులు వారి ప్లాట్లను మూడేళ్ల వరకు ఆగాల్సిన పనిలేకుండా ముందే అయినా అమ్ముకోవచ్చు - డబ్బు ఉన్న రైతులకు పారిశ్రామికవేత్తలుగా శిక్షణనిస్తాం. -
భూ సమీకరణపై అఖిలపక్షంతో చర్చించాలి
వాస్తు కోసమో, మూఢ నమ్మకాల కోసమో రాజధాని నిర్మాణం సరికాదు హేతుబద్ధత లేకుండా వ్యవహరిస్తే సింగూర్ తరహా ఉద్యమాలు ‘ఏపీ రాజధాని-భూ సమీకరణ’పై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ భేటీలో డిమాండ్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి భూ సమీకరణపై అఖిలపక్షంతో చర్చించకుండా, రైతుల్లో అపోహలు తొలగించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్లడం సరికాదని పలు రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు అన్నారు. రాష్ట్ర పరిస్థితులు, వనరులు, బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని వాస్తవ దృక్పథంతో ముందుకెళ్లాలన్నారు. వాస్తు కోసమో, మూఢ నమ్మకాల కోసమో రాజధానిని నిర్మిస్తామనడం క్షంతవ్యం కాదన్నారు. బ్లూ ప్రింట్ సమర్పించి కేంద్ర సాయాన్ని కోరకుండా ప్రభుత్వ పెద్దలు సింగపూర్, జపాన్ పర్యటనలు చేపట్టటాన్ని వక్తలు తప్పుపట్టారు. హేతుబద్ధత లేకుండా అశాస్త్రీయమైన విధానంలో భూ సమీకరణ చేపడితే సింగూర్ భూముల తరహా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.ఆంధ్రప్రదేశ్ ‘రాజధాని- భూ సమీకరణ’పై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి దీనికి అధ్యక్షత వహించగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. రైతులకనుకూలంగానే సుప్రీం తీర్పులు... ఏపీ రాజధాని ఎలా ఉండాలనే అంశంపై శివరామకృష్ణన్ కమిటీని నియమించినప్పుడు కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని జస్టిస్ లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. నదీ జలాల చెంత నిర్మాణాలు జరపరాదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మొండిగా నదీ ముఖ రాజధాని అనటం సరికాదన్నారు. కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే కుట్ర రాజధానికి భూ సమీకరణపై రైతుల్లో పలు అభిప్రాయాలున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. పారిశ్రామికవేత్తలను పెట్టుబడుల కోసం ఆహ్వానించేందుకే జపాన్, సింగపూర్ పర్యటనలని సీఎం చంద్రబాబు చెబుతున్నా.. ల్యాండ్‌పూలింగ్‌లో రైతుల నుంచి సేకరించిన భూముల్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేడానికేన్న అనుమానం వ్యక్తం చేశారు. సొంత ఇంటి నిర్మాణం కాదు: వాసిరెడ్డి భూ సమీకరణ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం రైతులకు శుష్క వాగ్దానాలు చేస్తోందని వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణం అంటే సొంత ఇంటి నిర్మాణం కాదన్నారు. వేల ఎకరాలు ఎక్కడా తీసుకోలేదు: కాంగ్రెస్ 28 రాష్ట్రాల్లో ఏ రాజధాని నిర్మాణానికి ఇన్ని వేల ఎకరాలు సేకరించలేదని, అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ విస్తీర్ణమే 25.9 చదరపు కిలోమీటర్లని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.తులసిరెడ్డి పేర్కొన్నారు. ఇవ్వకుంటే ‘గ్రీన్‌బెల్ట్’ కిందకే! సమీకరణకు అంగీకరించని రైతులను బలవం తం చేయరని, ఆ భూముల్ని గ్రీన్‌బెల్ట్ పరిధిలో తెచ్చే యోచన చేస్తున్నట్లు రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి విజయకుమార్ చెప్పారు. భూ సమీకరణపై రైతుల అభిప్రాయం తెలుసుకునేందుకు వెళ్ళిన పది వామపక్ష పార్టీలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం హేయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. ఏపీ కాంగ్రెస్ దళిత విభాగం అధ్యక్షులు కొరివి వినయ్‌కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు రాజధర్మం పాటించకుండా సామాజిక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. భూ సమీకరణలో వ్యాపార నీతిని ప్రదర్శిస్తే తీవ్ర ప్రతిఘటన ఎదురు కాకతప్పదని రాజకీయ సామాజిక విశ్లేషకులు టి.లక్ష్మీనారాయణ హెచ్చరించారు. -
ఇది పెట్టుబడుల బాట
సీఎం జపాన్ పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూ సమీకరణను రైతులు ఒకపక్క వ్యతిరేకిస్తున్నా.. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది.. పెట్టుబడులు పెట్టండంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోపక్క విదేశీ పెట్టు బడి దారులను ఆహ్వానిస్తున్నారు. ఆ విధంగా పెట్టుబడులు పెట్టేవారికి భూ కేటాయింపుతో పాటు అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని, మౌలికసదుపాయాలు ఏర్పాటు చేస్తామని జపాన్‌కు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు. ఆది వారం అర్ధరాత్రి ఆయన ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తల బృందంతో జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలో పెట్టుబడులకున్న సానుకూలాంశాలను అక్కడి ప్రభుత్వానికి, వివిధ కంపెనీలు, వాణిజ్య సంస్థల ప్రతినిధులకు వివ రిస్తారని రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు. జపాన్ పెట్టుబడి దారులకు వివరించేందుకు ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కూడా రూపొం దించారు. అందులో పేర్కొన్న పది లక్షల ఎకరా లూ ప్రభుత్వ భూమా? లేక ప్రైవేటు భూమా? అనేది ఎక్కడా స్పష్టం చేయకపోవడం గమనార్హం. ‘సన్‌రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పేరిట రూపొందించిన ఈ ప్రజెంటేషన్‌లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న అన్ని ప్రత్యేకాంశాలను పొందుపరిచారు. దేశంలో ఆంధ్రప్రదేశ్.. తూర్పు, ఆగ్నేయ దేశాలైన జపాన్, చైనా, థాయ్‌లాండ్, మలేసియా, సింగపూర్, శ్రీలంకలకు వ్యూహా త్మక ప్రాంతంగా ఉందని, పారిశ్రామిక, వ్యాపారానుకూల వాతావరణం రాష్ట్రంలో ఉందని అందులో వివరించారు. ‘దేశంలో మొట్టమొదటి తీరప్రాంత పారిశ్రామిక కారిడార్‌గా విశాఖపట్నం-చెన్నై రూపొందుతోంది. ఇది గేట్ వే టూ ఈస్ట్‌గా మారుతుంది. కొల్కతా నుంచి చెన్నై వరకు ఉన్న కారిడార్‌లో ఏపీ లోని తొమ్మిది జిల్లా ల్లో ఉన్న తీరప్రాంతమే కీలకం..’ అని పేర్కొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో పాటు ఈ మేరకు లఘు చిత్రాన్ని కూడా రూపొందించి బాబు బృందం జపాన్‌కు తీసుకెళ్లింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లోని వివరాలు.. 10 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ ‘రాష్ట్రంలో పారదర్శకమైన భూకేటాయింపు విధానం అమలుచేస్తున్నాం. 10 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకు ఉంది. (ప్రభుత్వ భూమా, ప్రైవేటు భూమా ?అన్నది వివరించలేదు.) ఈ భూముల ధరలూ అందుబాటులో ఉన్నాయి. అమ్మకానికి లేదా దీర్ఘకాలిక లీజుకు వీలుగా కేటాయింపు విధానం ఉంటుంది. పెట్టుబడులు పెట్టేవారు కొనే భూములకు స్టాంప్ డ్యూటీ పూర్తిగా వెనక్కి తిరిగి చెల్లిస్తాం. అందుబాటులో ఉన్న భూమి వివరాలను ఏపీ గవర్నమెంట్ పోర్టల్‌లో చూసుకోవచ్చు..’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నామనీ తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మెగా ఫుడ్ పార్కులు, విశాఖపట్నంలో ఐటీ హబ్, మధ్య కోస్తా జిల్లాల్లో మెరైన్ హబ్, చిత్తూరు, నెల్లూరులతో ఆటో హబ్ ఏర్పాటు . లోహ పరిశ్రమలు, ఉద్యాన పంటలు, రక్షణ, ఏరోస్పేస్‌లకు ఆలవాలంగా రాయలసీమ ప్రాంతాలు ఉండనుందని వివరించారు. 2022 నాటికి దేశంలో మూడో స్థానం ‘2022 నాటికి ఏపీని దేశంలోనే మూడో స్థానానికి, 2029 నాటికి అన్నిటికన్నా అగ్రస్థానంలోకి తీసుకువెళ్లనున్నాం. బెరైటీస్, మైకా, సున్నపురాయి నిక్షేపాలకు నిలయం. 2,950 సంస్థల ద్వారా 3.45 లక్షల మంది నైపుణ్యంకల యువకులు, విద్యార్థులు అందుబాటులో ఉన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, గనులు, ఫార్మా, ఆటోమొబైల్, ఇంజనీరింగ్ రంగాల్లో అభివృద్ధికి అవకాశాలున్నాయి. విశాఖ, గంగవరం, కష్ణపట్నం డీప్ సీ పోర్టులు, రానున్న ఐదేళ్లలో 17 వేల మెగావాట్ల ఉత్పత్తి ద్వారా జరగనున్న 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా,అత్యుత్తమ విద్యాసంస్థలు, వైద్యసంస్థలు, పర్యాటక ప్రాంతాలుండడంతోపాటు కొత్తగా మెట్రోరైళ్ల వ్యవస్థ ఏర్పాటుకాబోతోంది..’’ అని పేర్కొన్నారు. -
సరికొత్త ప్రజా రాజధాని
* ఏపీ కేపిటల్‌పై చంద్రబాబు * అందరి సహకారంతో ఏర్పడబోతోందన్న సీఎం * 2 నెలల్లో భూ సమీకరణని వెల్లడి * వీజీటీఎం పట్టణాల మధ్యనే కొత్త మెగాసిటీ * విజయవాడ దూరదర్శన్ ‘సప్తగిరి’ ప్రారంభం సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ పరిసరాల్లో నూతన రాజధాని నగర నిర్మాణం కోసం రెండు నెలల్లోగా భూ సమీకరణ ప్రక్రియ మొదలవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు, నాయకులు, రైతులందరి సహకారంతో సరికొత్త ప్రజా రాజధాని నగరం ఏర్పడబోతోందన్నారు. శనివా రం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో కలిసి విజయవాడ దూరదర్శన్ సప్తగిరి చానల్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. వీలైనంత త్వరగా ఒక్కో ప్రభుత్వ శాఖను ైహైదరాబాద్ నుంచి బెజవాడకు తరలించాల్సి ఉందన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టే ముఖ్య కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచే ప్రారంభం కానున్నాయని తెలిపారు. అక్టోబర్ 2న బెజవాడలో ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. తమ ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లుగానే విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి (వీజీటీఎం) పట్టణాల మధ్యలో మెగా సిటీ నిర్మాణానికి సిద్ధమైందన్నారు. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలోనే భూముల సమీకరణ ఉంటుందని, రైతులు, అధికారులు సమన్వయంతో సహకరించాలని కోరారు. రాజధాని అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలను ప్రసారం చేయాలని చంద్రబాబు విజయవాడ దూరదర్శన్ కేంద్రం అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నో చానళ్లు ఉన్నప్పటికీ డీడీపైనే ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందన్నారు. ఆకాశవాణి కేంద్రం కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుని మరింత వేగంగా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. టీవీలు సంచలనాలకు దూరంగా ఉండాలి: వెంకయ్యనాయుడు వెంకయ్య మాట్లాడుతూ.. టీవీ, మీడియా, సినిమా వంటి ప్రసార మాధ్యమాల్లో హింసను ఎక్కువగా చూపిస్తున్నారనీ, దీన్ని తగ్గించి తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలను ఎక్కువగా ప్రచారం చేయాలని సూచించారు. సొంత భావాలను వార్తలుగా గుప్పించి ప్రజల మీదకు వదిలే పద్ధతికి టీవీలు, పత్రికలు స్వస్తి పలకాలన్నారు. సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా ఉండాలని, సంగీత, సాహిత్య వినోద కార్యక్రమాలకు పెద్దపీట వేయాలని చెప్పారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం దూరదర్శన్ అభివృద్ధికి రూ.103 కోట్లను విడుదల చేస్తుందన్నారు. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పంపిన వీడియో సందేశాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. డీడీ డెరైక్టర్ జనరల్ విజయలక్ష్మీ చావ్లా దూరదర్శన్ ప్రగతిని వివరించారు. అనంతరం సీఎం వేదికపై ఏర్పాటు చేసిన రిమోట్‌ను ఆన్ చేసి సప్తగిరి చానల్ చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఆల్ ఇండియా రేడియోకు అందజేయాల్సిన ఈమని శంకరశాస్త్రి వీణానాదం సీడీని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఆకాశవాణికి పింగళి వెంకయ్య పేరు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి జాతీయ జెండా రూపశిల్పి కృష్ణా జిల్లాకు చెందిన పింగళి వెంకయ్య పేరు పెట్టారు. పింగళి వెంకయ్య దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుడే కాకుం డా త్రివర్ణ పతాకానికి రూపమిచ్చిన మహానుభావుడు. ఎన్టీఆర్ నా అభిమాన నటుడు: వెంకయ్య తన అభిమాన నటుడు ఎన్టీ రామారావు అని వెంకయ్యనాయుడు చెప్పారు. శనివారం విజయవాడలోని ఓ హోటల్లో వెస్టిక్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యాన జరిగిన ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు. దేశ పౌరులకు సామాజిక స్పృహ లేదని, తనకు అవకాశమిస్తే ఆ అంశంపై వారికి పాఠాలు బోధిస్తానని చెప్పారు. తనకు చింతకాయ పచ్చడన్నా, నెల్లూరు చేపల పులుసన్నా, ఆవకాయ, గోంగూర పచ్చళ్లన్నా ఇష్టమని చెప్పారు. కార్యక్రమం పేరు కాఫీ కబుర్లు కాగా.. వెంకయ్య కాఫీ తాగకపోవడంతో లెమన్ టీ తాగుతూ నిర్వహించారు.