రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్) కింద ఇవ్వనిపక్షంలో ఆ భూములను
‘రాజధాని భూసమీకరణ’పై హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్) కింద ఇవ్వనిపక్షంలో ఆ భూములను భూసేకరణ(ల్యాండ్ అక్విజిషన్) ద్వారా తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం గురువా రం హైకోర్టుకు నివేదించింది. ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) చట్టం కింద చేస్తున్న భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్)పై పిటిషనర్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని, వాటిపై రెండు వారాల్లో తగిన నిర్ణయం వెలువరిస్తామని కూడా తెలిపింది. ఇదే సమయంలో పిటిషనర్ల వ్యవసాయ కార్యకలాపాల్లో చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకోబోమని వివరించింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ మేరకు కోర్టుకు నివేదించారు.
ఈ నివేదనను రికార్డ్ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణకు ఈ కేసుకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సీఆర్‌డీఏ చట్టం కింద చేస్తున్న భూసమీకరణ నుంచి తమ భూములను మినహాయించేలా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ గుంటూరు జిల్లాకు చెం దిన దాదాపు 200 మంది రైతులు హైకోర్టులో వేర్వేరుగా నాలుగు పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. వీటిని జస్టిస్ రాజశేఖరరెడ్డి గురువారం విచారించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ప్రభుత్వం చేపట్టిన భూసమీకరణపై తమకు అభ్యంతరాలున్నాయన్నారు.
వాస్తవాలు చెప్పకుండా అధికారులు పిటిషనర్ల నుంచి భూసమీకరణకు అభ్యంతరం లేదంటూ సంతకాలు తీసుకున్నారని, పిటిషనర్లకు ఇప్పుడు వాస్తవాలు తెలిశాయన్నారు. వ్యవసాయ కార్యకలాపాలను అధికారులు అడ్డుకుంటున్నారని తెలిపారు. దీంతో రాష్ట్రప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునే పనిలోనే అధికారులు ఉన్నారని, అభ్యంతరాలపై రెండు వారాల్లో తగిన ఉత్తర్వులిస్తామని తెలిపారు.