నేటితో ముగుస్తున్న భూసమీకరణ గడువు
తాడికొండ : రాజధాని నిర్మాణ గ్రామాల్లో భూ సమీకరణ గడువు శనివారంతో ముగియనుంది. ఈ ప్రక్రియను జనవరి 1వ తేదీన ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పటివరకు 26,281 ఎకరాలను మాత్రమే సమీకరించగలిగింది. మెట్ట భూముల రైతులు సుముఖంగా ఉన్నప్పటికీ, ఏటిపట్టు గ్రామాల్లోని జరీబు రైతులు సమీకరణను వ్యతిరేకిస్తూ వచ్చారు. సారవంతమైన తమ భూములు ఇచ్చేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవడం లేదు. దీంతో ఆదిలో ఉన్న భూ సమీకరణ వేగం క్రమంగా తగ్గుతూ వచ్చింది.
సమీకరణకు ఈ నెల 28వ తేదీ చివరి రోజు అని ఎట్టిపరిస్థితుల్లోనూ గడువు పెంచబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. గురువారం రాజధాని ప్రాంత రైతులతో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో పరిహారం పెంచడంతో మరికొంత మంది ముందుకు వచ్చి భూములు ఇవ్వవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇదిలావుండగా, ఏటిపట్టు గ్రామాల్లో ఇప్పటివరకు జరిగిన భూ సమీకరణ ఇలా ఉంది. బోరుపాలెంలో 95 శాతం, అబ్బరాజుపాలెంలో 82 , రాయపూడిలో 80, లింగాయపాలెంలో 73, ఉద్దండ్రాయునిపాలెంలో 80 శాతం భూములను సమీకరించినట్టు అధికారులు చెబుతున్నారు.
అలాగే వెంకటపాలెంలో 70 శాతం భూములను ఇచ్చారంటున్నారు. మిగతా మెట్ట భూములు దాదాపు నూరుశాతానికి చేరినట్లు పేర్కొంటున్నారు. జరీబు భూములు ఇచ్చేందుకు గడువు పెంచాల్సి ఉంటుందని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు ఇవ్వకూడదనుకున్న రైతులు ఇప్పటికిప్పుడు ఇవ్వాలనుకుంటే కుటుంబీకులతో చర్చించాలి. కొందరు దూరప్రాంతాల్లో ఉండి ఉంటారు. వారిని కలసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో గడువు పెంచాల్సి వస్తుందని అంటున్నారు.
ఆఖరి రోజు
Published Sat, Feb 28 2015 2:37 AM | Last Updated on Tue, Aug 14 2018 2:31 PM
Advertisement