రాజధానికి భూములు ఇవ్వనివారు సాగు చేసుకునేందుకు అనుమతి ఇచ్చినవారు పంటలు వేసుకునేందుకు నిరాకరణ ఇప్పటికే కోటీశ్వరులుగా భూములివ్వని తాడేపల్లి, మంగళగిరి రైతులు ఇచ్చినవారికి ప్రభుత్వం ఇచ్చే ఎకరానికి వెయ్యి గజాల స్థలమే దిక్కు వెయ్యి గజాల స్థలానికి ఎన్నేళ్లకు మంచి ధర వస్తుందనే అనుమానాలు పునరాలోచనలో భూములు ఇచ్చిన తుళ్లూరు రైతాంగం అంగీకార పత్రాలు వెనక్కి తీసుకునే అవకాశాలపై సంప్రదింపులు
గుంటూరు : రాజధాని గ్రామాల్లో భూ సమీకరణకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించడంతో రైతులు తర్జనభర్జన పడుతున్నారు. మొదటి నుంచీ భూ సమీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు నడిపిన మంగళగిరి, తాడేపల్లి రైతులకు సానుకూలంగా, భూములు ఇచ్చిన తుళ్లూరు రైతులకు ప్రతికూలంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భూములు ఇచ్చేందుకు అంగీకార పత్రాలు ఇచ్చిన తుళ్లూరు రైతుల పొలాల్లో ప్రభుత్వం సాగును నిషేధించింది. దీంతో రబీలో పంటల సాగుకు వీల్లేకుండా పోయింది. అభ్యంతర పత్రాలు ఇచ్చిన తాడేపల్లి, మంగళగిరి రైతులకు మాత్రం అనుమతి లభించడంతో వారు ముమ్మరంగా రబీ పనులు చేసుకుంటున్నారు. భూ సమీకరణకు చట్టబద్ధత లేకపోవడంతో రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకోలేకపోతోంది. నిధుల కొరత కారణంగా భూ సేకరణకు ముందుకు వెళ్లలేకపోతోంది. దీంతో తాడేపల్లి, మంగళగిరి రైతుల పొలాలు వారి వద్దనే ఉన్నాయి.
పైగా తమ అభ్యంతర పత్రాల ఉద్యమానికి రాజకీయ పార్టీలు కూడా దన్నుగా నిలుస్తుండటంతో ఈ మండలాల రైతులు నిశ్చింతగా ఉన్నారు. మరోవైపు భూములిచ్చిన తుళ్లూరు రైతులకు మాత్రం ప్రభుత్వం ఇచ్చే కొద్ది గజాల స్థలమే మిగలనుంది. ఈ పరిస్థితుల్లోనే ఇప్పటివరకు సమీకరించిన భూమిని ఇతర పరిశ్రమలకు లీజుకు ఇచ్చేందుకు, అమ్మేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి, మంత్రులు ఇచ్చిన హామీలు నెరవేరే సూచనలు కనిపించకపోవడం, రాజధాని నిర్మాణం ప్రారంభం కాకుండానే ప్రభుత్వం తమ భూముల అమ్మకాలు, లీజులు ప్రారంభిస్తుందేమోనన్న ఆందోళనతో.. భూములిచ్చిన రైతులు పునరాలోచనలో పడ్డారు. ఇచ్చిన అంగీకారపత్రాలను ఉపసంహరించుకునే అవకాశాల కోసం న్యాయవాదులను సంప్రదిస్తున్నారు.
ఆశించిన స్థాయిలో సాగని సమీకరణ
భూ సమీకరణకు తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు మండలాల్లో గ్రామాల వారీగా వివిధ తేదీల్లో ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. నెల రోజుల వ్యవధిని గడువుగా నిర్ణయించారు. జనవరి 2 నుంచి 11 వరకు గ్రామాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా డెప్యూటీ కలెక్టర్లు విధుల్లో చేరకపోవడంతో భూ సమీకరణ లక్ష్యం చేరుకోలేక పోయామంటూ మంత్రి పి.నారాయణ గడువు తేదీని ఫిబ్రవరి 14 వరకు పొడిగించారు. అప్పటివరకు 29 గ్రామాల్లో 21,627 ఎకరాలను సమీకరించారు. అప్పటికి తుళ్లూరు మండలంలో 17,684, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో 3,943 ఎకరాలకు రైతులు అంగీకార పత్రాలు ఇచ్చారు. 31,205 ఎకరాల లక్ష్యానికి ఇంకా 9,578 ఎకరాలను సమీకరించాల్సి ఉంది. రైతుల కోరిక మేరకు భూ సమీకరణ గడువు తేదీని ఈ నెల 28 వరకు పొడిగించినట్టు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. ఈ ప్రకటన తుళ్లూరు మండల రైతుల్లో మరింత కలవరం సృష్టించింది. నెల రోజుల క్రితం అంగీకారపత్రాలు ఇచ్చినా ప్యాకేజీ చెల్లింపుపై ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వారిలో అనుమానాలు పెంచుతోంది. పైగా భూములు ఇచ్చిన తమ పంట భూముల్లో సాగుపై నిషేధం విధించడం, ఇవ్వనివారిని సాగుకు అనుమతించడం వారిలో తీవ్ర ఆగ్రహావేశాలు రగిలిస్తోంది. ప్రభుత్వ వైఖరి ఎంతవరకు సమంజసమని టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారులను రైతులు నిలదీస్తున్నారు. ఇచ్చిన ఎకరా భూమికి ప్రభుత్వం ఇవ్వనున్న 1,000 చదరపు గజాల స్థలానికి ఎన్నేళ్లకు మంచి ధర వస్తుందో, అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఏమీ పాలుపోని స్థితిలో తర్జనభర్జనలు పడుతున్నారు.
సందేహం.. సంశయం..
చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తిగా జరిగితే.. ప్రభుత్వం ఇవ్వనున్న 1,000 చదరపు గజాల స్థలానికి(చదరపు గజం రూ.30 వేల చొప్పున) రూ.3 కోట్లు వస్తాయనుకున్నా.., ఇప్పటి పరిస్థితులు అందుకు సానుకూలంగా లేవనే సందేహాలు భూములిచ్చిన రైతాంగంలో వ్యక్తం అవుతున్నాయి. కేంద్రం నుంచి సహకారం పూర్తిగా లేకపోవడంతో రాజధాని నిర్మాణం మూడేళ్లలో పూర్తికాదనే సందేహమూ వారిని వెన్నాడుతోంది. దీంతో ఇచ్చిన అంగీకారపత్రాలు ఉపసంహరించుకునే అవకాశాల కోసం న్యాయవాదులను సంప్రదిస్తున్నారు. మరోవైపు తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని రైతులు మొదటి నుంచి భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉన్నారు. ఉద్యమాన్నీ చేపట్టారు. వీరికి వైఎస్సార్‌సీపీతోపాటు ఇతర పార్టీలు మద్దతుగా నిలబడటంతో 3,943 ఎకరాలకే భూ సమీకరణ పరిమితమైంది. మిగిలిన రైతులు యధాతథంగా సాగు చేసుకుంటున్నారు.
పెరుగుతున్న సందేహాలు
చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు రైతుల్లో సందేహాలను పెంచుతున్నాయి. తాత్కాలిక రాజధాని నిర్మాణానికి ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి సమీకరిస్తున్న భూమికి గాను ఎకరాకు ఎకరా ఇస్తూ నిర్ణయం తీసుకుంది. తమకు మాత్రం ఎకరాకు 1,000 చదరపు గజాల స్థలం మాత్రమే ఇవ్వడంపై రైతులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించలేక తాము ఇచ్చిన భూములు విక్రయించే దిశగా చర్యలు తీసుకుంటుందేమోనన్న అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే అంగీకార పత్రాలు వెనక్కి తీసుకునే దిశగా రైతులు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.
భూములివ్వనివారే కోటీశ్వరులు !
Published Wed, Feb 18 2015 2:16 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement