ఇది పెట్టుబడుల బాట
సీఎం జపాన్ పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన
హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూ సమీకరణను రైతులు ఒకపక్క వ్యతిరేకిస్తున్నా.. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది.. పెట్టుబడులు పెట్టండంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోపక్క విదేశీ పెట్టు బడి దారులను ఆహ్వానిస్తున్నారు. ఆ విధంగా పెట్టుబడులు పెట్టేవారికి భూ కేటాయింపుతో పాటు అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని, మౌలికసదుపాయాలు ఏర్పాటు చేస్తామని జపాన్‌కు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు. ఆది వారం అర్ధరాత్రి ఆయన ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తల బృందంతో జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలో పెట్టుబడులకున్న సానుకూలాంశాలను అక్కడి ప్రభుత్వానికి, వివిధ కంపెనీలు, వాణిజ్య సంస్థల ప్రతినిధులకు వివ రిస్తారని రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు. జపాన్ పెట్టుబడి దారులకు వివరించేందుకు ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కూడా రూపొం దించారు.
అందులో పేర్కొన్న పది లక్షల ఎకరా లూ ప్రభుత్వ భూమా? లేక ప్రైవేటు భూమా? అనేది ఎక్కడా స్పష్టం చేయకపోవడం గమనార్హం. ‘సన్‌రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పేరిట రూపొందించిన ఈ ప్రజెంటేషన్‌లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న అన్ని ప్రత్యేకాంశాలను పొందుపరిచారు. దేశంలో ఆంధ్రప్రదేశ్.. తూర్పు, ఆగ్నేయ దేశాలైన జపాన్, చైనా, థాయ్‌లాండ్, మలేసియా, సింగపూర్, శ్రీలంకలకు వ్యూహా త్మక ప్రాంతంగా ఉందని, పారిశ్రామిక, వ్యాపారానుకూల వాతావరణం రాష్ట్రంలో ఉందని అందులో వివరించారు. ‘దేశంలో మొట్టమొదటి తీరప్రాంత పారిశ్రామిక కారిడార్‌గా విశాఖపట్నం-చెన్నై రూపొందుతోంది. ఇది గేట్ వే టూ ఈస్ట్‌గా మారుతుంది. కొల్‌కతా నుంచి చెన్నై వరకు ఉన్న కారిడార్లో ఏపీ లోని తొమ్మిది జిల్లా ల్లో ఉన్న తీరప్రాంతమే కీలకం..’ అని పేర్కొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో పాటు ఈ మేరకు లఘు చిత్రాన్ని కూడా రూపొందించి బాబు బృందం జపాన్‌కు తీసుకెళ్లింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లోని వివరాలు..
10 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్
‘రాష్ట్రంలో పారదర్శకమైన భూకేటాయింపు విధానం అమలుచేస్తున్నాం. 10 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకు ఉంది. (ప్రభుత్వ భూమా, ప్రైవేటు భూమా ?అన్నది వివరించలేదు.) ఈ భూముల ధరలూ అందుబాటులో ఉన్నాయి. అమ్మకానికి లేదా దీర్ఘకాలిక లీజుకు వీలుగా కేటాయింపు విధానం ఉంటుంది. పెట్టుబడులు పెట్టేవారు కొనే భూములకు స్టాంప్ డ్యూటీ పూర్తిగా వెనక్కి తిరిగి చెల్లిస్తాం. అందుబాటులో ఉన్న భూమి వివరాలను ఏపీ గవర్నమెంట్ పోర్టల్లో చూసుకోవచ్చు..’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నామనీ తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మెగా ఫుడ్ పార్కులు, విశాఖపట్నంలో ఐటీ హబ్, మధ్య కోస్తా జిల్లాల్లో మెరైన్ హబ్, చిత్తూరు, నెల్లూరులతో ఆటో హబ్ ఏర్పాటు . లోహ పరిశ్రమలు, ఉద్యాన పంటలు, రక్షణ, ఏరోస్పేస్‌లకు ఆలవాలంగా రాయలసీమ ప్రాంతాలు ఉండనుందని వివరించారు.
2022 నాటికి దేశంలో మూడో స్థానం
‘2022 నాటికి ఏపీని దేశంలోనే మూడో స్థానానికి, 2029 నాటికి అన్నిటికన్నా అగ్రస్థానంలోకి తీసుకువెళ్లనున్నాం. బెరైటీస్, మైకా, సున్నపురాయి నిక్షేపాలకు నిలయం. 2,950 సంస్థల ద్వారా 3.45 లక్షల మంది నైపుణ్యంకల యువకులు, విద్యార్థులు అందుబాటులో ఉన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, గనులు, ఫార్మా, ఆటోమొబైల్, ఇంజనీరింగ్ రంగాల్లో అభివృద్ధికి అవకాశాలున్నాయి. విశాఖ, గంగవరం, కష్ణపట్నం డీప్ సీ పోర్టులు, రానున్న ఐదేళ్లలో 17 వేల మెగావాట్ల ఉత్పత్తి ద్వారా జరగనున్న 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా,అత్యుత్తమ విద్యాసంస్థలు, వైద్యసంస్థలు, పర్యాటక ప్రాంతాలుండడంతోపాటు కొత్తగా మెట్రోరైళ్ల వ్యవస్థ ఏర్పాటుకాబోతోంది..’’ అని పేర్కొన్నారు.