రిక్తహస్తం బడ్జెట్ 2015 | central govt careless budget to ap | Sakshi
Sakshi News home page

రిక్తహస్తం బడ్జెట్ 2015

Published Sun, Mar 1 2015 12:28 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

central govt careless budget to ap

రాజధాని ఊసేలేని కేంద్ర బడ్జెట్
భూసమీకరణకూ నిధులు నిల్
మెట్రో రైలు, పోలవరం మొక్కుబడి కేటాయింపులతో సరి

 
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన విజయవాడకు కేంద్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపించింది. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ ప్రాంతానికి భారీగా నిధులు కేటాయిస్తారని రాజధాని ప్రాంతవాసులంతా ఆశించారు. గతంలో ప్రధాని నరేంద్రమోదీ తిరుపతి, విశాఖపట్నం ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచస్థాయి నగరం నిర్మించి ఇస్తామని చెప్పారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో దానికి మిత్రపక్షమైన తెలుగుదేశం అధికారంలోకి రావడం, ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తానంటూ చంద్రబాబు ఊదరగొడుతుండటంతో ఈసారి కేంద్ర బడ్జెట్‌లో రాజధానికి కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తారని అందరూ భావించారు. అందుకు భిన్నంగా బడ్జెట్‌లో నూతన రాజధాని ఊసే ఎత్తకపోవడం విస్మయం కలిగిస్తోంది.

భూసమీకరణకు నిధులేవీ?

తుళ్లూరు ప్రాంత రైతుల నుంచి భూసమీకరణకు ప్రభుత్వం సిద్ధమై ఇప్పటికే రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకుంది. ఆయా రైతులకు రెండుమూడు రోజుల్లో డబ్బులు ఇస్తామంటూ రాష్ట్ర మంత్రులు ఊదరగొడుతున్నారు. భూ సమీకరణకు సహకరించని రైతులపై భూసేకరణ ఆయుధాన్ని ప్రయోగిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో చెబుతున్న సీఎం చంద్రబాబు భూసమీకరణకు కావాల్సిన నిధులన్నీ కేంద్రమే ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇతర మంత్రులూ అదే ఆశతో ఉన్నారు. బడ్జెట్‌లో ఏమాత్రం నిధులు కేటాయించకపోవడంతో భూసమీకరణకు కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సమీకరించాల్సి వస్తుందని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఉన్న  రాష్ట్ర ప్రభుత్వం భూసమీకరణకు కావాల్సిన వేల కోట్లు ఎలా సమీకరించుకుంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక భూసేకరణ చట్టంలో మార్పులు చేర్పులు చేస్తూ  ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆర్డినెన్స్ తేవాలని ఏన్డీఏ ప్రభుత్వం భావించింది. ఆర్డినెన్స్ తెస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కొంత ఊరట లభించేది. ఎన్డీఏలోనే కొన్ని భాగస్వామ్య పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తుండటంతో ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్ వచ్చే అవకాశం లేదని, ప్రస్తుత చట్టంతో రాష్ట్ర ప్రభుత్వానికి భూసేకరణ సాధ్యం కాద ని రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో నూతన రాజ ధాని నిర్మా ణం శరవేగంతో జరుగుతుందనుకోవడం పొరపాటేనని పరి శీలకులు చెబుతున్నారు. మరోపక్క రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన, నూతన భవనాల నిర్మాణాలకు కావాల్సిన భారీ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

మెట్రో రైలుకు రూ.5.63 కోట్లు : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంలో నిర్మించతలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుకు బడ్జెట్‌లో కేవలం రూ.5.63 కోట్లు కేటాయించారు. ఈ నిధులు ఏమాత్రం సరిపోవని పలువురు అభిప్రాయపడుతున్నారు. మెట్రోరైలు ప్రాజెక్టుకు పనిచేసే సిబ్బంది జీతాలు, డీపీఆర్ నివేదికలు తయారు చేయడానికే ఈ నిధులు సరిపోతాయని, అందువల్ల పనులు నత్తనడకన సాగే అవకాశముందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని మెట్రో వర్గాలు అంచనా.
 పోలవరానికి రూ.100 కోట్లు : రాష్ట్రానికి ఎంతో కీలకమైన ప్రాజెక్టుగా భావిస్తున్న పోలవరానికీ అరకొర నిధులే కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు కేటాయించిన రూ.100 కోట్లు కాల్వల అభివృద్ధికే సరిపోతాయనే ఇంజనీర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే తరహాలో నిధులు కేటాయిస్తే రాబోయే పదేళ్లలో కూడా ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు.

 నిట్‌కు రూ.40 కోట్లు... రాజధాని జోన్ ప్రాంతంలోని ఆగిరిపల్లిలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని గతంలో కేంద్రం ప్రకటించింది. దీనికి బడ్జెట్‌లో రూ.40 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తిగా కేంద్రం ఆధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో ఇచ్చి రాష్ట్రం చేపట్టే ప్రాజెక్టులకు నిధులు తగ్గించడం గమనార్హం.
 
సామాన్యుడి నడ్డి విరుస్తున్న బడ్జెట్ !


బడ్జెట్‌లో కేబుల్, డిష్‌ల చార్జీలను పెంచుతున్నారు. వీటితో పాటు అనేక చానల్స్ రావడానికి వాడే సెటప్‌బాక్స్‌లపై పన్నులు విధించనున్నారు.
డెబిట్, క్రెడిట్ కార్డులపై చార్జీల బాదుడు పడనుంది.
బొగ్గు మీద సెస్ 100 నుంచి 200 శాతంపెంచుతున్నారు.
సిమెంట్‌పై పన్నుల భారం మోపడంతో రాబోయే రోజుల్లో నిర్మాణాలు భారమౌతాయి.
సిగరెట్, మద్యం, గుట్కా ధరలు ప్రతి బడ్జెట్ మాదిరిగానే యథావిధిగా పెంచారు.
టెలికాం సర్వీసులు, రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్, ప్లాస్టిక్ బ్యాగులపై పన్నుల భారం మోపుతున్నారు.
సెల్‌ఫోన్లు, ఫ్రిజ్‌లు, కంప్యూటర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, ఎల్‌ఈడీ బల్బులు, సోలార్ వాటర్ హీటర్లు వంటి వాటిపై పన్నుల భారం తగ్గించినా.. దీనివల్ల సామాన్య ప్రజలకు పెద్దగా ఉపయోగం ఉండదంటున్నారు.  
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement