మోదం ఖేదం
- ‘కారు’చౌక
- సెల్ ప్రియం
- బడ్జెట్‌పై సిటీజనుల్లో మిశ్రమ స్పందన
కేంద్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గ్రేటర్ పరిధిలో కొంచెం మోదం.. మరికొంచెం ఖేదం నింపింది. వాహనాలపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు నిర్ణయం వాహనదారుల్లో జోష్ నింపితే... రూ. రెండు వేల లోపు ధర గల సెల్‌ఫోన్లపై రూ. 100 వరకు భారం మోపడం అల్పాదాయ వర్గాలను కలవరపరుస్తోంది. వాహనాలపై పన్ను పోటు తగ్గింపు కొనుగోళ్లకు కొత్త ఊపు తేనుంది. ఈ నిర్ణయం అమ్మకందారుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు ఇంటిల్లిపాది కలిసి షి‘కారు’కెళ్లాలని ఎదురు చూస్తోన్న వేతనజీవుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
పెరగనున్న దూకుడు
ఇప్పటికే మిగతా మెట్రో నగరాల కంటే హైదరాబాద్‌లో అత్యధిక వాహనాలున్నాయి.
{పస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని రకాల వాహనాలు కలిపి సుమారు 39 లక్షల పైచిలుకు వాహనాలు ఉన్నాయి.
అవికాక ఏటా లక్షాయాభైవేల వాహనాలు కొత్తగా రోడ్డుపైకి వస్తున్నాయి.
పన్ను తగ్గింపుతో సిటీలో వాహనాల అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోనున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా.
ఓ అంచనా ప్రకారం ఈ ఏడాది కొత్త వాహనాల సంఖ్య రెండు లక్షలు దాటే అవకాశం ఉంది.
చిన్న కార్లు, ద్విచక్ర వాహనాల సంఖ్య మరింత పెరగనుంది.
ఈ బడ్జెట్ ఉన్నత ఆదాయ వర్గాలలో సైతం కొత్త ఆశలకు రెక్కలు తొడిగింది.
ఒక స్థాయి కార్ల నుంచి మరింత విలాసవంతమైన లగ్జరీ కార్లు కొనుగోలు చేసేందుకు వారికి అవకాశం లభించింది.
కుర్రకారు ఝామ్మంటూ దూసుకొని
పెరగనున్న ట్రా‘ఫికర్’
మెట్రో రైలు అందుబాటులోకి వచ్చేనాటికి వ్యక్తిగత వాహనాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని చెబుతున్న అంచనాలను తలకిందులు చేస్తూ ఏటేటా కొత్త వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంది.
తాజా నిర్ణయంతో వాహనాలు వేలాదిగా రోడ్లపైకి రానున్నాయి.
ఒక అంచనా ప్రకారం ఇపుడున్న 39 లక్షల వాహనాలు 2015 నాటికి 42 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది.
వాహనాల సంఖ్య ఇలా ఇబ్బడిముబ్బడిగా పెరిగితే నగరంలో మరిన్ని ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి.
రెండు దశాబ్దాల కిందట ఉన్న రోడ్లే నేటికీ కొనసాగుతుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగాయి.
ప్రస్తుతం రోడ్ల విస్తీర్ణం పెరగకుండా వాహనాలు మరింత పెరిగితే నగరం ట్రాఫిక్ వలయంలో విలవిలలాడటం ఖాయం.
సెల్‌ఫోన్లకు పన్నుపోటు
చిదంబరం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ గ్రేటర్‌లో అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు కొనుగోలు చేసే తక్కువ ధర ఫోన్లపై భారం మోపింది.
రెండు వేల లోపు లభ్యమయ్యే సెల్‌ఫోన్లపై 6 శాతం పన్ను విధించింది.
దీంతో ఇక తక్కువ ధర(రెండువేల లోపు) ఫోన్లపై రూ.90 నుంచి రూ.100 వరకు ధర పెరగనుంది.
రూ.5 వేలకు పైగా ధరల్లో లభ్యమయ్యే బ్రాండెడ్ సెల్‌ఫోన్లపై పన్నుభారం మోపకపోవడం ఊరట.
ఫలితంగా మహానగర పరిధిలో ఆండ్రాయిడ్, టచ్‌స్క్రీన్ ఫోన్ల మార్కెట్ విస్తరించనుంది.
ఇప్పటికే గ్రేటర్ పరిధిలో 40 లక్షలకు పైగా సెల్‌ఫోన్ కనెక్షన్లున్నట్లు అంచనా.
పన్నుభారం పెరిగినా సెల్‌ఫోన్ల హల్‌చల్ తగ్గదని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.