కలల మెట్రోకు రూ.416 కోట్లు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ వాసుల కలల మెట్రో ప్రాజెక్టుకు తాజా బడ్జెట్‌లో రూ.416 కోట్ల మేర నిధులు కేటాయించడంతో ప్రధాన నగరంలో మెట్రో పనులు ఊపందుకోనున్నాయి. ప్రస్తుతం నాగోలు-మెట్టుగూడ, ఎస్.ఆర్.నగర్-మియాపూర్ రూట్లో పనులు శరవేగంగా జరుగుతున్న విషయం విదితమే. ఇదే తరహాలో ప్రధాన నగరంలోని నాంపల్లి, బేగంపేట్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఆస్తుల సేకరణ వంటి ప్రక్రియలను వేగవంతం చేయడం.
బాధితులకు పరిహారం పంపిణీ, మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాల కల్పన, విద్యుత్, మంచినీరు వంటి సౌకర్యాల కల్పన, మెట్రో కారిడార్లలో హరితహారం నెలకొల్పడం తదితర పనులకు తాజా బడ్జెటరీ నిధులు ఉపయోగపడనున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పనులు వేగవంతమవుతాయని హెచ్‌ఎంఆర్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత గడువులోగా మెట్రో ప్రాజెక్టును పూర్తిచేయాలన్న తెలంగాణా రాష్ట్ర సర్కారు చిత్తశుద్ధి బడ్జెట్ కేటాయింపుల ద్వారా తేటతెల్లమైంది.