metro works
-
శరవేగంగా ఎయిర్పోర్ట్ మెట్రో నిర్మాణానికి ముందస్తు పనులు: ఎన్వీఎస్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎయిర్పోర్ట్ మెట్రో పనులను వేగవంతం చేయడానికి సమాంతరంగా అనేక ముందస్తు నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయని, అవి శరవేగంగా సాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. జనరల్ కన్సల్టెంట్ (జిసి) కోసం బిడ్ల సమర్పణకు ఈ నెల 20 చివరి తేదీ కాగా, ఈ నిపుణులైన ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు వచ్చే నెల మొదటి వారంలో నియమితులవుతారు. ఈలోగా మెట్రో అలైన్‌మెంట్‌ను పక్కాగా సరిదిద్దడానికి, స్టేషన్ల స్థానాలను నిర్ణయించడానికి సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. శాటిలైట్ ఆధారిత డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (DGPS) మరియు ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ అనే రెండు పద్ధతులు ఉపయోగించి, ఖచ్చితమైన కోఆర్డినేట్లను తెలుసుకోవడం కోసం సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌ల సాయంతో సర్వే పని జోరుగా జరుగుతోంది. శంషాబాద్ పట్టణానికి సమీపంలోని ఫోర్ట్ గ్రాండ్ అండర్‌పాస్ వరకు ఇప్పటిదాకా 21 కిలోమీటర్ల మేర సర్వే పూర్తయింది. ఈ నెలాఖరులోగా మొత్తం సర్వే పూర్తి కానుందని, ఆ తర్వాత అలైన్‌మెంట్‌ను తెలియజేసేలా పెగ్ మార్కింగ్ ప్రారంభిస్తామని ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. చదవండి: (ఆగస్టు 15లోపు 10 లక్షల ఉద్యోగాల భర్తీ : కిషన్‌రెడ్డి) స్టేషన్ స్థానాలను గుర్తించడానికి ఢిల్లీ మెట్రో వారు తయారు చేసిన డీపీఆర్ మామూలు రైల్వే ఇంజనీరింగ్ పద్ధతిని అనుసరించగా, నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేటలలో గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన భారీ వాణిజ్య మరియు నివాస అభివృద్ధిని గుర్తించడం ద్వారా ఇప్పుడు ఒక వినూత్న విధానాన్ని అవలంబిస్తున్నామని ఆయన అన్నారు. నానక్రాంగూడా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నార్సింగి, రాజేంద్రనగర్, శంషాబాద్ వంటి ప్రాంతాల అభివృద్ధికి హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌ను దృష్టిలో ఉంచుకొని, నగరాన్ని దాని శివార్లలోకి విస్తరించడం, పని ప్రదేశాలకు అరగంట కంటే తక్కువ ప్రయాణ దూరంలో సరసమైన ధరలకు గృహాలను అందించాలనే సీఎం కేసీఆర్ దార్శనికతకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ మెట్రోను రూపొందిస్తున్నామని ఎండీ పేర్కొన్నారు. ట్రాఫిక్ సర్వేలో స్థానిక ట్రాఫిక్ పోలీసు ఇన్స్పెక్టర్లను జతచేయడం వల్ల స్టేషన్ స్థానాలను సరిగా గుర్తించడంలోను, స్టేషన్ యాక్సెస్ సౌకర్యాలను తక్కువ ఖర్చుతో రూపొందించడంలోనూ మంచి ఫలితాలను ఇస్తోందని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. -
మాపై ఉన్న ద్వేషాన్ని ముంబై పై చూపించొద్దు: ఆదిత్య థాక్రే
ముంబై: శివసేన బీజేపీతో ఆది నుంచి వ్యతిరేకిస్తున్న ముంబైలోని వివాదాస్పదమైన మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టు పనులును ప్రారంభిస్తోంది ఏక్నాథ్ షిండే ప్రభుత్వం. దీంతో మాజీ మంత్రి ఆదిత్య థాక్రే మాపై ఉన్న ద్వేషాన్ని ముంబైపై చూపించొద్దు అంటూ అభ్యర్థించారు. మెట్రో కార్‌షెడ్ ప్రాజెక్టు కోసం పచ్చని అటవీ ప్రాంతన్ని నాశనం చేయవద్దని కోరారు. ఆరే అనే అటవీ ప్రాంతంలో ఈ మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంతగానో ప్రయత్నిస్తోంది. అయితే ఇది సుమారు 800ల ఎకరాలకు పైగా ఉన్న అటవీ ప్రాంతం. చుట్టు పక్కల చిరుతలు వంటి ఇతర జీవ జాతులు సంచరిస్తూ ఉండే ఆహ్లదభరితమైన ప్రాంతాన్ని అభివృద్ధి పేరుతో నాశనం చేయవద్దని థాక్రే విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ విషయమై పర్యావరణ కార్యకర్తలు భారీ నిరసనలు చేపట్టిన సంగతిని సైతం ఆయన గుర్తు చేశారు. వాస్తవానికి అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మెట్రో కార్ షెడ్ కోసం గుర్తించిన ప్రాంతం జీవవైవిధ్యం లేదా అటవీ భూమిగా వర్గీకరించబడలేదని, మెట్రో కార్బన్ని తగ్గిస్తుందంటూ వాదించారు. ఆ తర్వాత నిరసనకారుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని మెట్రో కార్ షెడ్‌ను కంజుర్‌మార్గ్‌కు మార్చాలని నిర్ణయించింది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2020లో బాంబే హైకోర్టుకు వెళ్లింది. పైగా ఈ భూమి తమ ఉప్పు శాఖకు చెందినదని పేర్కొంది. దీంతో హైకోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి ప్రాజెక్టు పనులు అటకెక్కాయి. అధికార పగ్గాలు చేపట్టంగానే ఏక్నాథ్ షిండే కక్ష్య సాధింపు చర్యలు మొదలు పెట్టారనే చెప్పాలి. అంతేకాదు ఏక్నాథ్ షిండే అధికారం చేపట్టిన వెంటనే ఆగిపోయిన ముంబై మెట్రో పనులను తిరిగి ప్రారంభమవ్వడం విశేషం. (చదవండి: మహారాష్ట్ర స్పీకర్‌గా రాహుల్ నర్వేకర్.. థాక్రేకు షాక్) -
వర్క్‌ఫ్రమ్ హోం: మరో ఏడాదిన్నర ఇచ్చేయండి
Work From Home Request To IT Firms: ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరుకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఇక్కడ కొలువైన ఐటీ కంపెనీలకు ప్రభుత్వం నుంచి కొత్త రకం విజ్ఞప్తి వచ్చింది. మరికొద్ది కాలం పాటు వర్క్‌ఫ్రం హోం కొనసాగించాలంటూ ఐటీ కంపెనీలను ప్రభుత్వం విశేషం. ఎప్పటి వరకు వర్క్‌ఫ్రం హోం దేశంలో ఐటీ పరిశ్రమలకు రాజధాని బెంగళూరు, వేల సంఖ్యలో ఇక్కడ ఐటీ కంపెనీలు నెలకొల్పారు. లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు ఈ నగరంలో నివసిస్తున్నారు. అయితే 2020లో వచ్చిన కరోనాతో అన్ని ఐటీ కంపెనీలు ఆఫీసులకు తాళాలు వేసి వర్క్‌ఫ్రం హోం విధానం అమలు చేస్తున్నాయి. ఇటీవల పరిస్థితులు కొంత మేరకు చక్కబడటంతో తిరిగి ఆఫీసులకు రావాల్సిందిగా ఐటీ ఉద్యోగులకు కంపెనీలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అయితే ఈ నిర్ణయాన్ని మరో ఏడాదిన్నర పాటు వాయిదా వేసుకోవాలని కర్నాటక ప్రభుత్వం కోరింది. 2022 డిసెంబరు వరకు వర్క్‌ఫ్రం హోం అమలు చేయాలని సూచించింది. వర్క్‌ఫ్రం హోం కారణం ఏంటీ బెంగళూరు మెట్రో రైలు కార్పోరేషన్ లిమిటెడ్ ఇటీవల అవుటర్ రింగ్ రోడ్డులో ఉన్న సిల్క్ రోడ్డు నుంచి కేఆర్‌పురం వరకు మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టింది. దాదాపు రెండేళ్ల పాటు ఈ పనులు సాగుతాయని కంపెనీ చెబుతోంది. దీంతో అవుటర్ రింగురోడ్డులో మెట్రో పనుల కోసం రోడ్డులో కొంత భాగాన్ని ఉపయోగిస్తారు. ఫలితంగా ఈ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ జాం సమస్యలు తలెత్తుతాయని కర్నాటక ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల మెట్రో పనులు పూర్తయ్యే వరకు ఐటీ కంపెనీలు వర్క్‌హోం అమలు చేయాలంటూ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్)కి కర్నాటక ప్రభుత్వం లేఖ రాసింది. ఎందుకీ పరిస్థితి ఎదురైంది బెంగళూరులో అవుటర్ రింగురోడ్డు పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ ఐటీ కంపెనీలు ఉన్నాయి. ప్రతీ రోజు ఈ రోడ్డుపై ట్రాఫిక్ జాం నిత్యకృత్యంగా మారింది. ఈ సమస్య పరిష్కరించడం బెంగళూరు పోలీసులకు తలనొప్పిగా మారింది. కరోనా ఎఫెక్ట్‌తో గత ఏడాదిన్నరగా ఈ రోడ్డులో ట్రాఫిక్ సమస్యల బాధ తప్పింది. ఇప్పుడు ఓ వైపు మెట్రో పనులు, మరో వైపు ఐటీ ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వస్తుండటంతో ట్రాఫిక్ సమస్య పెద్దదిగా మారుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తద్వారా ఇండియా ఐటీ హబ్‌గా పేరున్న బెంగళూరు బ్రాండ్‌కి చేటు జరుగుతుందనే ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ప్రత్యామ్నాయం లేదా ? ఉద్యోగులను ఇప్పుడప్పుడే ఆఫీసులకు పిలవద్దొన్న ఐటీ కంపెనీలను కోరిన ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలు కూడా వారికి సూచించింది. ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులను ఆఫీసులకు రమ్మంటే వారిని వ్యక్తిగత వాహనాల్లో కాకుండా బస్సులు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వచ్చేలా చూడాలంటూ సలహా ఇచ్చింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు పట్ల ఉద్యోగులకు అభ్యంతరాలు ఉంటే సైకిళ్లు వినియోగించేలా వారిని ప్రోత్సహించాలని కంపెనీలకు కర్నాటక సర్కార్ సూచించింది. హైదరాబాద్ పరిస్థితి ఏంటీ పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకి పెరిగిపోతుంది. బెంగళూరు తర్వాత ఐటీ రంగంలో ఆ స్థాయి ఉన్న నగరం హైదరాబాద్. ఇక్కడ సైతం ట్రాఫిక్ సమస్యలు తప్పలేదు. కరోనాకు ముందు ట్రాఫిక్ సమస్య కారణంగా షిఫ్ట్ టైమింగ్స్‌లో మార్పులు చేసుకోవాలని ఐటీ కంపెనీలను నగర పోలీసు విభాగం కోరింది. చదవండి : Flipkart: కిరాణా వర్తకులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ -
ఆరే కాలనీలో 29 మంది అరెస్ట్
ముంబై: మెట్రో కారు షెడ్డు నిర్మాణం కోసం ముంబై ఆరే కాలనీలోని ప్రముఖ గ్రీన్ లంగ్ స్పేస్‌లో చెట్లు నరికివేయడంపై నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రే చాలా మంది నిరసనకారులు చెట్టు కొట్టేయడానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. అయితే శనివారం ఉదయం పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరగడంతో 29 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు శనివారం ఉదయం ఆరే కాలనీలో చెట్లు కొట్టేసేందుకు రాగా, కాలనీలోని పర్యావరణ ప్రేమికులు భారీగా వచ్చి అడ్డుకున్నారు. కాగా, ఆరే కాలనీలోని దాదాపు 2,656 చెట్లు నరికేయకుండా ఆపాలని కోరుతూ ఎన్జీవోలు, పర్యావరణవేత్తలు నాలుగు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే చెట్లు కొట్టేయకుండా స్టే విధించేందుకు న్యాయమూర్తులు జస్టిస్ ధర్మాధికారి, జస్టిస్ ఏకే మీనన్‌లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వివాదంపై ప్రతిపక్షాలు అధికార బీజేపీపై తీవ్రంగా మండిపడుతున్నాయి. కాగా, ఆరే కాలనీలో చెట్లు కొట్టేయడం సిగ్గుచేటని శివసేన నేత ఆదిత్య ఠాక్రే ట్విట్టర్లో పేర్కొన్నారు. ముంబై మెట్రో–3 అధికారులను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌కు బదిలీ చేయాలంటూ మండిపడ్డారు. ఆరే కాలనీలో చెట్లు కొట్టేయకుండా పర్యావరణవేత్తలు, స్థానిక శివసేన కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసు బలగాలను మోహరించి ఆరే కాలనీలో విధ్వంసం సృష్టిస్తున్నారని అధికారులపై ఆరోపణలు చేశారు. -
మెట్రో పనులు ఆగలేదు: ఎన్వీఎస్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో నగరం లో మెట్రో ప్రాజెక్టు పనులు ఎక్కడా ఆగలేదని.. స్టేషన్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆదివారం ఒక ప్రక టనలో తెలిపారు. మెట్రో పునాదులు, పిల్లర్ల నిర్మాణ పనులు పూరై్తనందున వాటిపై వయాడక్ట్ సెగ్మెంట్లు, మెట్రో పట్టాలు, సిగ్నలింగ్ పనులు చేపడుతున్నామన్నారు. మెట్రో ప్రాజెక్టు లో 82 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. నాణ్యత విషయంలో రాజీ పడలేదని, అంత ర్జాతీయ ప్రమాణాల మేరకు మెట్రో పిల్లర్లు, స్టేషన్లు నిర్మిస్తున్నామన్నారు. ఇంజనీరింగ్ విధా నంలో అత్యాధునిక సాంకేతికతను నగర మెట్రో ప్రాజెక్టులో వినియోగిస్తున్నామన్నారు. వరదలు, భూకంపాలు, సునామీలు వంటి విపత్తులను సైతం సమర్థంగా ఎదుర్కొనే స్థాయిలో మెట్రో పునాదులు, పిల్లర్లు, స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. -
మెట్రో నిర్మాణ పనుల్లో అపశ్రుతి
- కారిడార్ నుంచి కిందపడ్డ ఇనుపరాడ్ - బెక్‌పై వెళ్తున్న గృహిణి తలకు తీవ్ర గాయాలు నాంపల్లి/కాచిగూడ: మెట్రో రైలు నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఖైరతాబాద్ షాదన్ కాలేజీలో తమ కుమార్తె స్టడీ సర్టిఫికెట్ తీసుకొచ్చేందుకు భర్తతో కలసి బైక్‌పై వెళ్తున్న మహిళ తలపై మెట్రో కారిడార్ నుంచి ఇనుపరాడ్ పడింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. నాంపల్లిలో జరుగుతున్న మెట్రో నిర్మాణ పనుల్లో శనివారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రెయిన్ బజార్‌కి చెందిన దంపతులు అబ్దుల్ హఫీజ్, ఉజ్మా హఫీజ్ (38) కుమార్తె ఖైరతాబాద్‌లోని షాదన్ కాలేజీలో ఎంసీసీ చదివింది. ఆమె స్టడీ సర్టిఫికెట్ తీసుకొచ్చేందుకు అబ్దుల్, ఉజ్మా ద్విచక్రవాహనంపై కాలేజీకి బయలుదేరారు. నాంపల్లి సుప్రభాత్ రెస్టారెంట్ సమీపంలోకి రాగానే... వెనకాల కూర్చున్న ఉజ్మా తలపై మెట్రో కారిడార్ నుంచి ఇనుప రాడ్ జారిపడింది. తలకు తీవ్ర గాయమైన ఉజ్మా ను వెంటనే సమీపంలోని మెడ్విన్ ఆసుపత్రికి తర లించారు. పరిస్థితి విష మంగా ఉండటంతో... అక్కడి నుంచి హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. తలకు ఆపరేషన్ చేసిన వైద్యులు.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జూబ్లీ చెక్ పోస్టు వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
జూబ్లీ చెక్ పోస్టు వద్ద మంగళవారం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. మెట్రో నిర్మాణ పనుల కారణంగా మూడు నెలల పాటు ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసు కోవాలని పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. -
మెట్రో రెండో దశపై అధ్యయనం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మెట్రోప్రాజెక్టు రెండోదశపై అధ్యయనం మొదలైంది. ఈమేరకు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మంగూసింగ్, హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిలు శుక్రవారం ప్రతిపాదిత రెండోదశ మార్గాల్లో విస్తృతంగా పర్యటించారు. సాధ్యాసాధ్యాలు, అవకాశాలు, సాంకేతిక, ఆర్థిక అంశాలపై సైఫాబాద్‌లోని మెట్రోరైలు భవన్లో ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. ప్రధానంగా రెండోదశ మెట్రో ప్రాజెక్టులో ఎల్బీనగర్–హయత్‌నగర్, మియాపూర్–పటాన్చెరు, నాగోల్–ఎల్బీనగర్, రాయదుర్గం–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మార్గాల్లో సుమారు 84 కి.మీ మార్గంలో రెండోదశ మెట్రో ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో ఈ అధ్యయనం మొదలైంది. కాగా ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం,ఎల్భీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా మార్గాల్లో తొలిదశ ప్రాజెక్టులో భాగంగా 72 కి.మీ మార్గంలో పనులు జరుగుతున్న విషయం విదితమే. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో లింకు లేకపోవడం పట్ల సీఎం కేసీఆర్ ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేయడంతోపాటు తక్షణం రెండోదశ మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధంచేయాలని హెచ్ఎంఆర్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో రైలు కార్పొరేషన్ ఇంజినీర్లు, ఉన్నతాధికారులు సంయుక్తంగా అధ్యయనం జరిపి మూడునెలల్లోగా నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. దృష్టిసారించాల్సిన అంశాలివీ.. ►l మెట్రో రైలు రెండోదశలో అత్యవసరంగా విస్తరించాల్సిన మార్గాలను గుర్తించాలి. ► ఉమ్మడి ఏ.పీ రాష్ట్రంలో మూడు మార్గాల్లో 72 కి.మీ మెట్రో ప్రాజెక్టును డిజైన్ చేశారు. కానీ నాగోల్–ఎల్బీనగర్ (కారిడార్–1,3)ల మధ్య మెట్రో ప్రాజెక్టును ఏర్పాటు చేయలేదు. దీంతో ఈ మార్గంలో అత్యవసరంగా మెట్రో ప్రాజెక్టు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల పరిశీలన. ► తొలిదశలో నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మాత్రమే మెట్రో ప్రతిపాదించారు. కానీ రెండోదశలో రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో మార్గాన్ని పొడిగించాలి. ఈమార్గంపై సమగ్ర అధ్యయనం చేపట్టాలి. అందుకయ్యే అంచనా వ్యయం,సాంకేతిక అంశాలను ప్రభుత్వానికి నివేదించాలి. ► మియాపూర్–ఎల్బీనగర్ మెట్రో మార్గంతోపాటు మియాపూర్–పటాన్చెరు, హయత్‌నగర్–ఎల్బీనగర్ ప్రతిపాదిత మెట్రో మార్గాల్లో సాంకేతిక, ఆర్థిక అంశాలపై అధ్యయనం, సాధ్యాసాధ్యాల పరిశీలన. ► మెట్రో మార్గాన్ని ఔటర్ రింగ్‌రోడ్డు, ఓఆర్ఆర్ గ్రోత్‌కారిడార్ పరిధిలో ఏర్పాటుకానున్న టౌన్‌షిప్‌లతో అనుసంధానించే అంశంపై సమగ్ర అధ్యయనం చేపట్టి. ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలి. తొలిదశ ప్రారంభ తేదీపై వీడని సందిగ్ధం.. కాగా మియాపూర్–ఎస్.ఆర్.నగర్(12 కి.మీ), నాగోల్–మెట్టుగూడ(8 కి.మీ) మార్గాల్లో మెట్రో మార్గం ప్రారంభానికి సిద్ధంగానే ఉన్నప్పటికీ ప్రారంభతేదీ ప్రకటించే విషయంలో ప్రభుత్వం మీనమేషాలులెక్కిస్తోంది. మరోవైపు పాతనగరంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గం విషయంలో ఎలాంటి స్పష్టతనివ్వకపోవడంతో 5.3 కి.మీ మార్గంలో మెట్రో పనులు ప్రారంభంకాకపోవడం గమనార్హం. -
ఆర్టీసీకి ‘మెట్రో’ బ్రేక్
గ్రేటర్లో రోజుకు 3వేల ట్రిప్పులు రద్దు మెట్రో మార్గాల్లో ట్రాఫిక్ రద్దీయే కారణం హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి సనత్‌నగర్‌కు సిటీ బస్సుకు నిర్ణయించిన రన్నింగ్ టైమ్ 35 నిమిషాలు. కానీ ఇప్పుడు గంట దాటినా గమ్యానికి చేరుకోవడంలేదు. అన్ని చోట్లా అదే పరిస్థితి. కేపీహెచ్‌బీ, హైటెక్‌సిటీ, వేవ్‌రాక్, కొండాపూర్, బోరబండ, మాదాపూర్, లింగంపల్లి, పటాన్చెరు, బీహెచ్ఈఎల్, కోఠి, దిల్సుఖ్నగర్, ఉప్పల్, ఈసీఐఎల్, మెహదీపట్నం, చార్మినార్, తదితర మార్గాల్లో నడిచే సిటీ బస్సులు ట్రాఫిక్ రద్దీ కారణంగా నత్తనడక నడుస్తున్నాయి. బస్సులకు కేటాయించిన రన్నింగ్ టైమ్ ట్రాఫిక్‌లోనే హరించుకు పోతోంది. దీంతో గ్రేటర్‌లోని 28 డిపోల పరిధిలో ప్రతి రోజు 3000కు పైగా ట్రిప్పులు రద్దవుతున్నాయి. 1.5 లక్షల మంది ప్రయాణ సదుపాయాన్ని కోల్పోతున్నారు. బేగంపేట్, జేబీఎస్, సికింద్రాబాద్ ఒలిఫెంటా బ్రిడ్డి, కోఠి, మలక్‌పేట్ తదితర మార్గాల్లో పలు ట్రిప్పుల బస్సులు రద్దు కానున్నాయి. -
మెట్రో పనుల్లో జాగ్రత్తలు పాటించండి
మంత్రి కేటీఆర్ సిటీబ్యూరో: నగరంలో జరుగుతున్న మెట్రో పనులను ప్రమాదాలకు తావులేని రీతిలో పూర్తిచేయాలని ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎల్అండ్టీ, హెచ్ఎంఆర్ అధికారులను ఆదేశించారు. ఇటీవల కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలిన దుర్ఘటన నేపథ్యంలో ఈ సూచనలు చేశారు. మెట్రో పనుల పురోగతిపై గురువారం ఆయన సైఫాబాద్‌లోని మెట్రోరైలుభవన్లో సమీక్షించారు. ప్రధాన నగరంలో జరుగుతున్న మెట్రో పిల్లర్ల నిర్మాణం, సెగ్మెంట్ల ఏర్పాటు, ఆర్ఓబీలు, ట్రాక్ నిర్మాణం పనులు జరుగుతున్న సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. పనుల్లో తీసుకుంటున్న జాగ్రత్తలపై తరచూ సమీక్షించాలని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి సూచించారు. మలక్‌పేట వద్ద రైలు ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కారణంగా తలెత్తుతున్న ట్రాఫిక్ ఇక్కట్లను తగ్గించాలని ఆదేశించారు. ఇందుకోసం నగర పోలీసు కమిషనర్, ఎల్అండ్టీ, హెచ్ఎంఆర్ అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, ఎల్అండ్టీ మెట్రో రైలు ఎండీ వీబీ గాడ్గిల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మెట్రో పనులపై కేటీఆర్ సమీక్ష
హైదరాబాద్ : నగరంలో జరుగుతున్న మెట్రో పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. గురువారం అధికారులతో సమావేశమైన ఆయన పలు విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. కోల్‌కతాలో ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదం నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మలక్ పేట వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
మెట్రో పనుల్లో బయటపడ్డ చారిత్రక ఆనవాళ్లు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో బౌద్ధం విలసిల్లిందా.. గతంలో ఇక్కడ బౌద్ధారామాలు, దాని అనుబంధ నిర్మాణాలు ఉండేవా.. దీనికి ఇప్పటి వరకు పెద్దగా చారిత్రక సాక్ష్యాలంటూ ఏమీ కనిపించలేదు. కానీ తాజాగా మెట్రో రైలు పనుల కోసం జరిపిన తవ్వకాల్లో లభించిన రాళ్లు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. సికింద్రాబాద్ ఒలిఫెంటా వంతెన నుంచి మెట్టుగూడకు వెళ్లే దారిలో జరుగుతున్న మెట్రో పనుల కోసం జరిపిన తవ్వకాల్లో ఎన్నో బండరాళ్లు బయటపడ్డాయి. వాటిని రోడ్డు పక్కన పడేసి పనులు పూర్తి చేస్తున్నారు. అయితే ఈ రాళ్లలో కొన్నింటికి ‘చారిత్రక’ ఆనవాళ్లు ఉండటంతో ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం ప్రతినిధి హరగోపాల్ వాటిని పరిశీలించారు. అవి మామూలు రాళ్లు కాదని, బౌద్ధానికి సంబంధించిన నిర్మాణాల్లో వాడిన రాళ్లని ఆయన తేల్చారు. గతంలో నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండలం కాటేపల్లి, చందుపట్లలోని పురాతన దేవాలయాల్లో లభించిన రాళ్లను ఇవి పోలి ఉన్నట్లు ఆయన చెప్పారు. బౌద్ధ మత నిర్మాణాల్లోనే ఇలాంటి నమూనా రాళ్లను వినియోగిస్తారని, సికింద్రాబాద్‌లో లభించిన రాళ్లను పరిశీలిస్తే వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో బౌద్ధ మతానికి సంబంధించిన నిర్మాణాలు ఉండి ఉండాలని తెలిపారు. కాలక్రమంలో అవి భూమిలో కూరుకుపోయి ఉంటాయని, మెట్రో పనుల్లో ఇలాంటి రాళ్లు బయటపడి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. -
మెట్రోపనులు ఆలస్యానికి కేసీఆర్ కారణం
-
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు
హైదరాబాద్ : నగరంలోని అంబర్‌పేట-గోల్నాక ప్రధాన రహదారిలో శనివారం వాహనదారులు నరకయాతన పడ్డారు. మెట్రో రైలు పనుల కారణంగా మలక్‌పేట వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అఫ్జల్‌గంజ్, ఎంజీబీఎస్ నుంచి దిల్సుఖ్నగర్ వైపు వెళ్లే వాహనాలను... అదే విధంగా విజయవాడ నుంచి దిల్సుఖ్నగర్ మీదుగా అఫ్జల్‌గంజ్, ఎంజీబీఎస్ల వైపు వచ్చే వాటిని అంబర్‌పేట శ్రీరమణ చౌరస్తా నుంచి గోల్నాక మీదుగా అప్జల్‌గంజ్ వైపు మళ్లిస్తున్నారు. వాహనాల రద్దీని తక్కువగా అంచనా వేయటంతో అంబర్‌పేట రోడ్డులో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. వారం క్రితం ట్రయల్ వేసిన ట్రాఫిక్ అధికారులు సమస్య తీవ్రతను అంచనా వేయకుండానే ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడ్డారు. దీంతో రోడ్లన్నీ పెద్ద సంఖ్యలో వాహనాలతో నిండిపోయాయి. వాటిని క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ అధికారులు నానా హైరానా పడ్డారు. ఖైరతాబాద్ లో దారి మళ్లింపు.. ఖైరతాబాద్ జంక్షన్లో జరుగుతున్న మెట్రో పనుల నేపథ్యంలో పలు దారులను అధికారులు ఈ రోజు మూసివేశారు. నిత్యం ట్రాఫిక్‌తో కిటకిటలాడే కేసీపీ గెస్ట్‌హౌజ్ చౌరస్తా నుంచి ఖైరతాబాద్ వెళ్లే వాహనదారులు చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద యూ టర్న్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, ఆనంద్ నగర్ కాలనీ శ్రీధర్ ఫంక్షన్ హాల్ నుంచి ఖైరతాబాద్ చౌరస్తాకు వెళ్లే వాహనదారులు ఫ్రీ లెఫ్ట్ తీసుకొని కేసీపీ సిగ్నల్ వద్ద యూటర్న్ తీసుకొని ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, రాజ్‌భవన్ రహదారులకు వెళ్లాల్సి ఉంటుంది. -
అసెంబ్లీ మార్గంలో మెట్రో పనులు షురూ
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు పబ్లిక్ గార్డెన్స్-అసెంబ్లీ ప్రాంతంలో మెట్రోరైల్ మార్గం పనులు ప్రారంభమయ్యాయి. 18 పిల్లర్లకు అవసరమైన పునాదులు, వాటిపై మెట్రో పట్టాలు పరిచేందుకు వీలుగా వయాడక్ట్ సెగ్మెంట్లను ఏర్పాటు చేసే పనులను రేయింబవళ్లు పూర్తి చేయనున్నట్లు ఎల్ అండ్ టీ, హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. పనులను రెండు నెలల వ్యవధిలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నాయి. అక్కడ బస్టాపులున్న ప్రాంతాన్ని బారికేడ్లతో మూసివేశారు. హజ్‌హౌస్ ఎదురుగా ఒకే మార్గంలో వాహనాలను దారిమళ్లించి పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం మొజంజాహీ మార్కెట్ జంక్షన్ మినహా గాంధీభవన్ వరకు మెట్రో పిల్లర్లు, వాటిపై వయాడక్ట్ సెగ్మెంట్ల ఏర్పాటు పూర్తయిన విషయం విది తమే. కీలకమైన అసెంబ్లీ ప్రాంతంలో మెట్రోమార్గంపై స్పష్టత రావడంతో ఇక్కడ పనులు ఊపందుకున్నాయి. అసెంబ్లీ, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజగుట్ట మార్గంలో మెట్రోపనులు పూర్తయితే ఎల్బీనగర్-మియాపూర్(కారిడార్1) మార్గంలో సుమారు 29 కిలోమీటర్ల మేర మెట్రో పనులు పూర్తయినట్లే. ఈ మార్గంలో మెట్రో రైళ్లు 2016 చివరి నాటికి రాకపోకలు సాగించే అవకాశాలుంటాయి. ప్రస్తుతం పాతనగరం, సుల్తాన్‌బజార్ మినహా మిగతా ప్రాం తాల్లో మెట్రో పనులు ఊపందుకున్న విషయం విదితమే. ముఖ్యమైన కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా బ్రిడ్జి అనుసంధానం విధానంలో పనులు చేపడుతున్నారు. -
ఖైరతాబాద్-పంజాగుట్ట: బస్సుల మళ్లింపు
హైదరాబాద్: మెట్రోరైలు నిర్మాణ పనుల దృష్ట్యా పంజాగుట్ట - ఖైరతాబాద్ మార్గంలో ఆర్టీసీ బస్సులను దారి మళ్లించనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ పురుషోత్తమ్ నాయక్ సోమవారం వివరాలను వెల్లడించారు. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే కొన్ని బస్సులను రాజ్‌భవన్, యశోద హాస్పిటల్, సోమాజీగూడ క్రాస్‌రోడ్స్, పంజాగుట్ట క్రాస్‌రోడ్స్ మీదుగా అమీర్‌పేట వైపు మళ్లిస్తారు. మరికొన్ని బస్సులను ఖైరతాబాద్, ఆర్టీఏ కార్యాలయం, తాజ్‌బంజారా, జీవీకే మాల్, నిమ్స్ వెనుక గేట్, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట క్రాస్‌రోడ్స్ మీదుగా అమీర్‌పేట వైపు మళ్లించనున్నట్టు తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి 25 వరకు ఈ మార్పులు అమల్లో ఉంటాయని.. ప్రయాణీకులు సహకరించాలని కోరారు. -
మెట్రో పనులతో ట్రాఫిక్ ఆంక్షలు
బంజారాహిల్స్: మెట్రో పనుల కారణంగా హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ నెల 17వ తేదీ నుంచి 20 వరకు, వచ్చే నెల 1 నుంచి 30 వరకు జూబ్లీహిల్స్ రహదారుల్లో అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని తెలిపారు. ఈ నెల 17 నుంచి 20 వరకు వెంకటగిరి నుంచి వచ్చే వాహనాలను జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10 నుంచి రోడ్ నెం. 36 వైపు మళ్లించనున్నారు. అలాగే వచ్చే నెల 1 నుంచి 30 వరకు మాదాపూర్ వైపు నుంచి జూబ్లీహిల్స్ వైపు వచ్చే వాహనాలను ఉషాకిరణ్ చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ క్లబ్ మీదుగా ప్రధాన రహదారిలో ఉన్న నాగదేవతా టెంపుల్ వైపు మళ్లిస్తారు. -
ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్‌గా జూబ్లీహిల్స్
బంజారాహిల్స్: నగరంలోనే అత్యంత రద్దీ జంక్షన్‌గా జూబ్లీహిల్స్ చౌరస్తాను రెండేళ్లలో ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్‌గా మారుస్తామని, ఇందుకోసం డిజైన్ కూడా పూర్తయినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. మెట్రో పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణంపై జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, మెట్రో, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్ అధికారుల బృందం బుధవారం జూబ్లీహిల్స్ చౌరస్తాలో పర్యటించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక్కడ ఎనిమిది రోడ్ల కారణంగా ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని, ఇకపై తేలికగా వాహనాలు వెళ్లేందుకు వీలుగా డిజైన్ రూపొందించామని కమిషనర్ తెలిపారు. ఇందులో భాగంగానే మెట్రో పనుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న ప్రాంతాలను గుర్తించామన్నారు. సమస్య పరిష్కారానికి బంజారాహిల్స్ రోడ్ నెం. 2 వైపు నుంచి పెద్దమ్మ గుడి వైపు జూబ్లీహిల్స్ చౌరస్తా మీదుగా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందన్నారు. మెట్రో పనులకు ఆటంకం కలగకుండా ఈ ఫ్లై ఓవర్ల నిర్మాణం అనుసంధానం చేస్తామన్నారు. ఇక్కడ ఫ్లై ఓవర్, మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసం రెండు వారాల్లో టెండర్లు పిలవనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేందర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ జంక్షన్లో ట్రాఫిక్ క్రమబద్దీకరణపై ప్రస్తుతం సమీక్ష జరుగుతుందన్నారు. హెచ్ఎంఆర్ ఎండి ఎన్.వీ.ఎస్. రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మెట్రోపనులు ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, సెంట్రల్ జోనల్ కమిషనర్ రవికిరణ్, పంజగుట్ట ట్రాఫిక్ ఏసీపీ మాసుమ్బాషా, జీహెచ్ఎంసీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ధన్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంత ఎత్తయినా.. చకచకా కట్టేస్తాం
ఎంత ఎత్తయినా మాకేంటి చకచకా కట్టేస్తామంటున్నారు కార్మికులు. పంజగుట్ట ఫ్లైఓవర్ వద్ద మెట్రో పనుల్లో వేగంగా సాగుతున్నాయి. భారీ పిల్లర్ నిర్మాణ పనులను జోరుగా చేపడుతున్నారు కార్మికులు. మధ్యాహ్నం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పనులను కొనసాగిస్తున్నారు. పంజగుట్ట ఫ్లైఓవర్ పైనుంచి ఈ దృశ్యాలను చూసిన వారు ఆహా అనక మానరు. - ఫొటో: దయాకర్ తూనుగుంట్ల -
శతాబ్ది ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సనత్‌నగర్-భరత్‌నగర్ స్టేషన్ల మధ్య జరుగుతున్న మెట్రో పనుల దృష్ట్యా శతాబ్ది ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్ నుంచి పుణే వెళ్లవలసిన ఈ ట్రైన్ (12025/12026) మెట్రో పనుల దృష్ట్యా లింగంపల్లి వరకే పరిమితమైంది. దీంతో లింగంపల్లిలో దిగిన ప్రయాణికులు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు, అలాగే సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి స్టేషన్‌కు చేరుకునేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ శనివారం ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. మధ్యాహ్నం సమయంలో ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు రెండు ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పుణేలో ట్రైన్ బయలుదేరే సమయంలోనే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లింగంపల్లి వరకే వెళ్లనున్నట్లు అనౌన్స్మెంట్ చేశారు. లింగంపల్లిలోనూ అలాంటి అనౌన్స్‌మెంట్‌తో సమాచారం అందజేశారు. ఎస్సెమ్మెస్ ద్వారా కూడా సమాచారం అందజేసినట్లు ద.మ.రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
మలక్‌పేట్‌లో మెట్రో పనుల వల్ల ట్రాఫిక్ మళ్లింపు
హైదరాబాద్: మలక్‌పేట్‌లో మెట్రో పనుల వల్ల ట్రాఫిక్ మళ్లించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇవాళ రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలు చాదర్ఘట్, అంబర్పేట్ , గోల్ నాకా మీదుగా వెళ్లలాన్ని పోలీసులు వాహనాదారులకు సూచించారు. -
మెట్రో ఎఫెక్ట్: రెండు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
మెట్రో రైలు పనుల కారణంగా హైదరాబాద్ నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దిల్సుఖ్నగర్ నుంచి కోఠి వెళ్లే వాహనాలను మూసారాం బాగ్ వద్ద మళ్లించారు. అలాగే ఎంజీబీఎస్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే వాహనాలను చాదర్‌ఘాట్ సమీపంలో దారి మళ్లించారు. ఈనెల 13వ తేదీ శనివారం నుంచి రెండు నెలల పాటు చాదర్‌ఘాట్ నుంచి మలక్‌పేట వరకు తిరిగే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. మెట్రోరైలు పనులను ఆ ప్రాంతంలో ముమ్మరంగా చేపట్టాల్సిన కారణంగా ఈ మార్పుచేర్పులు చేశారు. -
పేదలకు అండదండ
⇒ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వ నిర్ణయం ⇒4 లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం ⇒సర్కారుకు భారీగా ఆదాయం ⇒సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలకు కార్యాచరణ ⇒మెట్రో అలైన్‌మెంట్‌పై మరోమారు సమావేశం సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ప్రభుత్వ స్థలాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న నిరుపేదలకు శుభవార్త. 80 నుంచి 125 చదరపు గజాల విస్తీర్ణంలో ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. సీఎం కేసీఆర్ సమక్షంలో మంగళవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల నగరంలోని సుమారు మూడు లక్షల నిరుపేద కుటుంబాలకు సాంత్వన కలగనుంది. 125 గజాలు దాటిన నిర్మాణాలను సైతం నిర్ణీత రుసుంతో క్రమబద్ధీకరించాలన్న అఖిల పక్షం నిర్ణయంతో మరో లక్ష మందికి మేలు కలగనుంది. గతంలో ఉచితంగా 80 గజాల ఇళ్లను క్రమబద్ధీకరించగా... ఈ మారు దాన్ని 125 గజాలకు పెంచడం విశేషం. గతంలోని నిబంధనలు అడ్డుగా పెట్టుకుని ఒకే కుటుంబ సభ్యులు, కొంతమంది పెద్దలు వివిధ పేర్లతో 80 గజాల స్థలాలను సొంతం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఊపందుకోనున్న మెట్రో పనులు సుల్తాన్‌బజార్, అసెంబ్లీ ప్రాంతాల్లో మెట్రో అలైన్మెంట్ మార్పునకు విపక్షాలు అంగీకరించడంతో ఆయా ప్రాంతాల్లో మెట్రో పనులు ఊపందుకోనున్నాయి. సుల్తాన్‌బజార్ నుంచి కాకుండా కోఠి ఉమెన్స్ కళాశాల మీదుగా మెట్రో మార్గం మళ్లనుంది. అసెంబ్లీ వెనక వైపు నుంచి మెట్రో మార్గాన్ని మళ్లించేందుకు అన్ని పక్షాలూ అంగీకారం తెలిపాయి. ఇక జేబీఎస్-ఫలక్‌నుమా (కారిడార్-2) రూట్లో అలైన్మెంట్ మార్పు చేయాల్సిందేనంటూ ఎంఐఎం పట్టుబట్టినట్లు తెలిసింది. లేనిపక్షంలో పాత నగరంలో వెయ్యికి పైగా నిర్మాణాలకు నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేసింది. ఈ విషయమై ఈనెల 16న నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశంలో మరోమారు అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు తెలపాలని సీఎం సూచించారు. దీంతో ఈ మార్గంలో అలైన్మెంట్ మార్పుపై వేచిచూడక తప్పని పరిస్థితి నెలకొంది. కాసుల పంట నగరంలోని యూఎల్సీ భూములను ఆక్రమించుకొని 1400 ఎకరాల్లో నిర్మించుకున్న 33,127 ఇళ్లు, భవనాలు, 200 ఎకరాల్లోని 1927 వాణిజ్య సంస్థలను క్రమబద్ధీకరించడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం ఈ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో సర్కారుకు కాసుల పంట పండనుంది. నగరంలో రెవెన్యూ శాఖ ఇప్పటికే గుర్తించిన యూఎల్సీ భూమి 114.22 ఎకరాలు, ప్రభుత్వ భూమి 25 ఎకరాలను విక్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రైవేటు వ్యక్తులు, సంస్థల కబంధ హస్తాల్లో ఉన్న ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకోవాలని సీఎం అధికార యంత్రాగాన్ని ఆదేశించినట్లు తెలిసింది సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు హుస్సేన్‌సాగర్ చుట్టూ బహుళ అంతస్తుల భ వన నిర్మాణానికి అన్ని పార్టీల నుంచి మద్దతు లభించడంతో ప్రభుత్వం త్వరలోనే ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి. అఖిలపక్ష సమావేశంలో ఇతర అంశాలపై కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాల నిర్మాణానికి మాత్రం ఎవరి నుంచీ వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అంతేకాకుండా నగర కీర్తిని ఇనుమడింపజేసేందుకు వాటిని నిర్మించాలని అభిప్రాయపడ్డారు. దీంతో పాటు పాటిగడ్డ, నర్సింగ్ కాలేజీ, దిల్కుష్ గెస్ట్ హౌస్, రాఘవ టవర్స్, లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్, బుద్ధభవన్ తదితర ప్రాంతాల్లో భారీ టవర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వినాయక సాగర్ నిర్మాణంపై ప్రతిష్టంభన హుస్సేన్‌సాగర్‌లోనే వినాయక నిమజ్జనం చేపట్టాలని బీజేపీ సహా పలు పార్టీలు అఖిలపక్ష సమావేశంలో పట్టుబట్టిన నేపథ్యంలో ఇందిరాపార్క్ దగ్గర వినాయకసాగర్ నిర్మాణంపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ అంశంపైనా ఈనెల 16న జరగనున్న సమావేశంలో స్పష్టత రానుంది. -
కలల మెట్రోకు రూ.416 కోట్లు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ వాసుల కలల మెట్రో ప్రాజెక్టుకు తాజా బడ్జెట్లో రూ.416 కోట్ల మేర నిధులు కేటాయించడంతో ప్రధాన నగరంలో మెట్రో పనులు ఊపందుకోనున్నాయి. ప్రస్తుతం నాగోలు-మెట్టుగూడ, ఎస్.ఆర్.నగర్-మియాపూర్ రూట్లో పనులు శరవేగంగా జరుగుతున్న విషయం విదితమే. ఇదే తరహాలో ప్రధాన నగరంలోని నాంపల్లి, బేగంపేట్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఆస్తుల సేకరణ వంటి ప్రక్రియలను వేగవంతం చేయడం. బాధితులకు పరిహారం పంపిణీ, మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాల కల్పన, విద్యుత్, మంచినీరు వంటి సౌకర్యాల కల్పన, మెట్రో కారిడార్లలో హరితహారం నెలకొల్పడం తదితర పనులకు తాజా బడ్జెటరీ నిధులు ఉపయోగపడనున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పనులు వేగవంతమవుతాయని హెచ్ఎంఆర్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత గడువులోగా మెట్రో ప్రాజెక్టును పూర్తిచేయాలన్న తెలంగాణా రాష్ట్ర సర్కారు చిత్తశుద్ధి బడ్జెట్ కేటాయింపుల ద్వారా తేటతెల్లమైంది.