
అసెంబ్లీ మార్గంలో మెట్రో పనులు షురూ
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు పబ్లిక్ గార్డెన్స్-అసెంబ్లీ ప్రాంతంలో మెట్రోరైల్ మార్గం పనులు ప్రారంభమయ్యాయి. 18 పిల్లర్లకు అవసరమైన పునాదులు, వాటిపై మెట్రో పట్టాలు పరిచేందుకు వీలుగా వయాడక్ట్ సెగ్మెంట్లను ఏర్పాటు చేసే పనులను రేయింబవళ్లు పూర్తి చేయనున్నట్లు ఎల్ అండ్ టీ, హెచ్‌ఎంఆర్ వర్గాలు తెలిపాయి. పనులను రెండు నెలల వ్యవధిలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నాయి. అక్కడ బస్టాపులున్న ప్రాంతాన్ని బారికేడ్‌లతో మూసివేశారు.
హజ్‌హౌస్ ఎదురుగా ఒకే మార్గంలో వాహనాలను దారిమళ్లించి పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం మొజంజాహీ మార్కెట్ జంక్షన్ మినహా గాంధీభవన్ వరకు మెట్రో పిల్లర్లు, వాటిపై వయాడక్ట్ సెగ్మెంట్ల ఏర్పాటు పూర్తయిన విషయం విది తమే. కీలకమైన అసెంబ్లీ ప్రాంతంలో మెట్రోమార్గంపై స్పష్టత రావడంతో ఇక్కడ పనులు ఊపందుకున్నాయి.
అసెంబ్లీ, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజగుట్ట మార్గంలో మెట్రోపనులు పూర్తయితే ఎల్బీనగర్-మియాపూర్(కారిడార్1) మార్గంలో సుమారు 29 కిలోమీటర్ల మేర మెట్రో పనులు పూర్తయినట్లే. ఈ మార్గంలో మెట్రో రైళ్లు 2016 చివరి నాటికి రాకపోకలు సాగించే అవకాశాలుంటాయి. ప్రస్తుతం పాతనగరం, సుల్తాన్‌బజార్ మినహా మిగతా ప్రాం తాల్లో మెట్రో పనులు ఊపందుకున్న విషయం విదితమే. ముఖ్యమైన కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా బ్రిడ్జి అనుసంధానం విధానంలో పనులు చేపడుతున్నారు.