మెట్రో పనుల్లో బయటపడ్డ చారిత్రక ఆనవాళ్లు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో బౌద్ధం విలసిల్లిందా.. గతంలో ఇక్కడ బౌద్ధారామాలు, దాని అనుబంధ నిర్మాణాలు ఉండేవా.. దీనికి ఇప్పటి వరకు పెద్దగా చారిత్రక సాక్ష్యాలంటూ ఏమీ కనిపించలేదు. కానీ తాజాగా మెట్రో రైలు పనుల కోసం జరిపిన తవ్వకాల్లో లభించిన రాళ్లు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. సికింద్రాబాద్ ఒలిఫెంటా వంతెన నుంచి మెట్టుగూడకు వెళ్లే దారిలో జరుగుతున్న మెట్రో పనుల కోసం జరిపిన తవ్వకాల్లో ఎన్నో బండరాళ్లు బయటపడ్డాయి. వాటిని రోడ్డు పక్కన పడేసి పనులు పూర్తి చేస్తున్నారు.
అయితే ఈ రాళ్లలో కొన్నింటికి ‘చారిత్రక’ ఆనవాళ్లు ఉండటంతో ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం ప్రతినిధి హరగోపాల్ వాటిని పరిశీలించారు. అవి మామూలు రాళ్లు కాదని, బౌద్ధానికి సంబంధించిన నిర్మాణాల్లో వాడిన రాళ్లని ఆయన తేల్చారు. గతంలో నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండలం కాటేపల్లి, చందుపట్లలోని పురాతన దేవాలయాల్లో లభించిన రాళ్లను ఇవి పోలి ఉన్నట్లు ఆయన చెప్పారు.
బౌద్ధ మత నిర్మాణాల్లోనే ఇలాంటి నమూనా రాళ్లను వినియోగిస్తారని, సికింద్రాబాద్‌లో లభించిన రాళ్లను పరిశీలిస్తే వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో బౌద్ధ మతానికి సంబంధించిన నిర్మాణాలు ఉండి ఉండాలని తెలిపారు. కాలక్రమంలో అవి భూమిలో కూరుకుపోయి ఉంటాయని, మెట్రో పనుల్లో ఇలాంటి రాళ్లు బయటపడి ఉంటాయని ఆయన పేర్కొన్నారు.