ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్‌గా జూబ్లీహిల్స్
బంజారాహిల్స్: నగరంలోనే అత్యంత రద్దీ జంక్షన్‌గా జూబ్లీహిల్స్ చౌరస్తాను రెండేళ్లలో ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్‌గా మారుస్తామని, ఇందుకోసం డిజైన్ కూడా పూర్తయినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. మెట్రో పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణంపై జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్, మెట్రో, హెచ్‌ఎండీఏ, వాటర్ వర్క్స్ అధికారుల బృందం బుధవారం జూబ్లీహిల్స్ చౌరస్తాలో పర్యటించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇక్కడ ఎనిమిది రోడ్ల కారణంగా ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని, ఇకపై తేలికగా వాహనాలు వెళ్లేందుకు వీలుగా డిజైన్ రూపొందించామని కమిషనర్ తెలిపారు. ఇందులో భాగంగానే మెట్రో పనుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న ప్రాంతాలను గుర్తించామన్నారు. సమస్య పరిష్కారానికి బంజారాహిల్స్ రోడ్ నెం. 2 వైపు నుంచి పెద్దమ్మ గుడి వైపు జూబ్లీహిల్స్ చౌరస్తా మీదుగా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందన్నారు. మెట్రో పనులకు ఆటంకం కలగకుండా ఈ ఫ్లై ఓవర్ల నిర్మాణం అనుసంధానం చేస్తామన్నారు.
ఇక్కడ ఫ్లై ఓవర్, మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసం రెండు వారాల్లో టెండర్లు పిలవనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేందర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ జంక్షన్‌లో ట్రాఫిక్ క్రమబద్దీకరణపై ప్రస్తుతం సమీక్ష జరుగుతుందన్నారు. హెచ్‌ఎంఆర్ ఎండి ఎన్.వీ.ఎస్. రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మెట్రోపనులు ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, సెంట్రల్ జోనల్ కమిషనర్ రవికిరణ్, పంజగుట్ట ట్రాఫిక్ ఏసీపీ మాసుమ్‌బాషా, జీహెచ్‌ఎంసీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ధన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.