సాక్షి, హైదరాబాద్: నగరంలోని సనత్‌నగర్-భరత్‌నగర్ స్టేషన్‌ల మధ్య జరుగుతున్న మెట్రో పనుల దృష్ట్యా శతాబ్ది ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్ నుంచి పుణే వెళ్లవలసిన ఈ ట్రైన్ (12025/12026) మెట్రో పనుల దృష్ట్యా లింగంపల్లి వరకే పరిమితమైంది. దీంతో లింగంపల్లిలో దిగిన ప్రయాణికులు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు, అలాగే సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి స్టేషన్‌కు చేరుకునేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ శనివారం ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. మధ్యాహ్నం సమయంలో ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు రెండు ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పుణేలో ట్రైన్ బయలుదేరే సమయంలోనే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లింగంపల్లి వరకే వెళ్లనున్నట్లు అనౌన్స్‌మెంట్ చేశారు. లింగంపల్లిలోనూ అలాంటి అనౌన్స్‌మెంట్‌తో సమాచారం అందజేశారు. ఎస్సెమ్మెస్ ద్వారా కూడా సమాచారం అందజేసినట్లు ద.మ.రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
శతాబ్ది ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
Published Sun, Feb 8 2015 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM
Advertisement
Advertisement