
మెట్రో పనుల్లో జాగ్రత్తలు పాటించండి
మంత్రి కేటీఆర్
సిటీబ్యూరో: నగరంలో జరుగుతున్న మెట్రో పనులను ప్రమాదాలకు తావులేని రీతిలో పూర్తిచేయాలని ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్ అధికారులను ఆదేశించారు. ఇటీవల కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలిన దుర్ఘటన నేపథ్యంలో ఈ సూచనలు చేశారు. మెట్రో పనుల పురోగతిపై గురువారం ఆయన సైఫాబాద్‌లోని మెట్రోరైలుభవన్‌లో సమీక్షించారు. ప్రధాన నగరంలో జరుగుతున్న మెట్రో పిల్లర్ల నిర్మాణం, సెగ్మెంట్ల ఏర్పాటు, ఆర్‌ఓబీలు, ట్రాక్ నిర్మాణం పనులు జరుగుతున్న సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
పనుల్లో తీసుకుంటున్న జాగ్రత్తలపై తరచూ సమీక్షించాలని హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి సూచించారు. మలక్‌పేట వద్ద రైలు ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కారణంగా తలెత్తుతున్న ట్రాఫిక్ ఇక్కట్లను తగ్గించాలని ఆదేశించారు. ఇందుకోసం నగర పోలీసు కమిషనర్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్ అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు ఎండీ వీబీ గాడ్గిల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.