
ప్రాజెక్ట్పై చర్చిస్తున్న ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ ఎండీ మంగూసింగ్, హెచ్‌ఎంఆర్‌ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మెట్రోప్రాజెక్టు రెండోదశపై అధ్యయనం మొదలైంది. ఈమేరకు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మంగూసింగ్, హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిలు శుక్రవారం ప్రతిపాదిత రెండోదశ మార్గాల్లో విస్తృతంగా పర్యటించారు. సాధ్యాసాధ్యాలు, అవకాశాలు, సాంకేతిక, ఆర్థిక అంశాలపై సైఫాబాద్‌లోని మెట్రోరైలు భవన్‌లో ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. ప్రధానంగా రెండోదశ మెట్రో ప్రాజెక్టులో ఎల్బీనగర్–హయత్‌నగర్, మియాపూర్–పటాన్‌చెరు, నాగోల్–ఎల్బీనగర్, రాయదుర్గం–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మార్గాల్లో సుమారు 84 కి.మీ మార్గంలో రెండోదశ మెట్రో ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో ఈ అధ్యయనం మొదలైంది.
కాగా ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం,ఎల్భీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా మార్గాల్లో తొలిదశ ప్రాజెక్టులో భాగంగా 72 కి.మీ మార్గంలో పనులు జరుగుతున్న విషయం విదితమే. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో లింకు లేకపోవడం పట్ల సీఎం కేసీఆర్ ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేయడంతోపాటు తక్షణం రెండోదశ మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధంచేయాలని హెచ్‌ఎంఆర్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో రైలు కార్పొరేషన్ ఇంజినీర్లు, ఉన్నతాధికారులు సంయుక్తంగా అధ్యయనం జరిపి మూడునెలల్లోగా నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు.
దృష్టిసారించాల్సిన అంశాలివీ..
►l మెట్రో రైలు రెండోదశలో అత్యవసరంగా విస్తరించాల్సిన మార్గాలను గుర్తించాలి.
► ఉమ్మడి ఏ.పీ రాష్ట్రంలో మూడు మార్గాల్లో 72 కి.మీ మెట్రో ప్రాజెక్టును డిజైన్ చేశారు. కానీ నాగోల్–ఎల్బీనగర్ (కారిడార్–1,3)ల మధ్య మెట్రో ప్రాజెక్టును ఏర్పాటు చేయలేదు. దీంతో ఈ మార్గంలో అత్యవసరంగా మెట్రో ప్రాజెక్టు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల పరిశీలన.
► తొలిదశలో నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మాత్రమే మెట్రో ప్రతిపాదించారు. కానీ రెండోదశలో రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో మార్గాన్ని పొడిగించాలి. ఈమార్గంపై సమగ్ర అధ్యయనం చేపట్టాలి. అందుకయ్యే అంచనా వ్యయం,సాంకేతిక అంశాలను ప్రభుత్వానికి నివేదించాలి.
► మియాపూర్–ఎల్బీనగర్ మెట్రో మార్గంతోపాటు మియాపూర్–పటాన్‌చెరు, హయత్‌నగర్–ఎల్బీనగర్ ప్రతిపాదిత మెట్రో మార్గాల్లో సాంకేతిక, ఆర్థిక అంశాలపై అధ్యయనం, సాధ్యాసాధ్యాల పరిశీలన.
► మెట్రో మార్గాన్ని ఔటర్ రింగ్‌రోడ్డు, ఓఆర్‌ఆర్ గ్రోత్‌కారిడార్ పరిధిలో ఏర్పాటుకానున్న టౌన్‌షిప్‌లతో అనుసంధానించే అంశంపై సమగ్ర అధ్యయనం చేపట్టి. ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలి.
తొలిదశ ప్రారంభ తేదీపై
వీడని సందిగ్ధం..
కాగా మియాపూర్–ఎస్.ఆర్.నగర్(12 కి.మీ), నాగోల్–మెట్టుగూడ(8 కి.మీ) మార్గాల్లో మెట్రో మార్గం ప్రారంభానికి సిద్ధంగానే ఉన్నప్పటికీ ప్రారంభతేదీ ప్రకటించే విషయంలో ప్రభుత్వం మీనమేషాలులెక్కిస్తోంది. మరోవైపు పాతనగరంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గం విషయంలో ఎలాంటి స్పష్టతనివ్వకపోవడంతో 5.3 కి.మీ మార్గంలో మెట్రో పనులు ప్రారంభంకాకపోవడం గమనార్హం.